ఏదో రకంగా వాయిదా.. ఇబ్బంది తప్పడం లేదుగా

యడ్యూరప్ప

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అనుకున్నట్లుగా జరగడం లేదు. మంత్రివర్గ విస్తరణ చేపట్టాలనుకుంటున్న ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు. మరోవైపు ఉప ఎన్నికలు కూడా రావడంతో మంత్రి వర్గ విస్తరణ ఉప ఎన్నికల తర్వాతేనని చెబుతున్నారు. యడ్యూరప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. పది మందికి మాత్రమే కేంద్ర నాయకత్వం కేబినెట్ లోకి తీసుకునేందుకు అనుమతిచ్చింది.

మరో ఆరుగురికి….

మరో ఆరుగురికి యడ్యూరప్ప మంత్రివర్గంలో చోటు కల్పించాల్సి ఉంది. అయితే తన వారికి, తాను హామీ ఇచ్చిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని యడ్యూరప్ప అనేక రోజులుగా భావిస్తున్నారు. ఇందుకు సొంత పార్టీ నేతలు మోకాలడ్డుతున్నారు. పార్టీలో కొందరు ఇప్పటికే యడ్యూరప్పపై కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. యడ్యూరప్ప కుమారుడి జోక్యం పాలనలో ఎక్కువగా ఉందని వారు ఆధారాలతో సహా అధిష్టానానికి సమర్పించినట్లు తెలిసింది.

తన వారికి…..

యడ్యూరప్ప ప్రధానంగా తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు తనతో చేతులు కలిపిన వారికి కేబినెట్ లో చోటు కల్పించాలనుకుంటున్నారు. వారిలో ఆర్ శంకర్, ఎంటీబీ నాగారాజ్, హెచ్. విశ్వనాధ్ తదితరులు ఉన్నారు. అయితే వీరికి మంత్రి పదవులు ఇవ్వడంపై రాష్ట్ర బీజేపీ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీర్ఘకాలంగా పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్న వారికి కాకుండా మధ్యలో వచ్చిన వారికి ఎలా ఇస్తారని నేతలు సూటిగానే ప్రశ్నిస్తున్నారు.

ఉప ఎన్నికల తర్వాత……

అయితే యడ్యూరప్ప మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని గట్టిగా భావిస్తున్నారు. నేతల నుంచి ఆయనకు వస్తున్న వత్తిడి అలా ఉంది. యడ్యూరప్ప కేంద్రనాయకత్వానికి ఒక జాబితా పంపగా, రాష్ట్ర బీజేపీ మరో జాబితాను పంపింది. అయితే ఈ లోపు ఉప ఎన్నికలు రావడంతో మంత్రి వర్గ విస్తరణ అనివార్యంగా వాయిదా పడినట్లు తెలిసింది. ఉప ఎన్నికల తర్వాతనే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలున్నాయి. అప్పటీకైనా యడ్యూరప్ప మాట చెల్లుబాటు అవుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

The post ఏదో రకంగా వాయిదా.. ఇబ్బంది తప్పడం లేదుగా appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this