భూములిచ్చిన రైతుకు సమాధానం చెప్పిన తర్వాతే..

నేటి నుంచి నిరసనలకు అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీ పిలుపు
విశాలాంధ్ర-విజయవాడ (లబ్బీపేట) :
రాష్ట్ర రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమాధానం చెప్పిన తర్వాతే రాజధానిని తరలించాలని అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీ కన్వీనర్‌, సీపీఐ కృష్ణాజిల్లా సమితి కార్యదర్శి అక్కినేని వనజ డిమాండు చేశారు. విజయవాడలోని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ కార్యాలయంలో శనివారం మహిళా జేఏసీ ప్రతినిధులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వనజ మాట్లాడుతూ మహిళలకు అత్యంత ఇష్టమైన వరలక్ష్మీవ్రతం రోజు రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలపడం బాధాకరమన్నారు. కర్నూలుకు హైకోర్టు ఇచ్చినంతమాత్రాన రాయలసీమ అభివద్ధి జరగదన్న విషయాన్ని గుర్తించిన సీమవాసులు ఈ నిర్ణయాన్ని ఆహ్వానించడం లేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్దతు ఇచ్చి ఇప్పుడు రాజధాని అమరావతిని చంపుతారా అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు రెండు నాల్కులధోరణలో మాట్లాడుతూ అమరావతి రైతులను అయోమయంలోకి నెట్టారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కేంద్రం ఏమి చేయదలుచుకుందో బహిర్గతం చేయాలని కోరారు. గవర్నర్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇప్పటికైనా రాజకీయపార్టీలు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కన్వీనర్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు సుంకరపద్మశ్రీ మాట్లాడుతూ ప్రజలను వైసీపీ ముందు నుంచి ద్రోహం చేస్తే, వెనుకనుంచి బీజేపీ, జనసేన వెన్నుపోట్లు పొడిచాయన్నారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన అమరావతికే ఈ దుస్థితి వస్తే అయోధ్యలో రామమందిరానికి శంకుస్థాపన చేస్తే ఇంకా ఎలా ఉంటుందో అన్నారు. రామమందిరం శంకుస్థాపనకు వెళ్ళేముందు అమరావతే రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ విశాఖలో అడుగుపెడితే ఆ దేవుడే మహానగర ప్రజలను కాపాడాలన్నారు. కృష్ణాజిల్లా జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ , టీడీపీ నాయకురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ మనకు అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టడం రాష్ట్రానికి మంచిది కాదన్నారు. అమరావతి కోసం 33 వేల ఎకరాల భూములను రైతులు త్యాగం చేశారన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలని ప్రకటించిన పవన్‌ కళ్యాణ్‌, సోము వీర్రాజు ఇప్పుడు ప్రభుత్వంపై పోరాటానికి కలసిరావాలని పిలుపునిచ్చారు. దేవినేని అపర్ణ మాట్లాడుతూ జగన్‌మోహన్‌ రెడ్డిని గెలిపించినందుకు ఇలా కక్షపూరితంగా వ్యవహరించడం సబబేనా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివద్ధిపై దష్టి పెట్టకుండా కాలయాపన చేయడం కోసమే ప్రభుత్వం వికేంద్రీకరణ నాటకం ఆడుతోందన్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.
జేఏసీ ప్రతినిధులు లోక్‌సత్తా నాయకురాలు నార్ల మాలతీ, యార్లగడ్డ సుచిత్ర మాట్లాడుతూ విశాఖ రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి అశుభాలు జరుగుతున్నాయన్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి విశాఖ వెళితే అక్కడ అంతా నాశనమే అన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ 13 జిల్లాలోని మహిళలు తమ నిరసనలను ఉధృతం చేయాలని మహిళా నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం నిరసనలు, సోమవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా బీజేపీ, జనసేన, వైసీపీ ఎమ్మెల్యేలకు, ఆయా పార్టీ నాయకులకు రాఖీలు కట్టి తమ నిరసన తెలపాలన్నారు.

Thanks! You've already liked this