పారిశ్రామిక ఉత్పత్తి ఢమాల్‌

జూన్‌లో 15 శాతం తగ్గుదల
8 కీలక పరిశ్రమలకు దెబ్బ
తగ్గిన రెవెన్యూ వసూళ్లు
న్యూఢిల్లీ :
కరోనా వైరస్‌ నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన తరువాత కూడా 8 కీలక పరిశ్రమల్లో ఉత్పత్తి భారీగా పడిపోతూనే ఉంది. ఏప్రిల్‌ నెలలో 37శాతం ఉత్పత్తి పడిపోగా మే నెల లో 22శాతం, జూన్‌ నెలలో 15శాతం పడిపోయిం ది. 2020-21కి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ద్రవ్యలోటు 83 శాతానికి పెరిగింది. అంటే ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 6.62 లక్షల కోట్ల మేర ద్రవ్యలోటు ఏర్పడింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి 83.2శాతం ఉండవచ్చునని అంచనా వేశారు. ఉత్పత్తి శాతం దిగజారడం తగ్గడం కొంత ఊరట కలిగిస్త్తోంది. ప్రధానంగా విద్యుత్‌, స్టీలు, రిఫైనరీ ఉత్పత్తులు, ముడి చమురు, బొగ్గు, సిమెంటు, ఖని జ వాయువు, ఎరువుల రంగాలలో ఉత్పత్తి 40.27 శాతం మాత్రమే ఉందని పారిశ్రామిక ఉత్పత్తి సూచి తెలుపుతోంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడటం వల్లనే పడిపోతున్న ఉత్పత్తి మెరుగైందని ఆర్థిక వేత్తలు చెపుతున్నారు. రానున్న కాలంలో ఆంక్షలను మరింత సడలించే అవకాశం ఉందని పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకుంటాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఎరువుల రంగం మినహా తక్కిన 7 పరిశ్రమల్లో ఉత్పత్తి ఎక్కువగా తగ్గింది. స్టీలు పరిశ్రమలో అత్యధికంగా 33శాతం, బొగ్గు పరిశ్రమలో 15.5శాతం, ఖనిజ వాయువు ఉత్పత్తిలో 12శాతం, విద్యుత్‌ ఉత్పత్తి 11 శాతం, ముడి చమురు ఉత్పత్తి 6 శాతం పడిపోయాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ప్రకారం రిఫైనరీ ఉత్పత్తులు 28.02శాతం ఉన్నాయి. సిమెంటు ఉత్పత్తి తగ్గుదల మే నెలలో 85.3శాతం ఉండగా అది జూన్‌లో 6.9శాతానికి తగ్గి బాగా పుంజుకున్నదని సిమెంటు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. నిర్మాణరంగం వృద్ధి ఇందుకు కారణమని అంచనా వేసుకున్నారు. కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఉత్పత్తి పుంజుకోవడం కష్టమేనని కొంతమంది నిపుణులు అంచనా వేసుకున్నారు. మరింత ఎక్కువకాలం ఆంక్షలు కొనసాగవచ్చునని వారు భావిస్తున్నారు.
2020-21లో రూ.13లక్షల కోట్లు లోటు :
ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ద్రవ్యలోటు చాలా ఎక్కువగా ఉన్నది. ఈ లోటు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 13లక్షల కోట్లకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేశారు. క్షేత్రస్థాయిలో కేంద్రం మార్కెట్‌ నుంచి తీసుకుంటున్న రుణాలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో ద్రవ్యలోటు పెరుగుతుందని ఐసీఆర్‌ఏ ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్‌ అంచనా వేశారు. రెవెన్యూ వసూళ్లు ఇంకా తగ్గుతాయని, అదే సమయంలో వ్యయం పెరుగుతుందని కాగ్‌ (కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌) అంచనా వేసింది. పన్ను వసూలు నికరం 1.35లక్షల కోట్లు ఉంటుందని గత ఏడాది ఇదే కాలంలో 2.51 లక్షల కోట్లు వసూలు అయిందని కాగ్‌ తెలిపింది. ఈ ఏడాది పూర్తి సంవత్సరంలో రూ.16.35 లక్షల కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే పన్నుయేతర రెవెన్యూ వసూళ్లు 3.85లక్షల కోట్లు ఉండవచ్చునని అంచనా వేశారు. ఈ రెండురకాల వసూళ్లు తగ్గిపోతున్నాయి. ద్రవ్యలోటు ఇప్పటికే ఏడేళ్లలో అత్యధికంగా 2019-20లో జీడీపీలో 4.6శాతానికి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 12లక్షల కోట్లు రుణాలను మార్కెట్‌ నుంచి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Thanks! You've already liked this