కాగితాల్లోనే నియంత్రణ

పరీక్షల కోసం గంటల తరబడి నిరీక్షణ
రోగులతో నిండిన క్వారంటైన్‌ కేంద్రాలు
లోపభూయిష్టంగా ప్రభుత్వ విధానం

(పి.రామకృష్ణ)
విశాలాంధ్ర బ్యూరో – విశాఖ సిటీ :
రాష్ట్రంలో కరోనా బాధితులకు వైద్య సేవలు అయోమయంగా మారాయి. ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వెలుగు చూడటంతో ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క బాధితులు బోరుమంటు న్నారు. మరణాల సంఖ్య పెరగడం వైద్య నిపుణుల తోపాటు ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా లక్షణాల అనుమానితులు పరీక్షల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. గురువారం ఒక్కరోజే 10,1673 పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు ప్రభుత్వ మెడికల్‌ బులిటెన్‌ ప్రకటిం చింది. 68 మంది మతి చెందారు. టెస్టుల్లో పాజిటివ్‌ కేసు సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. టెస్టుల ఫలితాలు సకాలంలో ఇవ్వడంలోనూ, పాజిటివ్‌గా తేలిన వారిని ఆస్పత్రులకు చేర్చడం లోనూ విపరీతమైన జాప్యం జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆస్పత్రుల్లోనూ, క్వారంటైన్‌లోనూ ఉన్న వారికి సదుపాయాలు అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతదేహాల తొలగింపులోనూ సవాలక్ష సమస్యలు వస్తున్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో లోపాలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టకపోతే కరోనాను కట్టడి చేయడం మరింత కష్టతరం కానుంది.
పరీక్షలు.. ఫలితాలు
కరోనా లక్షణాలతో పరీక్షా కేంద్రాలకు వచ్చిన వారు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తోంది. పరీక్ష అనంతరం రిపోర్టు రావడానికి వారం రోజుల సమయం పట్టడంతో వారి ద్వారా ఇతరులకు విస్తరిస్తున్నట్టు తెలుస్తోంది. పాజిటివ్‌ అని ఫోను మెసేజ్‌ వచ్చిన తర్వాత కూడా బాధితులను ఆస్పత్రులకు తీసుకెళ్లేందుకు అంబులెన్సు రావడానికి 10-12 గంటల ఆలస్యం అవుతున్నది. ఆసుపత్రు లకు మధ్యాహ్నం 2 గంటలకు వస్తే రాత్రి 10 గంటల వరకు బెడ్‌ ఇవ్వడం లేదని బాధితులు పేర్కొంటున్నారు. ఈ విధమైన ఆలస్యం వల్ల కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ ఇంకా ఆలస్యమవుతోంది. వ్యాధి విస్తరించడానికి ఇదొక ముఖ్యమైన కారణంగా నిలుస్తోంది. నివారణా చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం విధానపరంగా దృష్టి కేంద్రీకరించడంలో లోపం జరుగుతోంది. విశాఖపట్నం ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రుల్లో 10 రోజుల క్రితం ఇన్‌పేషెంట్లు 100 నుంచి 150 మంది ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 800కి చేరింది. రానున్న కొద్ది రోజుల్లో భారీగా పెరిగే పరిస్థితి ఉందంటున్నారు. విమ్స్‌, కేజీహెచ్‌, ఛాతీ ఆస్పత్రిలో మూడు షిఫ్టులకు కలిపి 250 మంది స్టాఫ్‌ నర్సులుంటే ఒక్కో షిఫ్టులో 70 మంది సేవలు అందిస్తున్నారు. 