అమర్ అక్బర్ ఆంటోని రివ్యూ

కొద్ది సంవత్సరాలుగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడాయన. దీంతో హీరోలెవరూ సినిమాలు తీసేందుకు కూడా ఆసక్తి చూపలేదు. ఇలాంటి సమయంలో మాస్ మహరాజ్ రవితేజ.. ఒక ఛాన్స్ ఇచ్చాడు. అదే ‘అమర్ అక్బర్ ఆంటోని’. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘నీకోసం’, ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’ సినిమాలు వచ్చాయి. చాలా కాలం తర్వాత వచ్చిన సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. గోవా బ్యూటీ ఇలియానా కూడా చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించనుండడం ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ వంటి బడా నిర్మాణ సంస్థ తెరకెక్కించడం కూడా సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. మరి ఇన్ని విశేషాలున్న ‘అమర్ అక్బర్ ఆంటోని’ ప్రేక్షకులను ఆకట్టుకుందా..?

కథ
అమర్(రవితేజ), ఐశ్వర్య(ఇలియానా) కుటుంబాలు అమెరికాలో వ్యాపారం చేస్తూ అక్కడే స్థిరపడిన తెలుగు కుటుంబాలు. వీళ్ల వ్యాపారాలకు భాగస్వాములుగా ఉన్న నలుగురు వ్యక్తులు ఈ కుటుంబాల ఆస్తులపై కన్నేసి, రెండు కుటుంబాలను అంతం చేయాలనుకుంటారు. అప్పుడు చేసిన ఎటాక్‌లో అమర్, ఐశ్వర్య ప్రాణాలతో మిగులుతారు. కానీ, వేరు వేరుగా ఉంటారు. అప్పటి నుంచి తమ కుటుంబాలను అంతం చేసిన నలుగురిపై పగ తీర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో అమర్.. మరో రెండు పాత్రల్లో నటిస్తాడు. ఇంతకీ వీళ్లిద్దరూ తమ కుటుంబాలను అంతం చేసిన నలుగురిని చంపేశారా..? అమర్, ఐశ్వర్య మధ్య ఉన్న సంబంధం ఏంటి..? వీళ్లిద్దరూ కలుస్తారా..? అమర్.. రెండు పాత్రల్లో ఎందుకు నటిస్తాడు..? వీళ్లిద్దరితో పాటు ఇంకెవరైనా బతికి ఉంటారా..? మధ్యలో ఎంటరయ్యే వాటా గ్యాంగ్ ఎవరు..? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే
‘అమర్ అక్బర్ ఆంటోని’ కథ చదవగానే అప్పుడెప్పుడో వచ్చిన కల్యాణ్ రామ్ సినిమా ‘అతనొక్కడే’ గుర్తొస్తుంది. ఇదే ఈ సినిమాకు ప్రధాన సమస్య. దర్శకుడు రెండు మూడు సినిమాలను కలిపి మిక్సీలో వేసి ‘అమర్ అక్బర్ ఆంటోని’గా చూపించాడనిపిస్తోంది. చాలా కాలం తర్వాత వచ్చిన అవకాశాన్ని శ్రీనువైట్ల సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఒకే కథతో చాలా సినిమాలు వచ్చినా దాన్ని నడిపించే విధానం బాగుంటే సినిమా బాగుంటుంది. కానీ, ఈ సినిమాలు అలాంటిది కనిపించదు. సినిమా మొత్తాన్ని రవితేజ తన భుజాలపై వేసుకుని నడిపించాలనుకున్నా.. అది కూడా సక్సెస్ అవలేదు. అతనిలో కూడా కొన్ని సమస్యలు ఈ సినిమాలో బయటపడ్డాయనిపిస్తుంది. ఇలియానా మాత్రం తన గ్లామర్, నటనతో ఆకట్టుకుంది. కామెడీకి బాగా ప్రాధాన్యమిచ్చినా అది కూడా అతిలా అనిపిస్తుంది. మొత్తంగా ఈ సినిమా రవితేజ అభిమానులకు కూడా నచ్చుతుందో లేదో డౌటే. అది కూడా భారీ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తేనే మాత్రం.

నటీనటుల పనితీరు
మాస్ మహారాజా రవితేజ మరోసారి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు ట్రై చేశాడు కానీ, తన టైమింగ్ ఎక్కువగా పేలలేదు. లుక్స్ పరంగా మాత్రం తన గత సినిమాలలో కంటే బాగా కనిపించాడు. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హీరోయిన్ ఇలియానా చాలా బాగా నటించింది. పూజ పాత్రలో తన అందంతో పాటు తన అభినయంతో కూడా మెప్పిస్తోంది. అలాగే కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె పలికించిన హావభావాలు బాగున్నాయి. మరో ముఖ్య పాత్రలో కనిపించిన సునీల్ కూడా తన టైమింగ్‌తో అక్కడక్కడ నవ్విస్తాడు. అలాగే జూనియర్ పాల్‌గా నటించిన కమెడియన్ సత్య కామెడీ సినిమాకే హైలెట్‌గా నిలుస్తోంది. ఇక మిగిలిన పాత్రల్లో చేసిన వారు కూడా తమ పరిధి మేర చక్కగా చేశారు.

టెక్నీషియన్ల పనితీరు
శ్రీను వైట్ల మంచి పాయింట్ తీసుకున్నప్పటికీ, ఆ పాయింట్‌ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. కొన్ని సన్నివేశాలు తేలిపోయాయి. ఇక తన బలమైన కామెడీ కూడా ఈ సినిమాలో పేలలేదు. వెంకట్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. ఇక సంగీత దర్శకుడు తమన్ అందించిన పాటలు పర్వాలేదనిపస్తాయి. కానీ కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం మాత్రం బాగా ఆకట్టుకుంటుంది.ఇక వర్మ ఎడిటింగ్ బాగున్నప్పటికీ.. తన కత్తెరకు ఇంకా పని చెప్పాల్సింది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

బలాలు
* రవితేజ, ఇలియానా నటన
* కొన్ని కామెడీ సీన్స్

బలహీనతలు
* కథ, కథనం
* స్క్రీన్ ప్లే
* క్లైమాక్స్ సీన్స్

The post అమర్ అక్బర్ ఆంటోని రివ్యూ appeared first on APDunia.

Thanks! You've already liked this