అదే జరిగితే బాబు పరిస్థితి ఏంటి చెప్మా?

చంద్రబాబు

మూడు రాజధానుల ముచ్చట ఇంకా గవర్నర్ కోర్టులో ఉంది. ఆ మీదట రాష్ట్రపతి సంతకంతోనే అది చట్టంగా మారుతుంది. అపుడు కదా అసలైన కధ అని అంతా అంటున్నా కూడా వైసీపీ, టీడీపీల్లో మాత్రం రాజకీయ గోల ఆగడంలేదు. జగన్ అయితే ఈ ఏడాది అక్టోబర్ నాటికి తట్టా బుట్టా సర్దుకుని చలో వైజాగ్ అన‌‌డానికి సిధ్ధంగా ఉన్నారు. నిజానికి కరోనా రాకపోతే ఈ పాటికి జగన్ విశాఖ బీచ్ అందాలను చూసుకుంటూ ఎంచక్కా పాలన చేసేవారని కూడా అంటున్నారు. సరే జగన్ ముఖ్యమంత్రి హోదాలో విశాఖ వెళ్ళిపోతే ఇక అమరావతి, దాన్ని అనుకుని ఉన్న విజయవాడలో ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు చేసేది ఏముంది అన్న ప్రశ్న వస్తోంది.

కరకట్ట ఖాళీ…..

కరకట్ట మీద ఉన్న నివాసం చంద్రబాబుకు అచ్చిరాలేదనే అంటున్నారు. ఆయన ఆ ఇంట్లో చేరి బావుకున్నది కూడా పెద్దగా లేదని కూడా తమ్ముళ్ళు అంటారు. అక్కడ ఉండగానే జగన్ పాదయాత్ర చేయడం, జనాల్లో టీడీపీ గ్రాఫ్ నానాటికీ పడిపోవడం, చంద్రబాబు ఎన్ని రకాలుగా వాస్తు మరమ్మతులు చేసినా చివరికి ఘోరంగా ఓటమి పాలు కావడం వంటివి జరిగాయని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఇక విపక్ష నేతగా కూడా చంద్రబాబు ఉండవల్లిలోని తన ఇంట్లో పట్టుమని పది రోజులు గట్టిగా లేరని కూడా చెబుతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ వరదలు క్రిష్ణా నదికి రావడంతో గత ఏడాది బాబు హైదారాబాద్ కే పరిమితం అయ్యారు. ఆ తరువాత కూడా ఆయన హైదరాబాద్ టూ ఉండవల్లి అంటూ షటిల్ సర్వీస్ చేశారు. ఇక గత నాలుగైదు నెలలుగా కరోనా పుణ్యమాని చంద్రబాబు ఉండవల్లి నివాసం వైపు తొంగి చూడడంలేదంటున్నారు.

అక్కడనుంచేనా…?

చంద్రబాబుకు హైదరాబాద్ లో వందల కోట్ల రూపాయలతో కట్టించుకున్న ఇల్లు బాగా అచ్చివచ్చిందని అంటున్నారు. ఆ ఇంట్లో ఉండగానే 2014 ఎన్నికల్లో చంద్రబాబు నెగ్గారు. పదేళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉన్న బాబుకు జాక్ పాట్ లా విభజన ఏపీలో ముఖ్యమంత్రి సీటు దక్కిందని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు వైజాగ్ వస్తారా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. జగన్ తనతో పాటు సీఎం క్యాంప్ ఆఫీస్, సచివాలయం, ఇతర ముఖ్య విభాగాలు అన్నీ ఖాళీ చేసి తరలించేశాక ఇక ఉండవల్లిలో బాబు ఉన్నా లేకపోయినా ఒకటేనని కూడా అంటున్నారు. దాంతో చంద్రబాబు ఏకంగా హైదరాబాద్ నుంచే ఇకమీదట టీడీపీ వ్యవహారాలు అన్నీ చక్కబెడతారా అన్న చర్చ కూడా ఉంది.

ఇబ్బందేగా….?

ఒకవేళ పాలనారాధాని కనుక విశాఖ వస్తే చంద్రబాబు కచ్చితంగా విశాఖలో నివాసం ఏర్పాటు చేసుకోవాల్సిందేనని తమ్ముళ్ళు అంటున్నారు. అలా కనుక చంద్రబాబు ఉండకపోతే ఉత్తరాంధ్రా ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, చంద్రబాబు ఇప్పటికే అమరావతి నినాదంతో తనకు కంచుకోట అయిన మూడు జిల్లాలలో చెడ్డ అయ్యారని కూడా విశ్లేషిస్తున్నారు. అయితే అమరావతే మన రాజధాని అని చెప్పి రైతుల వద్ద నుంచి 33 వేల ఎకరాలను సేకరించిన చంద్రబాబు తగుదునమ్మా అని విశాఖ వెళ్ళి కాపురం ఉంటే అక్కడ ఓట్లు పడడం మాటెలా ఉన్నా అమరావతి పూర్తి యాంటి అవుతుందని మరో విశ్లేషణ ఉంది. ఇక హైదరాబాద్ నుంచి చంద్రబాబు ఆపరేట్ చేద్దామనుకున్నా పొరుగు రాష్ట్రం నుంచి ఏపీ రాజకీయాలు చేస్తారా అంటూ వైసీపీ ద్వారా విమర్శలు వస్తాయి. మొత్తానికి చూస్తే జగన్ విశాఖ రాజధాని కాదు కానీ చంద్రబాబుకు కొత్త చిక్కులు మొదలవుతాయని అపుడే తమ్ముళ్ళు కంగారు పడుతున్నారు.

The post అదే జరిగితే బాబు పరిస్థితి ఏంటి చెప్మా? appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this