తక్షణం 2,250 కోట్లు ఇవ్వండి

హోంమంత్రి అమిత్‌షాకు సీఎం జగన్‌ లేఖ

విశాలాంధ్ర బ్యూరో- అమరావతి :
భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయామని, రాష్ట్రాన్ని ఆదుకునేందుకు వెంటనే రూ.2250 కోట్ల ఆర్థిక సహాయం చేయడంతో పాటు, జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బందాన్ని పంపాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు శనివారం సీఎం జగన్‌ లేఖ రాశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయు గుండం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయని, ఈనెల 13వ తేదీ ఒక్కరోజునే తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరంలో అత్యధికంగా 265.10 మి.మీ వర్షపాతం నమోదు కాగా, అదే జిల్లాలోని కాట్రేనికోనలో 228.20 మి.మీ, తాళ్లరేవులో 200.50 మి.మీ, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో 205.30 మి.మీ, పేరవల్లిలో 204.02 మి.మీ వర్షం కురిసిందని వివరించారు. ఎగువన ఉన్న తెలంగాణ, మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురవడంతో కష్ణా నదికి వరద పొటెత్తింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీతో సహా, పలు చోట్ల గత మూడు రోజులుగా ప్రమాద హెచ్చరికలు జారీ చేసి, లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాము. భారీ వర్షాలు, వరదలతో జన జీవితం అస్తవ్యస్తమైంది. గత ఆగస్టు, సెప్టెంబరులోనూ భారీ వర్షాలు కురవడం, ఇప్పుడు సంభవించిన వరదలతో నష్టం మరింత పెరిగింది. వరసగా కురిసిన వర్షాలకు రాష్ట్రంలో పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయని, చెరువులు, కాల్వలకు గండ్లు పడ్డాయని తెలిపారు. ఈ వర్షాల వల్ల రైతులు కూడా చాలా నష్టపోయారు. ముఖ్యంగా చేతికొచ్చే దశలో ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న, చెరకు పంటలు, కూరగాయలు, అరటి, బొప్పాయి తోటలు దారుణంగా దెబ్బ తిన్నాయి. వరద సహాయ కార్యక్రమాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది నిర్విరామంగా పని చేసినప్పటికీ, 14 మంది చనిపోయారు.
వివిధ శాఖల ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు రూ.4450 కోట్ల మేర నష్టం జరిగింది. పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టి, తిరిగి సాధారణ పరిస్థితికి తీసుకు రావడం కోసం తక్షణమే ముందస్తుగా కనీసం రూ.1000 కోట్లు మంజూరు చేయాలి. అదే విధంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడం కోసం వెంటనే కేంద్ర బందాన్ని పంపించాలి. ఇప్పటికే కోవిడ్‌-19తో ఆర్థికంగా నష్టపోయి ఉన్న రాష్ట్రంలో, ఇప్పుడు ఈ వర్షాలు, వరదలు పరిస్థితిని మరింత దారుణంగా మార్చాయి. కాబట్టి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు కేంద్రం చేయూత ఎంతో అవసరమని జగన్‌ ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

Thanks! You've already liked this