ఎన్‌ఈపీ రాజ్యాంగ విరుద్ధం

రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్‌ఎఫ్‌ ఆందోళన

విశాలాంధ్ర – కర్నూలు :
రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా తయారు చేసిన నూతన జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ)ని తక్షణం ఉపసంహరించాలని డిమాండు చేస్తూ జాతీయ సమితి పిలుపు మేరకు ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. కర్నూలు, చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు, తూర్పుగోదావరి, విశాఖ, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలో విస్తృతంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ సీపీఐ కార్యాలయంలో జరిగిన నిరసనలో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రంగన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగన్న మాట్లాడుతూ దేశంలో నూతన విద్యా విధానం పేరుతో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవహేళన చేస్తోందని దుయ్యబ ట్టారు. కేంద్ర మంత్రి మండలిలో ఆమోదం పొందిన ఎన్‌ఈపీని తక్షణం ఉపసంహరించాలని డిమాండు చేశారు. నూతన విద్యా విధానం పేరుతో విద్యను కాషాయీకరణ చేస్తున్నారని విమర్శించారు. సెకండరీ విద్యను తుంగలో తొక్కి, ఉన్నత విద్యను అయోమయంలోకి నెట్టివేస్తున్నారని మండిపడ్డారు. పురాణాలను, కట్టుకథలను, పేర్కొన్నారు. నూతన విద్యావిధానంలో రాజ్యాంగంలోని ప్రజాస్వామ్యం, సోషలిజం, లౌకికవాదం, సమాన హక్కులు వంటి కీలకమైన అంశాలను ప్రస్తావించక పోవడాన్ని తప్పుబట్టారు. కేవలం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాగా ఉన్న మనువాదాన్ని దేశ ప్రజలపై రుద్దడానికే నూతన జాతీయ విద్యా విధానాన్ని ముందుకు తెస్తున్నారని విమర్శించారు. భావితరాల భవిష్యత్తును వెనక్కు నెట్టే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించేలా ఉద్యమాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. ఎన్‌ఈపీని వ్యతిరేకిస్తూ గుంటూరు నుంచి ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సుబ్బారావు పత్రికా ప్రకటన విడుదల చేశారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి శివారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నేతలు ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాన్సన్‌ బాబు ఆధ్వర్యంలో అనంతపురం పట్టణంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కీలకమైన విద్యావిధానంపై నిపుణుల సలహాలు పాటించకుండా, విద్యార్థి సంఘాల ప్రతినిధులతో చర్చించకుండా బీజేపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని నిలదీశారు. దేశంలో హిట్లర్‌ తరహా పాలన సాగుతోందని విమర్శించారు. విద్యా వ్యవస్థను తన కబంధ హస్తాలలో పెట్టుకోవాలనే బీజేపీ కుట్రపూరితమైన ఆలోచనలను ఇకనైనా విరమించుకోవాలని, లేనిపక్షంలో ఒక విశాలమైన వేదికను ఏర్పాటు చేసుకొని కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా పోరాటానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.

Thanks! You've already liked this