ఏపీలో డేంజర్ ఆ ఐదు జిల్లాలే

ఏపీలో డేంజర్ ఆ ఐదు జిల్లాలే

ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనాలో భారత్ పాత్రను తక్కువ చేయటానికి లేదు. మొన్నటివరకు కేసుల నమోదులో మొదటిస్థానంలో ఉన్నప్పటికి.. ఇప్పుడు తగ్గిన జోరుతో ర్యాంకింగ్ లోనూ వెనకడుగు వేస్తోంది. మొన్నటివరకు దేశంలోని మహారాష్ట్ర.. ఏపీలో విపరీతంగా నమోదవుతున్న కేసులు కూడా మొత్తం సంఖ్యను ప్రభావితం చేసింది. మిగిలిన దేశాలతో పోలిస్తే.. భారత్ కేసుల్లో తక్కువ.. రికవరీ రేట్లు ఎక్కువ.. మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి.

అయితే.. దేశంలో ఇప్పుడు నమోదు అవుతున్న కేసుల్లో ఎక్కువ భాగం ఉన్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో 5 జిల్లాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. నిజానికి ఏపీలోని ఆ ఐదు జిల్లాలతోనే అసలు సమస్య అని. ఆ జిల్లాల్లో కేసుల నమోదు తగ్గుముఖం పడితే.. మొత్తం లెక్క మారుతుందని చెబుతున్నారు. ఆ మధ్యన రోజుకు 10వేల కేసులు నమోదు అయిన సందర్భంలో.. సదరు జిల్లాల్లోని తీవ్రత ఏ స్థాయిలో ఉందనటానికి ఒక ఉదాహరణ చెప్పారు.
హైదరాబాద్ మహానగర జనాభా 1.30కోట్లుగా చెబుతారు.

అంత భారీ సమూహంలో కేసులు 300 నుంచి 400 కూడా దాటకుంటే.. అందుకు భిన్నంగా ఏపీలోని ఐదు జిల్లాల్లో (తూర్పు గోదావరి.. పశ్చిమ గోదావరి.. చిత్తూరు.. గుంటూరు.. ప్రకాశం) వెయ్యికి పైగా కేసులు నమోదైన దారుణ పరిస్థితి. అప్పుడే కాదు ఇప్పుడు కేసుల నమోదు చూసినప్పుడు హైదరాబాద్ మహానగరంలో నమోదవుతున్న కేసుల కంటే అధికంగా ఆయా జిల్లాలు ఉండటం గమనార్హం.
తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో 457 కేసులు.. పశ్చిమ గోదావరిలో 524 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల తీవ్రతను తగ్గిస్తే.. ఏపీ ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది.

దేశ వ్యాప్తంగా కేసులు అత్యధికంగా నమోదయ్యే 30 జిల్లాల లెక్క తీస్తే.. అందులో ఏపీకి చెందిన జిల్లాలు ఐదు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందన్న విషయం అర్థం చేసుకోవచ్చు.  ప్రస్తుతం ఏపీలో 3500 కేసులు నమోదైతే.. ఈ ఐదు జిల్లాల్లోనే అత్యధిక కేసులు నమోదైనట్లుగా చెబుతున్నారు. అలా ఆ ఐదు జిల్లాలు ఏపీని వణికిస్తున్నాయని చెప్పక తప్పదు.

Thanks! You've already liked this