బట్టి విక్రమార్క

మట్టి కతలు
గాలి నాగరాజ
రేయి రాజిగా, నీకు నిద్ర ఎట్లాపడతావుందిరా. పక్కన పిల్లోడు సూడు. పొద్దున్నే లేచి అచ్చులు పచ్చులు ఆలకించే ఇదంగా చదవతా వుండాడు. శని దాపరించిందా ఏమి, మొద్దు నిద్ర పోతావుండావేన్దిరా. నిన్ను సదవేసినా ఎర్రి సెరుక్కు నీళ్లు బోసినా ఒగటే రకంగా వుండాదే. యంగటమ్మ తిట్ల దండకంతో అట్లా మొదలయింది రాజాకు ఆ రోజు. యంగటమ్మకు రాజా ఒకడే కొడుకు. ఆయమ్మ రాజిగా అందంటే కోపంతో ఊగిపోతావుండాదని అర్ధం చేసుకోవాల. ఒకగానొక్క కొడుకును చది వించుకోవడానికి యంగటమ్మ కుటుంబం పల్లిడిసిపెట్టి తిరుపతికి చేరింది. ”ఏంద్మా, పొద్దున్నే నీ నస శానా ఎక్కవగా వుండాదే” అని రాజా వొల్లు ఇదుల్చుకుంటా నులక మంచం మింద నుంచీ లేచినాడు. ”ఎందా, పక్కన పిల్లోడున్నాడు సూడు. పైకోచ్ఛేరకం అంటే అట్లా వుండాల” ఆని యంగటమ్మ రెట్టించింది. ఈ చలపతి ఒకడు. ఉండేకాడ మట్టసంగా ఉండడు. తెల్లారక ముందే పుస్తకాలు ముందేసుకుని తగరాదు తెచ్చిపెడతా వుండాడు అనుకున్నేడు రాజా. చలపతి రాజా కన్నా ఒక సంవత్సరం సీనియర్‌. అగ్గిపెట్టెల్లాగా వరసగా వుండే ఐదు రేకులిళ్లల్లో రాజా, చలపతి పక్కన పక్కన వుంటారు. ఇల్లంటే వండుకోవడానికి, తిండానికి వీలుగా లోపల ఒక రూమ్‌ పండుకోవడానికి వీలుగా బయట వరండా. అందువల్ల చలపతి చదవడం మొదలు పెడితే పక్కనోళ్ళకు లౌడ్‌ స్పీకర్‌ పెట్టినట్లుగా ఉంటుంది. చలపతి ముద్దు పేరు చలపాయి. చలపాయికి చదువంటే భయమూ, భక్తి చానా ఎక్కువ. ఇంగ్లీష్‌ అచ్చరాలు చూస్తేనే బిత్తరపోతాడు. లెక్చరర్లు ఇచ్చే నోట్సును సీనియర్ల దగ్గర కాలేజీ మొదలు కాకముందే తీసేసుకుంటాడు. కాలేజీ మొదలవ్వంగనే పుస్తకాలు వేంకటేశ్వరస్వామి పటం ముందు పెట్టి పూజ చేస్తాడు. ఆ రోజు నుంచీ సంవత్సరంలో ఏ సబ్జక్టు ఎన్నిరోజులు చదవాలో ఒక ప్లానేసుకుంటాడు. ప్లాన్‌లో ఇంగ్లీష్‌ చదువు సంవత్సరం అంతా ఉంటుంది. కోడి కూయకముందే లేచి చన్నీళ్లతో స్నానం చేస్తాడు. నుదుటిమీద కుంకుమతో బొట్టు పెట్టుంటాడు. వెంకటేశ్వరస్వామికి దండం పెట్టుకున్న తర్వాత ఇంగ్లీష్‌ చదవడం మొదలు పెడతాడు. పాఠంలో ఏముందనేది చలపాయికి బొత్తిగా అవ సరం లేదు. నోట్సులో ఉండేది మొదటి పదం నుంచీ చివరిపదం వరకూ బట్టీ కొట్టి పరీచ్చల్లో తెల్లకాగితం మీద కక్కేస్తే చాలు అనుకుంటాడు. ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్ని వందలసార్లు ఆ విధంగా బట్టీ కొట్టడం చలపాయికి అలవాటయిపోయింది.. ఒథెల్లో, మిడ్‌ సమ్మర్‌ నైట్స్‌ డ్రీం, టెంపెస్ట్‌, ఆంటోనీ క్లియపాత్ర, హామ్లెట్‌ లాంటి షేక్‌ స్పియర్‌ పాఠాలు చలపాయి చదవతా వుంటే నిజంగా అచ్చులు పచ్ఛులు ఆలకించాల్సిందే. ఆయప్ప గద్యం కూడా పద్యం మాదిరిగా చదువుతాడు. గట్టిగా చదివితే మర్చిపోకుండా ఉంటారని చలపతికి ఎవురో చెప్పినారంట. అప్పటినుంచి చలపాయిలో బట్టీవిక్రమార్క పరకాయ ప్రవేశం చేసినాడు. ”నాయనా, నువ్వు ఇంగ్లీషులో మాట్లాడతా ఉంటే ఇనాలని వుందిరా” ఆని రాజా వాళ్ళ నాయన పాపన్న మురిపంగా చానాసార్లు అడిగినాడు. పాపన్న వేలిముద్ర వేసే రకం. అయినా ప్లేట్‌, రోడ్‌, బస్‌ లాంటి ఇంగ్లీష్‌ మాటలు నేర్చు కున్నాడు. అయివోర్లు మాట్లాడినట్లు కొడుకు ఇంగ్లీష్‌ గుక్క తిప్పుకోకుండా గడగడా మాట్లాడతావుంటే వినాలని పాపన్న ముచ్చట పడతావుండాడు. కానీ నాయన మురిపం తీరని కోర్కెలాగానే మిగిలిపోయింది.
