ఆర్తులను ఆదుకోరా?

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : జేవీఎస్‌ఎన్‌

విశాలాంధ్ర-విజయవాడ కార్పొరేషన్‌ /కశింకోట :
వరదలు, భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాలలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా పర్యటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. రాష్ట్రంలోని నదులన్నీ పొంగిపొర్లుతున్నాయని, దీనివల్ల పెద్దఎత్తున పంట నష్టం జరిగిందని, జనావాసాలు వరద ముంపునకు గురయ్యాయని తెలిపారు. ముంపు ప్రాంతాల్లో రెవెన్యూ యంత్రాంగం పర్యటించి సమగ్ర సర్వే చేయాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి సూచించారు. కృష్ణానది ఉధృతంగా ప్రవహించడం వల్ల ముంపునకు గురైన విజయవాడలోని రాణిగారితోట సమీపంలోని తారకరామా నగర్‌, భూపేష్‌గుప్తా నగర్‌, రణదివె నగర్‌, రామలిం గేశ్వరనగర్‌ తదితర ప్రాంతాల్లో సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌తో కలిసి ఆయన శనివారం పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. వరద సహాయ కార్యక్రమాలు, పునరావాస కేంద్రాల ఏర్పాటు తదితర వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నదీ పరివాహక ప్రాంతాలన్నీ జలమయమయ్యాయన్నారు. రైతులు, పల్లపుప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. వాణిజ్య, ఆహార, ఉద్యాన పంటలు తీవ్రంగా తెబ్బతిన్నాయని, రైతులకు అపార నష్టం కలిగిందన్నారు. పత్తి, మిరప, వరి, వేరుశనగ, అరటి తదితర పంటలు నీటిమునిగాయన్నారు. కడప, కర్నూలులో 10 నుంచి 15లక్షల హెక్టార్లలో వివిధ పంటలు వరదకు కొట్టుకుపోయాయని తెలిపారు. అనుభవ రాహిత్యం కారణంగా వరదను అంచనా వేయడంలో జగన్‌ ప్రభుత్వం విఫలమైందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే కృష్ణానదికి 7.72 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారని, ఈ వరద రోజు రోజుకూ పెరుగుతోందన్నారు. మరో రెండు, మూడు లక్షల క్యూసెక్కులు పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారులు అంచనా వేస్తున్నారని, నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామకృష్ణ సూచించారు. దోనేపూడి శంకర్‌ మాట్లాడుతూ వరద ప్రమాదాన్ని అంచనా వేయడంలో, బాధితులను ఆదుకోవ డంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రిటైనింగ్‌వాల్‌ సగం నిర్మించి వదిలేశారని, వైసీపీ ప్రభుత్వం మిగిలిన రిటైనింగ్‌వాల్‌ పూర్తి చేస్తామని చెప్పినా ఇప్పటికీ నిర్మాణం ప్రారంభించ లేదని చెప్పారు. పర్యవసానంగా భూపేస్‌గుప్తా నగర్‌, తారకరామానగర్‌, రణదివె నగర్‌, రామలింగేశ్వరనగర్‌ ప్రజలు ముందుపునకు గురవుతున్నారని తెలిపారు. సీపీఐ 18వ డివిజన్‌ కార్యదర్శి సంగుల పేరయ్య, 17, 18 డివిజన్ల సీపీఐ నాయకులు, కార్యకర్తలు సయ్యద్‌ సుభానీ, కూరాకుల స్టాలిన్‌, జి కొండారెడ్డి, యం విజరురావు, అంబడిపూడి చిన్నపాతపాటి, జల్ది చిన్నారావు, పాశం ఆంజనేయులు, నజీర్‌, బాలసిద్ధయ్య, పి సూరిబాబు, దారా దాసు, జి క్రాంతి, వి శ్రీను, ఎ బుజ్జి, యం జగన్నాధం, పి నరసింహారావు, కుంబా దుర్గారావు తదితరులు రామకృష్ణ వెంట ఉన్నారు. అంతకుముందు చలసానినగర్‌ సెంటర్‌లో సీపీఐ 18వ డివిజన్‌ కార్యాలయాన్ని రామకృష్ణ ప్రారంభించారు.
నష్టం అంచనావేసి బాధితులను ఆదుకోవాలి
భారీవర్షాలతో పంటలు మునిగి నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి డిమాండు చేశారు. విశాఖజిల్లా కశింకోటలో శారదా నది వెంబడి మునిగిపోయిన పంటలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సరదర్భరగా సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ అప్పులు చేసి పెట్టుబడిపెట్టిన రైతులు నష్ట పోవడంతో కుంగిపోతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టం అంచనా వేసి బాధితులను ఆదుకోవాల న్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాజాన దొరబాబు, మండల నాయకులు సతీష్‌, శ్రీను, రాజు, కొల్లి సత్యారావు, సత్యనారాయణ, బొబ్బరి శ్రీను, మహాలక్ష్మి నాయుడు, దుర్గునాయుడు పాల్గొన్నారు.

Thanks! You've already liked this