30 మంది స్టాఫ్‌ నర్సులు కరోనా సోకి సెలవులో ఉన్నారు. క్యాజువాలిటీ, బ్లడ్‌ బ్యాంకుకు పోనూ ఇప్పుడు 100 మంది ఇన్‌ పేషెంట్లకు ముగ్గురు స్టాఫ్‌ నర్సులు డ్యూటీ చేస్తున్నారు. పేషెంట్లకు మందులివ్వాలి. సీరియస్‌ అయినా, ఎవరైనా చనిపోయినా వీళ్లే పైవారికి తెలియజేయాలి. బెడ్‌ షీట్లు మార్చడం, సమయానికి భోజనం, మంచి నీరు, ఆఖరికి టాయిలెట్లు శుభ్రంగా ఉన్నదీ లేనిది చూసుకోవడం అన్నీ వీళ్లే. వార్డు బార్సు గానీ, ఫిమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీగానీ లేరు. చనిపోతే తీసుకెళ్లడానికి తగినంతమంది స్ట్రెచర్‌ బేరర్లు లేనందువల్ల మృతదేహాలు బెడ్‌ మీద 3-6 గంటల సేపు ఉంటున్న పరిస్థితి. దీంతో పక్కన పేషెంట్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
డాక్టర్లు – సిబ్బంది కొరత
ఆస్పత్రిలో 100 వరకు డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 300 మంది పేషెంట్ల కోసం రూపొందించిన కొవిడ్‌ ఆసుపత్రిలో 600 మంది ఉన్నందున మరో 250 మంది ఎఫ్‌ఎన్‌వోలు, 200 మంది ఎంఎన్‌వోలు ఉండాలి. ల్యాబ్‌ టెస్టుల కోసం ఇప్పుడు 20 మంది ఉన్నారు. పెరిగిన టెస్టుల డిమాండును బట్టి కనీసం ఇంకో 50 మంది అవసరం ఉంది. జిల్లా మొత్తానికి కేజీహెచ్‌లోని ల్యాబ్‌తో పాటు మరో మూడు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. గతంలో రోజుకి 100- 200 శాంపిళ్లు వచ్చే వాటి స్థానంలో ఇప్పుడు రోజుకి 1,000 వస్తున్నాయి. శాంపిల్స్‌ సేకరణలోనూ ఆలస్యం అవుతోంది. శాంపిళ్లు ఎక్కువైనందువల్ల ఫలితాలు ఇవ్వడానికి వారం రోజులు పడుతోంది.
జిల్లాలో కరోనా తీవ్రతకు తగినట్లు ఆసుపత్రులు, బెడ్లు లేవు. 8,971 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 79 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 5,834 మంది వరకు ఉన్నారు. సరైన సదుపాయాలు లేకపోవడంతో 597 మంది బాధితులు ఇళ్లలోనే ఉండి చికిత్స పొందుతున్నారు.
ఒక బెడ్‌ ఖాళీ అయితేనే మరొకరికి అవకాశం అన్నట్టు వార్తలొస్తున్నాయి. కరోనా నివారణకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వెనకబడుతోందని స్పష్టంగా అర్థమవుతున్నది. అసలు కరోనా నివారణ చర్యలపై సరైన సమీక్ష చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఒకవైపు శాంపిళ్లు తీసుకోవడానికి, రిజల్ట్స్‌ ప్రకటించడానికి ఆలస్యం వల్ల కాంటాక్ట్‌ చైన్‌ బ్రేక్‌ చేయడానికి వీలు లేకుండా పోయింది. ఇంకోవైపు పేషెంట్లను కొవిడ్‌ కేంద్రాలకు తీసుకురావడంలో ఆలస్యం, వచ్చినవారికి బెడ్‌ చూపించడంలో ఆలస్యమవుతోంది. ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత, మృతదేహాలను శ్మశానానికి తరలించడానికి ఆలస్యం, రోడ్డు మీద ఉన్న శవాన్నీ తొలగించడానికి ఆలస్యం.. ఇవన్నీ ప్రభుత్వ చర్యల్లో తీవ్రమైన లోపంగా పరిగణించాల్సిన పరిస్థితి. భోజన వసతి కోసం రోజుకి రూ.500 కేటాయించినట్లు ప్రకటించినా రూ.293 మాత్రమే కాంట్రాక్టర్లకు అందుతోంది.
కేరళ తరహా కట్టడి చర్యలు శూన్యం..
