బెజవాడలో బరస్ట్ అవుతున్నారే.. ఎన్నడూ లేదే?

టీడీపీ,వైసీపీ

కృష్ణా జిల్లా రాజకీయాలంటే ఒకప్పుడు హాట్ హాట్ గా ఉండేవి. వంగవీటి రంగా, దేవినేని నెహ్రూ ల మధ్య స్ట్రీట్ వార్ రాజకీయాలను హీటెక్కించేవి. వారి తర్వాత కొంత కృష్ణా జిల్లా రాజకీయాలు ప్రశాంతంగా ఉన్నాయని భావించే తరుణంలో మళ్లీ ఊపందుకున్నాయి. వైసీపీ, టీడపీ నేతల మధ్య మళ్లీ స్ట్రీట్ వార్ మొదలయింది. కృష్ణా జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలుంటే అందులో నాలుగు నియోజకవర్గాల్లో నిత్యం వివాదాలు నడుస్తున్నాయి. ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసు కేసులు నమోదవుతున్నాయి.

కొడాలి నాని వర్సెస్ దేవినేని ఉమ…..

ప్రధానంగా గుడివాడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడాలి నాని తన నియోజకవర్గంలో కాకుండా దేవినేని ఉమను టార్గెట్ చేశారు. ఇద్దరూ వ్యక్తిగతంగా దూషణలకు దిగుతున్నారు. కుటుంబ సభ్యులను కూడా ఈవివాదంలోకి లాగుతుండటంతో వీరి మీడియా సమావేశాలు జగుప్సాకరంగా మారాయి. బూతు పురాణాలు వినలేక చెవులు మూసుకోవాల్సి వస్తుంది. తనను లారీ డ్రైవర్ తో పోల్చడంతో కొడాలి నాని దేవినేని ఉమను ఈ మాటకు అవమానం చెంది ఎవరైనా లారీ ఎక్కించి అప్పడం చేస్తారని అన్నారు. దీనిపై విజయవాడ కమిషనర్ కు టీడీపీ కొడాలి నాని పై ఫిర్యాదు చేశారు.

మైలవరం నియోజకవర్గంలో….

ఇక దేవినేని ఉమ నియోజకవర్గమైన మైలవరంలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు, దేవినేని ఉమకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ చేస్తున్నారని వసంత కృష్ణప్రసాద్ పై దేవినేని ఉమ ఆరోపణలు చేశారు. ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోళ్లలో కూడా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దీనిపై వసంతకృష్ణ ప్రసాద్ సవాల్ విసిరారు. మైలవరం లో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ క్యాడర్ ల మధ్య కూడా నువ్వా? నేనా? అన్న రీతిలో సాగుతుంది.

పేర్ని నాని వర్సెస్ కొల్లు రవీంద్ర…..

మచిలీపట్నం నియోజకవర్గంలోనూ మంత్రి పేర్ని నాని, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వర్గాలు ఇప్పటికే ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇక్కర రాజకీయ హత్య జరగడం కూడా సంచలనం రేపింది. మోకా భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్ర జైలుకు వెళ్లి కూడా వచ్చారు. ఇక్కడ కూడా పరిస్థితి నివురు గప్పిన నిప్పులా తయారైంది. పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పార్థసారధి, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వర్గాల మధ్య మాటల యుధ్ధం జరుగుతుంది. పార్థసారధి 150 కోట్ల అవినీతి చేశారంటూ బోడే ప్రసాద్ ఆరోపిస్తున్నారు. దీంతో ఇక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. నందిగామ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ క్యాడర్ ల మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. మొత్తం మీద కృష్ణా జిల్లాలో దాదాపు నాలుగు నియోజకవర్గాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కిందనే చెప్పాలి.

The post బెజవాడలో బరస్ట్ అవుతున్నారే.. ఎన్నడూ లేదే? appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this