ఆకలి భారతం…

నిర్వహణా లోపం..
ఏకపక్ష ధోరణే కారణం
దక్షిణాసియా, దక్షిణాఫ్రికా
దేశాల్లో దీనస్థితి
107 దేశాల ర్యాంకుల విడుదల

న్యూఢిల్లీ :
క్షుద్బాధ ఇంకెన్నాళ్లు అన్న ప్రశ్నకు సమాధానమే లేకుండా పోయింది. ప్రపంచ దేశాల్లో ఆకలి కేకలు ఆగేదెప్పుడో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా దక్షిణాసియా, దక్షిణాఫ్రికా దేశాల్లో ఆకలి రాజ్యమేలు తోంది. అక్కడి ప్రజలు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. పట్టెడన్నం కోసం అల్లాడిపోతు న్నారు. భారత్‌ కూడా ఆకలి రాజ్యంగానే ఉంది. దేశజనాభాలో 14శాతం పౌష్టికాహారానికి నోచుకోవడం లేదని ప్రపంచ ఆకలి సూచీ,2020 పేర్కొంది. గతేడాది 117 దేశాల్లో 102వ స్థానంలో నిలిచిన భారత్‌ ఈ ఏడాది 107కుగాను 94వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఐక్యరాజ్యసమితితో పాటు ప్రపంచ ఏజెన్సీల సమాచారం ఆధారంగా ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్‌ఐ) రూపొందింది. తాజాగా భారత్‌ 94వ స్థానంలో నిలవగా పాకిస్థాన్‌ (88), నేపాల్‌ (73), బంగ్లాదేశ్‌ (75), శ్రీలంక (64), మయన్మార్‌ (78), ఆఫ్ఘనిస్థాన్‌ (99)వ ర్యాంకులను దక్కించుకున్నాయి. చైనా, బెలారస్‌, ఉక్రెయిన్‌, టర్కీ, క్యూబా, కువైట్‌ సహా 17 దేశాలు సూచీలో టాప్‌లో ఉన్నట్లు గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌ దేశాలు ‘సీరియస్‌ కేటగిరి’లో ఉండగా.. నేపాల్‌, శ్రీలంక ‘మోడరేట్‌ కేటగిరి’లో ఉన్నాయని తెలిపింది. ఈ దేశాలు భారత్‌ కంటే మెరుగైన స్థానంలో ఉన్నట్లు జీహెచ్‌ఐ నివేదిక ద్వారా తెలుస్తోంది.
భారత్‌లో ఐదేళ్లలోపు పిల్లల్లో స్టంటింగ్‌ (ఎదుగుదల లోపాలు) రేటు 37.4శాతంగా, వేస్టింగ్‌ రేటు 17.3 శాతంగా, ఐదేళ్లలోపు శిశుమరణాల రేటు 3.7శాతంగా ఉన్నట్లు జీహెచ్‌ఐ పేర్కొంది. ఏ ప్రాంతంలో లేనంతగా దక్షిణాసియాలో అత్యధిక చైల్డ్‌ వేస్టింగ్‌ రేటు ఉందని తెలిపింది. భారత దేశంలో చైల్డ్‌ వేస్టింగ్‌ రేటు 17.3శాతంగా నమోదైందని, ఇది గతేడాది (20.8శాతం)తో పోల్చితే కొంత మెరుగని పేర్కొంది. చైల్డ్‌ స్టంటింగ్‌లోనూ దక్షిణాసియా అధ్వాన్నమని వెల్లడించింది. 1991 నుంచి 2014 వరకు డేటా ప్రకారం బంగ్లాదేశ్‌, భారత్‌, నేపాల్‌, పాకిస్థాన్‌ దేశాల్లో చైల్డ్‌ స్టంటింగ్‌ తీవ్రంగానే ఉన్నట్లు పేర్కొంది.
ఐదేళ్లలోపు శిశుమరణాల్లో తగ్గుదల నమోదు కావడమే ఈ రిపోర్టులో ఆశాజనక అంశం. అలాగనీ ఈ సమస్య పూర్తిగా పరిష్కారమైనట్లు కాదు. మరోవైపు నెలలు నిండకుండా జన్మించి, బరువు తక్కువగా ఉన్న శిశుమరణాలు పెరిగాయి. పేద రాష్ట్రాలు, గ్రామాల్లోనే ఈ మరణాలు ఎక్కువ. నవజాత శిశుమరణాలతో పాటు ఐదేళ్ల లోపు శిశుమరణాలను నివారించే పటిష్ట చర్యలు అవసరం. ప్రసవపూర్వోపచారం, విద్య, పోషణ, రక్తహీనత వంటి అంశాలపై దృష్టి సారించి పొగాకు వినియోగాన్ని నివారించాలని జీహెచ్‌ఐ సూచించింది.
