నానీకి ఆ నిర్మాత హ్యాండిచ్చాడా?

నానీకి ఆ నిర్మాత హ్యాండిచ్చాడా?

నేచురల్ స్టార్ నానితో సినిమా అంటే నిర్మాతలకు పండగన్నట్లే. మంచి అభిరుచితో సినిమాలు చేసే నాని మినిమం గ్యారెంటీ హీరోగా ముద్ర పడ్డాడు. అతడి సినిమాలు మీడియం బడ్జెట్లో, శరవేగంగా పూర్తవుతాయి. నానీకి ఉన్న మార్కెట్లో నిర్మాతలకు మంచి బిజినెస్ జరుగుతుంది. చాలా వరకు టేబుల్ ప్రాఫిట్‌తో బయటపడుతుంటారు నిర్మాతలు.

నాని సినిమాకు మంచి టాక్ వస్తే భారీ లాభాలు అందుతాయి. అందుకే అతడితో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎగబడుతుంటారు. ఐతే ఆల్రెడీ నానితో హిట్ సినిమా తీసిన ఓ నిర్మాత ఇప్పుడు అతడి కొత్త చిత్రం నుంచి అర్ధంతరంగా తప్పుకున్నాడన్న వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ప్రస్తుతం ‘టక్ జగదీష్’లో నటిస్తునన నాని.. దీని తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్’ అనే వెరైటీ టైటిల్‌తో తెరకెక్కబోయే సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే.నానితో ‘జెర్సీ’ చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని టేకప్ చేసింది. ‘ట్యాక్సీవాలా’ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు.

కొన్ని నెలల కిందట ఈ చిత్రాన్ని ఘనంగా ప్రకటించాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. కానీ ఇప్పుడాయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అందుకు కారణాలేంటన్నది తెలియదు. సితారకు ఉన్న ఇమేజ్ దృష్ట్యా బడ్జెట్‌ సమస్యలతో వెనక్కి తగ్గే అవకాశాలు లేవు. మరి ఎక్కడ తేడా జరిగిందన్నది తెలియడం లేదు. ఐతే ఈ చిత్రానికి నిర్మాత దొరకని పరిస్థితి ఏమీ లేదు.

వెంకట్ బోయనపల్లి అనే మరో నిర్మాత ఈ చిత్రాన్ని చేజిక్కించుకున్నాడట. మరి ఇది అడ్జస్ట్‌మెంట్ మీద ఏమైనా జరిగిందా అన్నది చూడాలి. ఇంకో రెండు నెలల్లో ‘టక్ జగదీష్’ను పూర్తి చేసి ‘శ్యామ్ సింగ రాయ్’ను మొదలుపెట్టాలనుకుంటున్నాడు నాని. ఇది కోల్‌కతా నేపథ్యంలో సాగే కథ అని సమాచారం.

Thanks! You've already liked this