ఆ టాలీవుడ్ కుటుంబం మొత్తానికి కరోనా !

ఆ టాలీవుడ్  కుటుంబం మొత్తానికి కరోనా !

టాలీవుడ్లో పేరున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు చాలామందే కరోనా బారిన పడ్డారు. రాజమౌళి కుటుంబ సభ్యుల దగ్గర్నుంచి.. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు వరకు చాలామంది వైరస్ బాధితులుగా మారారు. దాదాపుగా అందరూ దాన్నుంచి కోలుకున్నారు. ఇప్పుడు మరో పేరున్న కుటుంబం వైరస్ బారిన పడింది. సీనియర్ హీరో రాజశేఖర్ ఇంట్లో అందరూ కరోనా బాధితులుగా తేలారు.

రాజశేఖర్, ఆయన భార్య జీవిత.. వాళ్లిద్దరి కూతుళ్లు శివాని, శివాత్మిక‌లకు కూడా వైరస్ సోకింది. కొన్ని రోజులుగా దీని గురించి ప్రచారం సాగుతుండగా.. తాజాగా రాజశేఖరే స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించాడు. తాము నలుగురం వైరస్ బారిన పడ్డామని.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని రాజశేఖర్ వెల్లడించాడు.

ఐతే తన ఇద్దరు కూతుళ్లూ పూర్తిగా వైరస్ నుంచి కోలుకున్నారని.. తాను, జీవిత కూడా మెరుగయ్యామని ఆయన వెల్లడించాడు.ఇంతకుముందులా సినీ ప్రముఖులకు కరోనా అంటే కంగారు పడిపోయే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. సామాన్య జనాల మాదిరే వాళ్లు కూడా కరోనాను లైట్ తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది.

రాజశేఖర్ స్వయంగా డాక్టర్ కావడంతో ఆయన కంగారు పడకుండా కరోనా నుంచి కోలుకుంటున్నట్లున్నారు. ‘గరుడ వేగ’తో కొన్నేళ్ల కిందట తన పునరాగమనాన్ని ఘనంగా చాటిన రాజశేఖర్.. ఆ తర్వాత గత ఏడాది ‘కల్కి’తో పలకరించారు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో తర్వాతి సినిమా విషయంలో బాగా అయోమయానికి గురయ్యారు.

‘భాయ్’ దర్శకుడు వీరభద్రం చౌదరితో ఓ సినిమాను మొదలుపెట్టినట్లే పెట్టి ఆపేశారు. అలాగే ‘కపటధారి’కి కూడా ఓకే చెప్పినట్లే చెప్పి వెనక్కి తగ్గారు. చివరికి ఫామ్‌లో లేని ‘షో’; ‘మిస్సమ్మ’ చిత్రాల దర్శకుడు నీలకంఠ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ మూవీ చేయడానికి ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. త్వరలోనే ఆ చిత్ర షూటింగ్ మొదలు కానుంది.

Thanks! You've already liked this