మానవతా స్ఫూర్తి సోనూసూద్‌

‘ఎవరి దయాదాక్షిణ్యాల మీదనో ఆధారపడి బతకాల్సిన కర్మ ఏమిటి’? ఈ ప్రశ్న చాలా మంది నుంచి వింటూనే ఉంటాం. నిజమే ఎవరో దయ చూపడం, దానం చేయడం, దాతృత్వం ప్రదర్శించ డమేమిటి? ఈ ప్రశ్నలకు ఈ పెట్టుబడిదారీ సమాజంలో సమాధానాలు వెతకడం అర్థరహితం. అదే సోషలిస్టు వ్యవస్థలోనైతే ఈ ప్రశ్నలే తలెత్తేవి కావు. సమాజంలో అందరూ శ్రమచేస్తుంటే.. కొందరు విలాసంగా, మరికొందరు చాలీచాలనట్టు, ఇంకొందరు ఇతరుల ముందు చేతులు చాచాల్సిన దుస్థితి ఏమిటి? ఈ పరిస్థితినే తాపీ ధర్మారావు ‘ఆలిండియా అడుక్కుతినేవాళ్ల మహాసభ’లో తీవ్రంగా విమర్శించారు. కరోనా మహమ్మారి అన్ని జీవనరంగాలను చావు దెబ్బతీసిన వేళ పేదలు, నిరుద్యోగులు, ఉపాధి కోల్పోయిన అభాగ్యులు, అన్నార్తులను ఆదుకునేదెవరు? ప్రభుత్వాలేమైనా ఆపన్న హస్తం అందించాయా? లేదే! వితరణశీలురు చూపించే ఔదార్యం వారికి కొంత ఆసరాగా నిలుస్తుంది గదా! కొందరు రూపాయిచ్చి కోట్లు దానం చేసుకున్నట్టు డాంబికాలు పోతారు. మరికొందరు పబ్లిసిటీ కోసమే ఫోజులు ఇస్తుంటారు. విపత్తు వేళ ఈ దానకర్ణుల ఊరేగింపులు, మీడియా మందహాసాలు భరించక తప్పదు. కూడుగూడు లేని దీనజనులు, పెను దు:ఖంతో కుమిలిపోయే దయనీయ బతుకులు ఇవన్నీ పట్టించుకుంటాయా? ఇదంతా సంపన్నుల మృగత్వమే. అందుకే మార్క్స్‌ ‘సొంత ఆస్తి’ని రద్దు చేయాలన్నారు. డబ్బు సంపాదనలో మనిషికి ఎంతకీ తృప్తి ఉండదు. అందుకే కళాపూర్ణోదయంలో పింగళి సూరన ‘తమతమ పెద్దవారు మును దాచిన ద్రవ్యములు ఉన్నయట్ల ఉండ’.. ‘మితములేక ఒప్పెడు ధనంబులు తాము గడించి, ఉర్వి నిత్యము అమితంబు నవనిధానములు (నవనిధులు) సంపాదించాలనుకుంటాడు మనిషి అన్నారు. సంపదల సార్థకత- పెంచుకోవడంలో కాదు, పంచుకోవడంలో ఉంటుందని మన పెద్దలు ఏనాడో చెప్పారు. ధనాన్ని సద్వినియోగం చేయడమే ధన్యత! అన్నారు. ‘పర్వతాలు, మహావృక్షాలు, సముద్రాలు ఈ భూమికి భారం కావు, ధన్యతకు నోచుకోని సంపదలే పుడమికి బరువవుతాయి’ అని నైషధీయ చరితమ్‌లో శ్రీహర్షుడు చెప్పాడు. ‘దాన పరోపకారగుణ ధన్యత చిత్తములోన లేనివారు వివేకశూన్యులు’ అన్నాడు భాస్కర శతకకర్త మారన. ‘అమరగ దాక్షిణ్యము ధర్మమునకు కుదురు’ అని అరణ్యపర్వం కీర్తించింది. దయాదాక్షి ణ్యాలను విశిష్టమైన ధర్మాలుగా అభివర్ణించింది మార్కండేయ పురాణం. మనిషిని ఆశయాలు నడిపిస్తే, ఆ జన్మ ధన్యమవుతుంది. ఆశయాల విషయంలో ధనం కేవలం ఒక సాధనంగా నిలుస్తుంది. కరోనా ఆపత్కాలంలో బాధితులను ఆదుకునేందుకు మనకున్న అనేకానేక హీరోల్లో ఒక్కరూ ముందుకు వచ్చిన దాఖలాల్లేవు. హాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌లలో