రెమ్‌డిసివిర్‌పై పునరాలోచనలో భారత్‌

న్యూఢిల్లీ :
కరోనా పీడిత దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. వ్యాధి తీవ్రంగా ఉన్న బాధితులకు ‘రెమ్‌డిసివిర్‌’ పనిచేయటం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్‌ఓ) ఇటీవల పేర్కొంది. దీంతో కొవిడ్‌ చికిత్సలో రెమ్‌డిసివిర్‌ వినియోగంపై భారత్‌ పునరాలోచనలో పడింది. దేశంలో కొవిడ్‌ బాధితులకు రెమ్‌డిసివిర్‌తో పాటు హైడ్రాక్సీక్లోరోక్విన్‌, రిటోనావిర్‌ (లోపినా విర్‌), ఇంటర్‌ఫెరాన్‌ ఔషధాలను ఇస్తు న్నారు. వీటిలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఔషధాన్ని కొవిడ్‌ ప్రారంభ దశలో, రెమ్‌డెసివిర్‌ను అత్యవసర పరిస్థితిలో ఉపయోగించేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఆమోదించింది. దేశంలో కొవిడ్‌ -19 బాధితుల చికిత్సలో వాడేందుకు మొదట అనుమతి పొందిన ఔషధం రెమ్‌ డెసివిర్‌ కావడం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అక్టోబర్‌ 15న నిర్వహించిన ట్రయిల్స్‌లో భారత్‌ నుంచి 937 మంది పాల్గొన్నారు. దీనిలో పై నాలుగింటిలో రెమ్‌ డెసివిర్‌తో సహా ఏ ఔషధం మరణాల రేటు ను తగ్గించినట్టు కచ్చితంగా వెల్లడి కాలేదని ఐసీఎంఆర్‌ వెల్లడించింది. ఇక ఇంటర్‌ ఫెరాన్‌, కరోనా రోగులకు హానికరమని తెలిసిందని.. దానితో కరోనా చికిత్సలో దీని వాడకాన్ని నిలిపివేస్తున్నామని వారు వెల్లడించారు. ఈ ట్రయల్స్‌ వల్ల కరోనా చికిత్సకు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానం లభించిందని భారత్‌లో ఈ అధ్యయనాన్ని పర్యవేక్షించిన నిపుణులు తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో కరోనా చికిత్స విధానంపై పునఃసమీక్ష ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ అంశాన్ని నీతి ఆయోగ్‌ సభ్యులు డాక్టర్‌ వీకే పాల్‌, ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరామ్‌ భార్గవల నేతత్వంలో జరిగే కార్యాచరణ (టాస్క్‌ ఫోర్స్‌) సమావేశంలో చర్చించనున్నారు.
తొలిదశ టీకా పంపిణీకి కేంద్రం కార్యాచరణ
కరోనా టీకా తొలిదశ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. తొలి దశలో జనాభాలో 23 శాతం మందికి కరోనా టీకా అందించేలా చర్యలు తీసుకుంటోంది. ఆరోగ్య కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు వ్యాక్సిన్‌ ఇచ్చేలా కసరత్తు చేస్తోంది. వ్యాక్సిన్‌ ఎవరికి ఇవ్వాలన్న విషయంలో నాలుగు కేటగిరీలు విభజించారు. ఇందులో 50-70 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు, 2కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌(పోలీస్‌, మున్సిపల్‌, సైనిక బలగాలు), 50ఏళ్లు దాటిన 26కోట్ల మంది ఉండగా, నాలుగో కేటగిరిలో 50 ఏళ్లలోపు వారిని చేర్చారు. ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ట్రయిల్స్‌కు సంబంధించిన పూర్తి నివేదికలు నవంబరు చివరికి లేదా డిసెంబరు మొదటి వారంలో వస్తాయని కేంద్రం ఇటీవల తెలిపింది. ఇందులో భాగంగానే కేంద్రం వ్యాక్సిన్‌ తొలిదశ పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

Thanks! You've already liked this