శానిటైజర్‌ తాగిన మరో ముగ్గురి మృతి

విశాలాంధ్ర- కురిచేడు : ప్రకాశం జిల్లా కురిచేడులో మద్యం కొనలేక మత్తు కోసం శానిటైజర్‌ తాగుతున్న వారిలో మృతుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం వరకు 12 మంది మృతి చెందగా శనివారం మరో ముగ్గురు బలయ్యారు. దీంతో మరణాల సంఖ్య 15కి చేరింది. తాజా మృతుల్లో కంభంపాటి దాస్‌(57), కౌవులూరి నర్సయ్య (42), మీనిగ నాగేశ్వరరావు (50) ఉన్నారు. శనివారం కౌవులూరి నర్సయ్య, మీనిగ నాగేశ్వరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో గుర్తించిన గ్రామ వాలంటీర్‌ చామర్తి లక్ష్మీ పార్వతి విషయాన్ని స్థానిక ఎస్సై రామిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎస్సై బాధితుల ఇంటి వద్దకు చేరుకుని తన వాహనంలోనే ప్రజారోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో వినుకొండ వద్ద ఒకరు, గుంటూరులో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. రోజులు గడిచేకొద్దీ శానిటైజర్‌ మృతుల సంఖ్య పెరగటంతో కురిచేడు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Thanks! You've already liked this