ఎందరో స్టార్లున్నా.. కరోనా బాధితులకు అండగ నిలిచిన స్టార్‌ ఒక్కరూ కనిపించలేదు. వీళ్లందరూ డబ్బుకోసం గంతులేసే రీల్‌ హీరోలే. అదే సినిమాల్లో విలన్లుగా కనిపించే ప్రకాశ్‌రాజ్‌, సోనూసూద్‌ ల్లాంటి వారు రియల్‌ హీరోలుగా ఇప్పుడు జనం గుండెల్లో నిలిచారు. ప్రజల కోసం, సమాజం కోసం పరితపించేవారు, పరిశ్రమించేవారే నిజమైన కథానాయకులని మరోమారు రుజువైంది. ”వ్యాధులు బాధలు ముసిరే వేళ/
మత్యువు కోరలు చాచే వేళ/గుండెకు బదులుగ గుండెను పొదిగీ/ కొన ఊపిరులకు ఊపిరిలూదీ/ జీవన దాతలై వెలిగిన మూర్తులు’ అని సినారె చెప్పిన ఆ మూర్తులే వీరు. ప్రత్యేకించి సోనూసూద్‌ను ఆదర్శనీయునిగా, స్ఫూర్తి ప్రదాతగా, త్యాగమూర్తిగా కొనియాడాలి. ఇప్పుడు నటుడుగా కన్నా ఆపద్బాంధవుడుగా సోనూసూద్‌ అందరికీ చిరపరిచితుడయ్యాడు. కరోనా సృష్టించిన లాక్‌డౌన్‌ గాఢాంధకారంలో రెక్కలు తెగిన దిక్కులేని పక్షుల్లా విలవిల్లాడుతున్న వేలమంది వలస కార్మికులు ‘ఔను నిజం చేదు విషం జీవఫలం’ అని దు:ఖంతో కుంగిపోతుంటే.. వారికి ఓదార్పు అయి నిలిచాడు సోనూసూద్‌. ఎక్కడెక్కడి నుంచో పొట్టచేతపట్టుకొని ముంబై నగరానికి చేరిన వలస కార్మికులు ఒక్కసారిగా వచ్చిన లాక్‌డౌన్‌కు కరచరణాలాడక తల్లడిల్లుతున్న వారందర్నీ సోనూసూద్‌ తన రెక్కల కింద చేర్చుకొని రక్షణ కల్పించిన తీరు ప్రశంసనీయం. ప్రభుత్వాలు ప్రేక్షకపాత్ర పోషిస్తుంటే, వలస కార్మికుల బతుకులు అసంఖ్యాక ప్రశ్నార్థకాలుగా కన్నీటి చారికలైన వేళ.. నేనున్నానంటూ- రోజుకు 45వేల మందికి భోజనం పెట్టి, దేశం నలుమూలలోని వివిధ ప్రాంతాలకు వారిని సురక్షితంగా పంపిన ఆయన ఔదార్యానికి ప్రపంచమే ఔరా! అని విస్తుపోయింది. స్వార్థం, విద్వేషం, సంకుచితత్వం జడలు విరబోసుకుని నర్తిస్తున్న ఆధునిక ప్రపంచంలో దయా సింధువుగా జీవితం ధన్యం చేసుకున్న సోనూసూద్‌ నేటి యువతరానికీ, రేపటి తరాలకీ చెరగని ఆదర్శమవుతాడు. ‘నీరము తప్తలోహ మున నిల్చి అనామకమై నశించు..’ నీటిచుక్క వేడి పెనం మీద పడి ఆవిరైపోతుంది. ‘ఆ నీరమె ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చు..’ తామ రాకుపై పడినప్పుడు ముత్యంలా మెరుస్తుంది. ‘ఆ నీరమె శుక్తిలో పడి మణిత్వము గాంచు సమంచిత ప్రభన్‌..’ అదే నీటిచుక్క ముత్యపు చిప్పలో పడితే మాత్రం నిజంగా ముత్యమై ప్రకాశిస్తుంది అన్నాడు భర్త. డబ్బు నిజమైన దయార్ద్ర హృదయుల చేతిలో ఉంటే ఇలా సమాజానికీ, బాధితులకు ముత్యమై ఉపయోగ పడుతుంది. అందుకే ఆయన మీడియాలో కనిపిస్తున్న అరుదైన మానవ వేదనల కథనాలకు స్పందిస్తూ ‘సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడుపడవోరు’ అన్న గురజాడ మాటలను నిజం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కాడెద్దులు లేకపోవడంతో తన కూతుళ్ల మెడ మీద కాడిపెట్టి పొలం దున్నుతున్న ఓ తండ్రి కథనానికి చలించి ఆ కుటుంబానికి ట్రాక్టర్‌ కొని ఇచ్చాడు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోల్పోయిన వరంగల్‌ జిల్లాకు చెందిన శారద ఇంటికొచ్చి ఆత్మస్థైర్యంతో కూరగాయలు అమ్ముతుంటే.. అది తెలిసి ఆమెకు జాబ్‌ ఆఫర్‌ లెటర్‌ అందించాడు. కిర్గిస్థాన్‌లో బిస్కెక్‌లో చదువు కుంటున్న 250మంది తెలుగు విద్యార్థులను కరోనా నేపథ్యంలో ప్రత్యేక విమానంలో తీసుకొచ్చేలా చేశాడు. తన దాతృత్వానికి ఎల్లల్లేవని నిరూపించాడు. కర్ణ, శిబి, బలిచక్రవర్తి లాంటి వారి గురించి మనం పురాణాల్లోనే చదువుతాం. వారికి ప్రతిబింబంగా నేడు సోనూసూద్‌ మన కళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడని చెప్పక తప్పదు. సోనూ కన్నా ఎక్కువగా దానధర్మాలు చేసిన వారు లేకపోలేదు. వారిలో కొందరు స్వార్థంతో గుళ్లకు, హుండీలకు, మరికొందరు పన్నుల ఎగవేతకూ, ప్రచారానికి సీఎం, పీఎం నిధులకు లక్షలు, కోట్లు ఇవ్వవచ్చు, వారికీ, సోనూకూ తేడా ఉంది. ‘ఇది తత్వం కాదు. మతమూ కాదు. ఒక జీవన దృక్పథం. నిత్యనూతనంగా ప్రవర్థిల్లేది’ అని గురజాడ చెప్పిన మానవతా పద్ధతి సోనూది. ‘ప్రతిది సులభమ్ముగ సాధ్యపడదులెమ్ము నరుడు నరుడౌట ఎంతో దుష్కరమ్ము సుమ్ము’ అన్నారు మహాకవి గాలీబ్‌. అటువంటి చక్కని వ్యక్తిత్వమున్న ఉత్తమ మనిషి అతడు. ‘ఎవరికేం జరిగితే నాకేంటీ! నేను లాభపడ్డానా లేదా..’ అనే దృక్పథం వేళ్లూనుకున్న ఈ సమాజంలో మానవత్వానికీ, మానవ సంబంధాలకూ స్థానం లేకుండా పోతున్న దశలో ఉన్నాం మనం. వస్తువులకు ఇచ్చిన విలువ కూడా సాటి మనుషులకు ఇవ్వలేని అత్యాధునిక సమాజంలో బతుకుతున్నాం మనం. ఈ వినిమయ సంస్కృతిలో పడి కొట్టుకుపోతున్న మనిషి తన సహజ సిద్ధమైన మానవత్వాన్ని మరచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. నిద్రాణమైన మానవత్వాన్ని జాగృతం చేయడమే ఇప్పుడు మనిషి చేయాల్సిన పని. సమాజంలో పరస్పర సహకారమే మానతవత్వ లక్షణమని సోనూసూద్‌లా చాటాలి. మానవత్వం నిత్య వెలుగు కిరణమై, మలయమారుతమై మన సమాజాన్ని అలుముకునేలా చేయాలి. అప్పుడే మనిషితనం, మానవత్వం పరిమళిస్తాయి. అందుకు చోదకశక్తులుగా నిలుస్తున్న సోనూసూద్‌, ప్రకాశ్‌రాజ్‌ తదిరులకు జేజేలు పలకడం సామాజిక బాధ్యత. వారికి అభినందలు తెల్పడం ప్రతి మనిషి కర్తవ్యం.

Thanks! You've already liked this