భార్య కోసం అత్తను చంపిన అల్లుడు

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. భార్యను కాపురానికి పంపడం లేదని అత్తను కిరాతకంగా నరికి చంపాడో అల్లుడు. గోకవరం మండలంలోని కొత్తపల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బవిరి దుర్గ-ప్రత్తిపాడు మండలం ధర్మవరానికి చెందిన జాజిమొగ్గల దుర్గాప్రసాద్ భార్యాభర్తలు. మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న వీరి కుటుంబంలో ఇటీవల కలతలు ప్రారంభమయ్యాయి. భార్యపై అనుమానంతో నిత్యం వేధిస్తుండడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయి తల్లి చంటమ్మ (66) వద్ద ఉంటోంది. సోమవారం భార్యను తీసుకెళ్లేందుకు కొత్తపల్లి వచ్చిన దుర్గాప్రసాద్.. అత్త వల్లే భార్య తన వద్దకు రావడం లేదని భావించి ఆమెతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చిన్నగా మొదలైన వాగ్వివాదం పెరిగి పెద్దదైంది. దీంతో సహనం కోల్పోయిన దుర్గా ప్రసాద్ వెంట తెచ్చుకున్న కత్తితో అత్తను నరికాడు. తీవ్ర రక్తస్రావమైన చంటమ్మ ఘటనా స్థలంలోనే మృతి చెందింది. నిజానికి భార్యను చంపేందుకే నిందితుడు కత్తి తెచ్చాడని, ఆ సమయంలో ఆమె బయటకు వెళ్లడంతో అత్త బలైందని గ్రామస్తులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

The post భార్య కోసం అత్తను చంపిన అల్లుడు appeared first on APDunia.

Thanks! You've already liked this