పోష్టికాహార లోపాన్ని నివారించేందుకు చేపట్టిన చర్యలను సమర్థవంతంగా అమలు చేయకపోవడం, పర్యవేక్షణ లోపాలు, ఏకపక్ష ధోరణి వంటివాటి వల్ల దేశంలో ఆకలి కేకలు ఆగడం లేదు అని నిపుణులు అంటున్నారు. న్యూఢిల్లీలోని అంతర్జాతీయ ఆహార విధానం పరిశోధన కేంద్రంలో సీనియర్‌ రీసెర్చ్‌ ఫెల్లో పూర్నిమా మెనన్‌ స్పందిస్తూ ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌ వంటి పెద్ద రాష్ట్రాల్లో పరిస్థితుల్లో మార్పు వస్తే భారతదేశ ర్యాంకింగ్‌లో మెరుగుదల కనిపిస్తుందని అన్నారు. యూపీ, బీహార్‌ వంటి రాష్ట్రాల ప్రభావం జాతీయసగటుపై ఉంటుందని అన్నారు. దేశంలో జన్మించి ప్రతి ఐదుగురులో ఒకరు యూపీలో జన్మిస్తున్నట్లు తెలిపారు. అది అత్యధిక జనాభాగల రాష్ట్రమన్నారు. భారతదేశంలో మార్పు రావాలంటే ముందుగా యూపీ, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో తగు మార్పులు చేయాలని సూచించారు.
పోషక విధనాలు భారత్‌లో అద్భుతంగా ఉన్నాగానీ వాటి అమలు సక్రమంగా జరగడం లేదని, క్షేత్రస్థాయి పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని ఇండియా పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌, అదనపు ప్రొఫెసర్‌, న్యూట్రిషన్‌ రీసెర్చ్‌ హెడ్‌ స్వేతా ఖండేల్వాల్‌ అన్నారు. అమల్లో లోపాలు.. పర్యవేక్షణ లోపాలు, ఏకపక్ష ధోరణలు కారణంగానే పౌష్టికాహార లోపాన్ని జయించలేకపోతున్నామని మా అధ్యయనాల్లో వెల్లడైందని స్వేత చెప్పారు. ప్రజారోగ్యం, పౌష్టికాహార కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మహమ్మారి దృష్ట్యా ఆకలి కేకలను నివారించేందుకు ఐదు సూచనలు చేశారు. అవి ..పౌష్టికాహార సంరక్షణ, ప్రోత్సాహం; సురక్షిత.. అందుబాటు డైట్‌, తల్లీ,శిశు పోషణపై దృష్టి, గర్బిణులు, పాలిచ్చేతల్లులు, శిశువులకు పోష్టికాహారాన్ని అందించడం; చైల్డ్‌ వేస్టింగ్‌ను ఆదిలోనే గుర్తించి ట్రీట్మెంట్‌ అందించడం; అణగారిన వర్గాల పిల్లలకు విద్యాసంస్థల్లో నాణ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడం.. ఆకలి, పౌష్టికాహార లోపాన్ని కేవలం క్యాలరీల ఆధారంగా లెక్కకట్టడం సరైన పద్ధతి కాదని ఆమె అన్నారు. సమతుల్య ఆహారాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇదిలావుండగా, 2020, ప్రపంచ ఆకలీ సూచీలో ర్యాంకింగ్‌ ఏదైనాగానీ ఏ దేశం కూడా సంకట స్థితిలో లేదని, చాడ్‌, తిమోర్‌-లెస్టే, మడగాస్కర్‌ దేశాల్లో మాత్రమే ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లు జీహెచ్‌ఐ పేర్కొంది.
అందుకే మనది పేద దేశం…! : రాహుల్‌
న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీ.. తమ ప్రత్యేక మిత్రుల జేబులు నింపడంలో బిజీగా ఉన్నందునే దేశం పేదరికంలో ముగ్గుతూ ఆకలితో అలమటిస్తోందని కాంగ్రస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. ప్రపంచ ఆకలి సూచీలో 107 దేశాల్లో భారత్‌ 94వ స్థానంలో నిలవడంపై రాహుల్‌ ఘాటుగా స్పందించారు. ‘భారత్‌లోని పేదలు పస్తులుంటున్నారు. ఆకలితో అల్లాడిపోతున్నారు. ఇందుకు కారణం.. ప్రభుత్వం తమ ప్రత్యేక మిత్రుల జేబులు నింపడంలో బిజీగా ఉండమే’ అంటూ ఆయన హిందీలో ట్వీట్‌ చేశారు. పక్క దేశాలైన పాకిస్థాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ల కంటే భారత్‌ దిగవ స్థాయిలో ఉన్నదని సూచిస్తూ ఓ గ్రాఫ్‌ను రాహుల్‌ గాంధీ పోస్టు చేశారు.

Thanks! You've already liked this