టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా..?

తెలంగాణాలో టీఆర్‌ఎస్‌ తరహా త్యాగాలకు సన్నద్ధం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి :
అమరావతి రాజధాని పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ తన ఆఖరి అస్త్రంగా మూకుమ్మడి రాజీనామాలు సంధించే యోచన చేస్తోంది. మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేయడంతో ప్రభుత్వం ఒకవైపు సాధ్యమైనంత త్వరగా పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేస్తుండగా, మరోవైపు దాన్ని ఎలాగైనా అడ్డుకునేందుకు టీడీపీ సన్నద్ధమవుతోంది. టీడీపీ సీనియర్‌ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు శనివారం దీనిని ఏ విధంగా నిలువరించాలనే దానిపై రోజంతా సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. గవర్నర్‌ మూడు రాజధానులకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చిన వెంటనే కడప ఎమ్మెల్సీ బీటెక్‌ రవి రాజీనామా చేయడం, అధికార పార్టీ మంత్రులు కొడాలి నానితోపాటు పలువురు మూడు రాజధానులను వ్యతిరేకించే దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేసి గెలవాలని సవాళ్లు విసరడం వంటి అంశాలు ఈ సందర్భంగా చర్చకొచ్చాయి. అధికార పార్టీ దూకుడుకి ఏవిధంగా కళ్లెం వేయాలనే దానిపై అధినేత సమాలోచనలు జరిపారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం దాదాపు 33 వేల ఎకరాలు ఉచితంగా ఇచ్చిన రైతులు గత 8 నెలలుగా తమకు జరిగిన అన్యాయం, మోసంపై ఆందోళనలు కొనసాగిస్తున్నందున వీరికి అన్ని విధాలా అండగా నిలబడాల్సిన బాధ్యత అందరికంటే మనపై ఎక్కువగా ఉందన్న భావనను నేతలంతా వ్యక్తం చేసినట్లు తెలిసింది. అమరావతి రాజధాని కోసం, దానికి భూములు త్యాగం చేసిన రైతుల కోసం ఏం చేయడానికైనా సిద్ధమని, ఆధినేత నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని ఈ సందర్భంగా పార్టీ నేతలు చంద్రబాబుతో చెప్పినట్లు సమాచారం. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ సాధ్యమైనంత త్వరగా పరిపాలనా రాజధానిని ఇక్కడ నుంచి విశాఖకు తరలించాలనే ప్రయత్నంలో ఉంది. దీనికోసం వైసీపీ అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నందున, ప్రతిపక్ష పార్టీగా దీనిని అడ్డుకోవడానికి అవసరమైన ప్రతి చిన్న అవకాశాన్ని మనం కూడా ఉపయోగించుకోవాలని చెప్పినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం న్యాయ సమీక్షకు నిలబడదని, సీఆర్‌డీఏ అనేక సంస్థలతో చేసుకున్న ఒప్పందాల్లో చట్టపరమైన మెలికలు చాలా ఉన్నాయని సీనియర్లు ప్రస్తావించారు. రైతులకు ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అగ్రిమెంట్లతోపాటు రాజధాని ప్రాంతంలో వివిధ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు 1,300 ఎకరాలు విక్రయించారు. వీరిలో విద్యా, వైద్య సంస్థలతోపాటు హోటళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లు, వివిధ రకాల వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులున్నారు. ఎకరం 4 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి చెల్లించి ఆ భూములను కొనుగోలు చేశారు. సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో హ్యాపినెస్ట్‌ 1, 2 పేరిట అత్యంత విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు నిర్మాణం చేయాలని తలపెట్టగా, దేశ, విదేశాల్లోని అనేకమంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతూ పోటీపడ్డారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఓపెన్‌ చేస్తే గంటల వ్యవధిలోనే ఇవన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. వీరంతా రూ.10 లక్షలు చొప్పున డిపాజిట్లు చేశారు. అలాగే ఎన్నార్టీ ప్రాజెక్టులో కూడా విదేశాల్లో ఉండే తెలుగువారు ఒక్కొక్కరు రూ.25 లక్షలు డిపాజిట్‌ చెల్లించి ప్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. వీరందరికీ ప్రభుత్వం ఎలా న్యాయం చేస్తుంది..? అన్నింటికి మించి రైతులకిచ్చిన అగ్రిమెంట్‌ ఉల్లంఘన వంటి అనేక అంశాల్లో చట్టపరమైన చిక్కులున్నందున కోర్టులో వైసీపీ ప్రభుత్వానికి పరాభవం తప్పదనే భావం నేతల్లో వ్యక్తమైంది. అయితే ప్రస్తుతం పరిపాలనా రాజధాని తరలింపునకు ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాజధాని రైతుల్లో నిరాశానిస్పృహలు, తీవ్రమైన ఆవేదన నెలకొని ఉన్నందున వారికోసం మూకుమ్మడి రాజీనామాలు చేయడం ద్వారా శాసనసభ్యులు త్యాగాలకు సిద్ధపడితే రైతులకు మనోధైర్యంతోపాటు అమరావతి ఉద్యమానికి మంచి ఊపు వస్తుందని ఒకరిద్దరు నేతలు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్లు తెలిసింది. తెలంగాణా ఉద్యమం సందర్భంగా ఆనాడు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా పలుసార్లు రాజీనామాలు చేసి ఆ ఉద్యమానికి ఊపు తెచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే మూకుమ్మడి రాజీనామాల వ్యవహారంపై పార్టీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం. వైసీపీ మైండ్‌గేమ్‌ ఆడుతోందని, దానిని తెలివిగా తిప్పికొట్టాలని కొందరు సూచించారు.
మూడు రాజధానులను వ్యతిరేకించేవారు రాజీనామా చేసి గెలవాలని వైసీపీ డిమాండు చేస్తున్నప్పుడు, మనం కూడా వారిని మూడు రాజధానుల ప్రతిపాదనపై అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేసి ప్రజాభిప్రాయం కోరాలని డిమాండు చేయాలని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీతతో పోలుస్తున్న సీఎం జగన్‌ మూడు రాజధానుల అంశాన్ని ఎందుకు చేర్చలేదో నిలదీయాలని, తప్పనిసరి అయితే తప్ప మూకుమ్మడి రాజీనామాల నిర్ణయం ఇప్పుడే సరికాదని కొందరు అభిప్రాయపడ్డారు.
మొత్తానికి మూకుమ్మడి రాజీనామాల నిర్ణయాన్ని కోర్టు తీర్పు తర్వాత చివరి అస్త్రంగా అయితే బావుంటుందని, దీనిపై మరింత విస్తృతంగా చర్చించాలనే యోచనకు వచ్చినట్లు సమాచారం.

Thanks! You've already liked this