తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన మాస్ లీడర్

తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన మాస్ లీడర్

మాస్ లీడర్.. పేదల కష్టాల కోసం పోరాడే పెద్ద మనిషి.. టీఆర్ ఎస్ సీనియర్ నేత.. తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బుధవారం అర్థరాత్రి 12.25 గంటల వేళలో తుదిశ్వాస విడిచారు. 86 ఏళ్ల వయసులో అనారోగ్యంతో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన.. తీవ్ర అనారోగ్యంతో తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు.

సెప్టెంబరు 28న కరోనా సోకిన ఆయన.. దాన్ని జాయించినట్లే అని అందరు అనుకుంటున్న వేళ.. తిరిగి అస్వస్థతకు గురయ్యారు. న్యూమోనియాకు గురైన ఆయనకు వైద్యులు చికిత్సలో భాగంగా గుండె ఆపరేషన్ వేసి స్టంట్ వేశారు. అయినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈ నేపథ్యంలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.

ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మరింత విషమించినట్లుగా ఆయన అల్లుడు కమ్ రాంనగర్ కార్పొరేటర్ వి. శ్రీనివాసరెడ్డి గురువారం సాయంత్రం వెల్లడించారు. గడిచిన మూడు రోజులుగా టీఆర్ఎస్ సీనియర్ నేతలు పలువురు నాయిని పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం గురువారం సాయంత్రం ఆసుపత్రికి వెళ్లారు. నాయిని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అంతలోనే ఆయన ఆరోగ్యం మరింత విషమించటం.. అర్థరాత్రి వేళ.. తుదిశ్వాస విడవటంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.

నాయిని కన్నుమూతతో ఒక తరానికి చెందిన కీలక నాయకుడ్ని కోల్పోయినట్లే. పాత తరానికి చెందిన నేతగా.. మనసుకు అనిపించిన విషయాన్ని మొహమాటం లేకుండా ముఖం మీదనే చెప్పేయటం నాయినికి అలవాటు. కార్మిక నేతగా.. పేదల కష్టాల గురించి తపించే ఆయన.. ఈ తరానికి చెందిన నేతలకు పూర్తి భిన్నమని చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించటంతో పాటు.. గులాబీ బాస్ కేసీఆర్ వెంటే నడిచారు. పార్టీ కష్టంలో ఉన్నప్పుడు.. చాలామంది నాయకుల మాదిరి కాకుండా పార్టీ రథసారధి వెంటనే నడిచారు. పక్క చూపులు చూడలేదు.

చూసినంతనే గంభీరంగా కనిపించే నాయిని.. కష్టంతో వచ్చిన వారిని చూసినంతనే కరిగిపోతారు. సమస్య తనదైనట్లుగా స్పందించటం.. పేదోళ్ల కోసం కోట్లాడేందుకు ఎవరినైనా ఎదిరించే గుణం ఆయన సొంతం. ఇదే ఆయన్ను మాస్ నాయకుడన్న ముద్ర వేసింది. జనతాపార్టీ నుంచి మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలకం ఏమంటే.. తెలంగాణ తొలిదశ.. మలిదశ ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించటం.. తాము కన్న తెలంగాణ కలను సాకారం చేసుకున్నారు. చివరకు అదే తెలంగాణ రాష్ట్రానికి తొలి హోంమంత్రిగా బాధ్యతల్నినిర్వహించి చరిత్రకెక్కారు.  

ఉద్యమ నాయకుడిగా..కార్మిక నాయకుడిగా పలు సందర్భాల్లో ఏ పోలీసులతో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారో.. చివరకు అదే పోలీసులకు బిగ్ బాస్ అయి.. అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. తెలంగాణ ప్రజలు.. మరి ముఖ్యంగా హైదరాబాద్ మహానగర ప్రజలు ఒక అసలుసిసలు మాస్ నేతను కోల్పోయినట్లే. నాయిని లాంటి నేత ఇక రారు. రాబోరు.  

Thanks! You've already liked this