బాలూగారూ.. ‘జీరో’ల‌ను క్ష‌మించండి!

నీవు బతికున్నప్పుడు అన్నాయ్యా అన్నారు, నీవు బతికున్నప్పుడు గాన గంధర్వుడని పొగిడారు, నీవు బతికున్నప్పుడు పొగడ్తలతో ముంచెత్తారు.

ఇప్పుడు నీవు లేవు కదా నీతో వీరికి అవసరం తీరిపోయింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నీకు నీవు సినీ రంగానికి రాకముందు నుంచి పరిచయమట కదా?

మెగాస్టార్ చిరంజీవి నీకు తమ్ముడిలాంటి వాడినని చెప్పుకునేవాడట కదా? బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ నుంచి బన్నీ వరకూ అందరూ నిన్ను గౌరవించేవారట కదా? నీవు మరలిపోగానే ఆ గౌరవం ఏమైందో..????

ముఖ్యమంత్రులు పిలిస్తే చార్టెడ్ ఫ్లైట్లు వేసుకుని మరీ వాలిపోయే ఈ ‘తెర హీరో’లు నీ కడసారి దర్శనానికి తెరచాటుకు వెళ్లిపోయారేమిటో? కరోనా భయమా? తమిళనాడు ప్రభుత్వ పెద్దలు నీ దగ్గరకు వచ్చారు.

కమల్ హసన్ లాంటి వారు ఆసుపత్రి నుంచి నీతోనే ఉన్నారు. వీరందరిని మించి అశేష జనవాహిని నిన్ను చూడటానికి వచ్చారే.. మరి ఈ ‘జీరో’లకు ప్రాణ భయమా? నిన్ను చూస్తేనే కరోనా వస్తుందా?

అశ్వినీదత్, రాఘవేంద్రరావు లాంటి వాళ్లు వాళ్ల చిత్రాలకు నీవు పాడిన పాటల లెక్కలు చెబుతున్నారు. ఒక్కరూ నీ కడసారి చూపునకు రాలేదే? ఎందరో నిర్మాతలను నీ గొంతుతో బతికించావు.

అక్కినేని నాగేశ్వరరావు ‘ ఘంటసాలను ఆ పరిస్థితుల్లో చూడలేను. అందుకే వెళ్లను’ అని స్టేట్ మెంట్ ఇచ్చేశారట. నీకు తెలుసు కదా బాలూ, ఘంటసాల మాస్టారు లేనిదే ఈ ఇద్దరూ లేరు.

అయినా సరే వారు ఘంటసాల మాస్టారి కడసారి చూపునకు వెళ్లలేదు. అందుకే నీవు మనసులో ఏమీ పెట్టుకోవద్దు బాలూ. ఈ జీరోలు వచ్చినా రాకపోయినా నీవు మా వాడివి.

నీవు మా గుండెల్లో ఉంటావు. నీ విషయంలోనే కాదు ఘంటసాల మాస్టారి కడసారి చూపు కోసం వేలాది మంది తరలి వచ్చారు. అచ్చు నీకు జరిగినట్లుగానే సాంప్రదాయబద్దంగా మాస్టారి అంత్యక్రియలు జరిగాయి.

మీరిద్దరూ ఇప్పుడు ఇంద్ర సభలో కలిసినప్పుడు ఈ విషయాలు మాట్లాడుకోవద్దు. ఈ తుచ్ఛ మానవులను క్షమించండి… అందులోనూ మా హీరోలను క్షమించండి.

The post బాలూగారూ.. ‘జీరో’ల‌ను క్ష‌మించండి! appeared first on Latest Telugu News, tollywood news, tv9 telugu live.

Thanks! You've already liked this