కరోనా నివారణకు కేరళ ప్రభుత్వం కాంటాక్ట్‌ చైన్‌ బ్రేకింగ్‌ మీదే దష్టి పెట్టింది. ఐసొలేషన్‌ పకడ్బందీగా అమలు చేసింది. అందువల్లే విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి ఈ కాలంలో ఎక్కువగా వచ్చినా వారందరినీ పై పద్ధతి అమలు చేసి వైరస్‌ను కట్టడి చేసింది. దీనికి ఎక్కడికక్కడ స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలను భాగస్వాములను చేయగలిగింది. ప్రజల భాగస్వామ్యంతోనే ఇది కట్టడి అయింది. కానీ మన రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్యానికి కనీసమైన చర్యలు లేవు. కేరళలో కమ్యూనిటీ కిచెన్‌లు పెట్టి అవసరమైన ఆహారాన్ని అందరికీ అందించగలిగారు. స్వచ్ఛందంగా అనేకమంది ముందుకొచ్చి ఆర్థికంగానూ, నైతికంగానూ సహాయం చేశారు. ఈ అనుభవాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం శోచనీయం. ముఖ్యమంత్రి ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి.
తక్షణ చర్యలు అవసరం
ప్రభుత్వ పరంగా టెస్టింగ్‌ కేంద్రాల సంఖ్యను పెంచాలి. ఏ రోజు పరీక్షల ఫలితాలు ఆరోజు ప్రకటించాలి. కరోనా సోకిన రోగికి అవసరమైన బెడ్‌, ఐసొలేషన్‌ నిబంధన కచ్చితంగా అమలు కావాలి. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ పకడ్బందీగా అమలు కావాలి. పెరుగుతున్న కేసులకు తగిన సిబ్బందిని, డాక్టర్లను రిక్రూట్‌ చేసుకోవడం, కొత్త కొవిడ్‌ ఆసుపత్రులను తెరవడం తక్షణం జరగాలి. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార సరళి లోపభూయిష్టంగా ఉన్నదిగనుకే వ్యాధి విస్తరణ ఎక్కువగా జరుగుతోందని చెప్పక తప్పదు.
కరోనా వైరస్‌ విస్తరిస్తున్న ఈ కాలంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులన్నింటినీ కొవిడ్‌ ఆసుపత్రులుగా ప్రభుత్వం మార్చేసింది. యూనివర్సల్‌ హెల్త్‌కేర్‌ నిర్లక్ష్యం చేయబడి, ప్రత్యేకంగా డాక్టర్లు, సిబ్బంది శాంక్షన్డ్‌ పోస్టుల్లో పెద్ద భాగం ఖాళీగా ఉన్న నేపథ్యంలో సాధారణ వైద్యానికి తీవ్రమైన పరిమితులు ఏర్పడ్డాయి. ఉన్న ఆసుపత్రులు, సిబ్బంది అంతటిని కరోనా వైపు కేటాయించడంతో ఈ పరిస్థితి తీవ్రమైంది. కరోనా కారణంగా ఇంతకు ముందులా సేవలు అందించడానికి ప్రయివేటు ఆసుపత్రులు నిరాకరించడంతో వైద్య రంగంలో సేవలకు పెద్ద అంతరాయం కలిగింది. కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ వైద్యం కూడా అందక మరణాలు సంభవిస్తున్న వార్తలు వస్తున్నాయి. ఇటు కరోనా వ్యాధి విస్తరించడం అటు ప్రభుత్వ వైద్యశాలల్లోగానీ, ప్రయివేటు రంగంలోగానీ సాధారణ వైద్యం అందుబాటులో లేకపోవడం ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో విధానపరంగానే మౌలికమైన మార్పులు చేపట్టాలి. యూనివర్సల్‌ హెల్త్‌కేర్‌ విధానం కోసం బడ్జెట్‌ కేటాయింపులు పెంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలి. సిబ్బంది, సదుపాయాలు, మందుల కొరత నివారించాలి. కాంట్రాక్టు విధానానికి స్వస్థి చెప్పాలి. తక్షణం ఈ చర్యలు చేపట్టకపోతే ప్రజారోగ్యానికి పెద్ద ప్రమాదమే ముంచుకొస్తుంది. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఖాళీలు భర్తీ చేసే కన్నా, ముందే వైద్య రంగంపై అప్రమత్తంగా ఉంటే ఈ పరిస్థితిని మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలిగే వాళ్లని వైద్య నిపుణులు అంటున్నారు. విశాఖలో కరోనా పాజిటివ్‌ బాధితులందరినీ ఆంధ్ర యూనివర్సిటీ కళాశాల భవనాలు, హాస్టల్‌ భవనాలు, మారికవలసలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలతో పాటు మరో రెండు కళాశాల భవనాలలో క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆశ్రయం కల్పిస్తున్నారు.

Thanks! You've already liked this