రాజాకు, చలపాయికి పొంతనే లేదు. చలపాయికి చదువే ధ్యాస. రాజాకు చదువంటే ధ్యాసే లేదు. ”మనోడు కాలేజీలో ఓట్లకు నిలబడి నాడంటనే, మనమేందని తెలుసుకొని నడవాల. ఒకడే కొడుకు అని సాకితే యాడ్నో ఒగడు వడ్డే దాన్ని తోడుకొనిబోయినాడంట. అట్లా వుంది మా ఇంట్లో రకం” అని యంగటమ్మ మొగుడు పాపన్నతో యాష్ట పడతా వుంది. ”నువ్వేమో ముచ్చు మొగమోనివి. బెల్లం కొట్టిన రాయిలాగా కదల కుండా మెదలకుండా ఉండిపోతావు” అని కోపం మొగుడి మీదకు చూపిం చింది. రాజా కాలేజీ ఎలక్షన్లలో నిలబడడం యంగటమ్మ తప్పుపడతా వుంది. రాజా కాలేజీకి పోతావుండాడు అంటారుగాని అమాసకో పున్నానికో ఒక సారి కూడా క్లాసులో కనిపించడు. రాజా కాలేజీ రాజకీయాలలో తిరగతా ఉండాడని అంటారు. ఎక్కడ మీటింగ్‌ జరిగినా పోతా వుంటాడు. రాత్రుల్లో కాలేజీ గోడలకు సున్నం కొట్టాల. తెల్లటి గోడల మింద ఎర్రమట్టి, నీళ్లు బకెట్లో కలిపి కుంచెను చేత్తో పట్టుకోని ఏవో రాతలు రాయాల. ఇవన్నీ చేసీ ఇంటికి జేరేసరికి అర్ధరాత్రి దాటిపోతుంది. ఒకరోజు నోట్లో నీళ్ళుకూడా పోసుకోకుండా పొద్దున్నే పోయిన పిల్లోడి జాడ ఇంట్లోవాళ్లకు రెండురోజుల తర్వాత ఎప్పుడో గానీ తెలియలా. చిత్తూరులో చదువుకొనే పిల్లకాయ లంతా లా కాలేజీ గావాలని బంద్‌ జేస్తావుంటే రాజా రైలు పట్టుకోని తిరపతి నుంచీ నేరుగా ఆడికి పోయినాడంట. పోలీసులు అరెస్టు జేసీ రెండ్రోజులు ఆడ స్టేషన్లో పడేసినారంట. ఇవన్నీ యంగటమ్మ మొగుడు పాపన్నకు తెలియక కాదు. పిల్లోడు దారి తప్పతా వుండాడని అర్ధం అవతా వుంది. తిట్టడం కొట్టడం చేస్తే ఎదిగే పిల్లోడికి మతింపు వుండదని పాపన్న లోపల లోపలే మధనపడతా వుండాడు. ”ఏంబో, నీతో చానా తగరాజుగా వుందే నాకు” అని రాజా నిద్ర కండ్లు నలుపుకుంటా చలపతిని అడిగేదానికి పోయినాడు. ”నువ్వు బో సామీ. నాకు ఇంగ్లీష్‌ రాక నేను చస్తావుంటే మధ్యలో నీ పంచాంగమేంది” అని చలపతి అన్నాడు. చలపతి వాళ్ళది భాకరాపేట అవతల ఏదో వూరు. వాళ్ళ నాయన నేసిన గుడ్డలు వూరూరా తిరిగి అమ్ముకొని ముగ్గురు పిల్లోళ్లను తిరపతిలో పెట్టి చదివిస్తా వుండాడు. చదువు ఉద్ధరిస్తుందని చలపతిలాగా రాజా నమ్మే రకం కాదు. చదివితే మహా అయితే టిటిడిలో గుమస్తా కావొచ్చు. లేకపోతే అటెండర్‌ పనే గదా దొరికేది అనుకునేవాడు. ”ఎంజేచ్ఛన్దావ్‌ రాజా” అంటా గారపళ్లు పైకి కనిపించేలాగా నవ్వతా పళ్ళకిచ్చ లచ్మయ్య ఇంటికొచ్చినాడు. ‘పరిచ్చలు దగ్గిరపడినాయి కద్బా. చదవదామనుకుంటావుండా” అని రాజా అన్నాడు. ”సమాజం ముందు మన పుస్తకం ఎంతబ్బీ. సముద్రంలో కాకి రెట్టంత. రేణిగుంట కాటన్‌ మిల్‌ దగ్గిర నాలుగురోజులు పొలిటికల్‌ క్లాసులు జరగతావుండాయి. అడికిబోవాలే” అని లచ్మయ్య కడప యాసలో అనేసరికి పుస్తకాలు పక్కన పడేసి మంత్రమేసినట్లుగా రాజా చక్కా పోయినాడు. పరీచ్చలు వారం రోజులు వుండాయనంగా రాజాకు చదువు గుర్తొస్తుంది. చలపతిలాగా రాజా టెక్స్ట్‌బుక్సు, నోట్సుల మొఖం చూసి నోడు కాదు. మీసాలు లేని ఇంగ్లీష్‌ లెక్చరర్‌ సాయిబాబా క్లాసులో షేక్‌ స్పియర్‌ పాఠాలు చెపతా ఆయనలో ఆయనే మురిసిపోతా ఉంటాడు. క్లాసులో ఉండే పిల్లోళ్ళను గూడా మురిసిపొమ్మంటాడు. ఆ సార్‌ జెప్పేది ఒక ముక్క ఏమయినా అర్ధం అయితే కదా మురిసిపోవడానికి. అప్పు డప్పుడూ అర్ధం అయినట్టుగా తలూపాలా, సార్‌ నవ్వినప్పుడు నవ్వితే సరిపోతుంది. ఇదీ చదువులో వుండే కిటుకు. పరిచ్చల్లో ఈ పప్పులు ఉడకవు. సూక్ష్మంలో మోక్షం ఉందంటారు గదా. చలపాయి భారం అంతా వెంకటేశ్వర స్వామి మీద ఏస్తే రాజా రాఘవేంద్ర గైడ్‌ను నమ్ముకున్నాడు. ఇంగ్లీష్‌ పాఠంతో పాటు గైడ్‌లో తెలుగు సారాంశం కూడా ఉంటుంది. తెలుగు సారాంశం బుర్రకు ఎక్కించుకోవడానికి రెండ్రోజులు చాలదా అని రాజా అనుకునేవాడు. పరిచ్చలంటే చలపాయికి భయం. రాజాకు లెక్కలేనితనం. పరిచ్చల భయం వల్ల…. యుద్ధం చేస్తా శాపగ్రస్తుడయిన కర్ణుడి మాదిరిగా వుంది చలపతి పరిస్థితి. పేపర్‌ చూస్తే అన్ని ప్రశ్నలు బాగా తెలిసినట్లే కనపడతా వుండాయి. జవాబు రాద్దామనుకుని మొదటి ప్రశ్నతో మొదలుపెడతాడు. ఎంతసేపు తలగోక్కున్నా మొదటి పదం గుర్తుకు రాదు. దివ్యాస్త్రాలను మర్చిపోయిన కర్ణుడిలా కనిపిస్తా వుండాడు చలపాయి. మరిచిపోయింది గుర్తుకొస్తే చలపతి చేయి రైలింజన్‌ లాగా ఉరకడానికి సిద్ధంగా వుంది. గుర్తుకు రాని పదం నాలుకమీదే ఉన్నట్టుంది. కానీ చేతివరకూ రావడం లేదు. ఈ ప్రశ్న పూర్తయితే ఇంకో ప్రశ్నకు పోవచ్చు. బండి ముందుకు కదలడం లేదు. గంట కొట్టే సమయం దగ్గరపడతా వుంది. ఇంగ్లీష్‌ పరీచ్చ గట్టెక్కితే కొండకు కూడా వస్తానని చలపాయి మొక్కుకున్నాడు. తెగించినోడికి అడ్డా తెడ్డా అనేటట్లుగా వుంది రాజా పరిస్థితి. రాజా చేతిలో పెన్ను పరిగెత్తతా వుంది. తెలుగులో చదివింది గుర్తుంది. కలిపికొట్టరా కావేటి రంగా అన్నట్లు రాజా రాసి పడేస్తా వుండాడు. రాతలో ఇంగ్లీష్‌ అచ్చరాలు కనిపిస్తా వుండాయి కాబట్టి రాసేది ఇంగ్లీషు అనే అనుకోవాల. తెల్ల కాగితం పైన ఆ మాదిరిగా బరబరా గీకి అరగంటకన్నా ముందే రాజా పరిచ్చ హల్‌ నుంచీ బయటపడిపోయినాడు. చివరికి వెంకటేశ్వర స్వామి కూడా చలపతిని పరిచ్చల గండం నుంచీ బయటపడేయ లేకపోయినాడు. కానీ రాఘవేంద్ర గైడ్‌ మాత్రం రాజాకు పాసయ్యే దారి చూపింది.

Thanks! You've already liked this