కిట్లు… ఇక్కట్లు

50 శాతానికి మించని
జేవీకే కిట్ల బట్వాడా
ఒక్కో స్కూల్‌కు ఒకే ట్యాబ్‌ ఉండటం వల్లే
మాన్యువల్‌గా ఇవ్వాలంటున్న తల్లిదండ్రులు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి :
జగనన్న విద్యా కానుక (జేవీకే) కిట్‌ల పంపిణీకి బయోమెట్రిక్‌ (విద్యార్థుల తల్లులకు) ఆటంకంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా వైరస్‌ అన్‌లాక్‌-5 మార్గద ర్శకాల ప్రకారం తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు ఇప్పటికే క్లాసులు ప్రారంభమ య్యాయి. వచ్చే నెల రెండో తేదీ నుంచి కొవిడ్‌ నిబంధనల మేరకు మిగిలిన విద్యార్థులకు తరగతులు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ఈ మేరకు ప్రకటన చేశారు. అప్పటికల్లా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం, బూట్లు, బెల్ట్‌తో కూడిన జేవీకే కిట్‌ల పంపిణీని పూర్తి చేయాల్సి ఉంది. ఈ నెల ఎనిమిదిన సీఎం వైఎస్‌ జగన్‌ కిట్‌ల పంపిణీని ప్రారంభించగా, తొమ్మిది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో రోజుకు వంద మంది చొప్పున కిట్‌ల పంపిణీ జరుగుతోంది. వారం రోజులలో 13 జిల్లాల్లో 50 శాతమే కిట్‌ల పంపిణీ జరిగింది. రాష్ట్రంలో మొత్తం 37,92,650 మందికి కిట్‌లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తల్లుల బయోమెట్రిక్‌ తీసుకున్న తర్వాతే కిట్‌లు అందజేస్తున్నారు. ఒక్కో స్కూల్‌కు ఒక ట్యాబ్‌ మాత్రమే ఉండటంతో పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనికితోడు నెట్‌వర్క్‌ సమస్య పంపిణీకి ఆటంకంగా మారుతోందని పలువురు ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. మొత్తం 37.92 లక్షల మంది విద్యార్థులకుగానూ ఇప్పటి వరకు 17.97 లక్షల మంది తల్లుల బయోమెట్రిక్‌ మాత్రమే పూర్తయింది. రాష్ట్రంలో సగటున 47.39 శాతం మంది విద్యార్థులకే జేవీకే కిట్‌ల పంపిణీ పూర్తయినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. జేవీకే కిట్‌లను మాన్యువల్‌ విధానంలో పంపిణీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు అధికారులకు సూచించినప్పటికీ, యాప్‌లో బయోమెట్రిక్‌ తీసుకున్నాకే పంపిణీ చేస్తున్నారు.
తరగతుల వారీగా పుస్తకాలకు ఒకసారి, జేవీకే కిట్‌లకు ఒకసారి బయోమెట్రిక్‌ తీసుకోవాల్సి వస్తోంది. ఒక్కోసారి పావు గంట నుంచి అరగంట వరకు బయోమెట్రిక్‌ పడటం లేదు. దీంతో కొన్ని స్కూళ్లలో ఐరిస్‌ విధానాన్ని అమలు చేస్తున్నా, అదీ మొరాయిస్తోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కిట్‌లను మాన్యువల్‌ విధానంలో పంపిణీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
అనంతపురం టాప్‌, విశాఖ లీస్ట్‌
జేవీకే కిట్‌ల పంపిణీలో అనంతపురం జిల్లా టాప్‌లో ఉంటే, విశాఖ జిల్లా చివరిస్థానంలో ఉంది. అనంతపురంలో అత్యధికంగా 58.23 శాతం కిట్‌ల పంపిణీ జరగ్గా, విశాఖలో 33.24 శాతమే పూర్తయింది. సీఎం సొంత జిల్లా కడపలో 39.21 శాతం కిట్‌ల పంపిణీ జరిగింది. దీంతో ఆ జిల్లా చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. గుంటూరు 57.52 శాతంతో రెండోస్థానంలో ఉండగా, 52.64 శాతంతో చిత్తూరు మూడోస్థానంలో ఉంది.
కర్నూలులో అత్యధికంగా 4,09,698 మంది విద్యార్థులు ఉండగా, 2,13,048 మంది (52 శాతం) తల్లుల బయోమెట్రిక్‌ పూర్తవ్వగా, ఆ జిల్లా నాలుగోస్థానంలో ఉంది. తూర్పు గోదావరిలో 3,88,435 మంది విద్యార్థులుంటే, 1,75,878 మంది (45.28 శాతం) తల్లులకే బయోమెట్రిక్‌ పూర్తయింది.
విద్యాశాఖ ప్రధాన కార్యాలయం ఉన్న కృష్ణాజిల్లాలో 2,56,546 మంది విద్యార్థులుంటే, 1,04,482 (40.73 శాతం) తల్లులకే బయోమెట్రిక్‌ను పూర్తి చేసి కిట్‌లు పంపిణీ చేశారు. నవంబరు రెండు నుంచి స్కూళ్లను ప్రారంభించనుండగా, ఆలోగా విద్యార్థులకు కిట్‌లు పంపిణీ చేయాల్సి ఉంది.
కార్పొరేట్‌ స్కూళ్ల తరహాలో యూనిఫాం కుట్టించుకోవాలని ప్రభుత్వం షరతు పెట్టింది. సకాలంలో కిట్‌లు పంపిణీ చేయకపోతే యూనిఫాంలను కుట్టించుకోవడం ఆలస్యమయ్యే అకాశం కూడా ఉంది.

జిల్లాల వారీగా జేవీకే కిట్‌ల పంపిణీ వివరాలు
జిల్లా పేరు విద్యార్థులు బయోమెట్రిక్‌ శాతం
అనంతపురం 3,35,939 1,95,627 58.23
గుంటూరు 3,35,990 1,93,269 57.52
చిత్తూరు 3,23,874 1,70,478 52.64
కర్నూలు 4,09,698 2,13,048 52.00
నెల్లూరు 2,23,792 1,10,811 49.52
పశ్చిమ గోదావరి 2,76,791 1,33,574 48.26
తూర్పు గోదావరి 3,88,435 1,75,878 45.28
ప్రకాశం 2,92,163 1,30,001 44.50
శ్రీకాకుళం 2,32,261 1,02,753 44.24
విజయనగరం 199,534 82,229 41.21
కృష్ణా 2,56,546 1,04,482 40.73
కడప 2,21,123 86,697 39.21
విశాఖపట్నం 2,96,504 98,555 33.24
మొత్తం 37,92,650 17,97,402 47.39

Thanks! You've already liked this