ఇథనాల్‌ ధర పెంపు

జూట్‌ ప్యాకేజింగ్‌ నిబంధనల పొడిగింపు
బ కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి జవదేకర్‌

న్యూఢిల్లీ :
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీల ద్వారా ఇథనాల్‌ ప్రొక్యూర్‌మెంట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇథనాల్‌ ధర పెంచింది. ఇథనాల్‌ బ్లెండెడ్‌ పెట్రోల్‌ ప్రోగ్రామ్‌ కింద ఈ నిర్ణయం తీసుకుంది. ఆహార ధాన్యాలను తప్పనిసరిగా జూట్‌ మెటీరియల్‌తోనే ప్యాక్‌ చేయాలన్న నిబంధనల కాలపరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ తీసుకున్న కీలక నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ గురువారం విలేకరులకు తెలిపారు. పెట్రోల్‌లో డోపింగ్‌ కోసమే ఇథనాల్‌ ధరలను 5శాతం నుంచి 8శాతం వరకు పెంచుతున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయంతో రైతులకు సరసమైన ధర లభిస్తుందని, చమురు దిగుమతులు తగ్గుతాయన్నారు. ఇథనాల్‌తో పర్యావరణానికి హాని జరగదని, కాలుష్యాన్ని నియంత్రించవచ్చునని అన్నారు. ఈ నిర్ణయంతో నాలుగు లక్షల జూట్‌ రంగ కార్మికులు, వేలాది మంది రైతులు లాభపడతారని జవదేకర్‌ చెప్పారు. దేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాలలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, ఒడిశా, అసోం, ఆంధ్రప్రదేశ్‌, మేఘాలయ, త్రిపురలలోని రైతులు, వర్కర్లు లాభపడతారన్నారు. పెట్రోల్‌లో 10శాతం వరకు ఇథనాల్‌ డోపింగ్‌కు అనుమతి ఉంది. చమురు మార్కెటింగ్‌ కంపెనీలు (ఓంఎసీల) ఇథనాల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ సీజన్‌ 2020, డిసెంబరు 1 – 2021 నవంబరు 30 వరకు ఉంటుంది.
జాతీయ సహజ ఇంధన విధానం కింద 2022 నాటికి పెట్రోల్‌లో 10శాతం ఇథనాల్‌ డోపింగ్‌, 2030 నాటికి దానిని 20శాతానికి పెంచాలని కేంద్రం భావిస్తోంది. 360 కోట్ల లీటర్లకుపైగా ఇథనాల్‌ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ఆహార ధాన్యాలను నూరు శాతం, చక్కెర 20శాతం ప్యాకేజింగ్‌ గోనుసంచుల్లో జరగాలని నిబంధన పెట్టింది. జనపనార సంచులు (జూట్‌ బ్యాగ్స్‌) ఇంటెండ్లను రివర్స్‌ వేలం పద్ధతిలో జీఈఎం పోర్టర్‌ ద్వారా నిర్వహిస్తారు.
736 డ్యామ్ల భద్రత, పనితీరు మెరుగలకు అంగీకారం
దేశంలోని ఎంపిక చేసిన 736 డ్యామ్ల భద్రతా, పనితీరు మెరుగుదల కోసం డ్యామ్‌ రిహాబిలిటేషన్‌ అండ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ (డీఆర్‌ఐపీ) రెండు, మూడవ దశల పనులకూ కేబినెట్‌ అంగీకారం తెలిపింది. రూ.10,211 కోట్ల ఈ ప్రాజెక్టు 2021 ఏప్రిల్‌లో మొదలై 2031 మార్చి వరకు జరుగుతుంది.
భారత్‌, జపాన్‌ మధ్య ఐసీటీ ఒప్పందం
ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీస్‌ (ఐసీటీ) రంగంలో భారత్‌, జపాన్‌ మధ్య సహకరానికి సంబంధించి అవగాహన ఒప్పందంపై సంకతాలు చేసేందుకు కేంద్ర కేబినెట్‌ అంగీకరించింది. 5జీ నెట్వర్క్‌, టెలికం భద్రతా, సబ్‌మెరైన్‌ కేబుల్‌, కమ్యూనికేషన్‌ పరికరాల ధృవీకరణ, అత్యాధునిక వైర్‌లెస్‌ టెక్నాలజీ వినియోగం, ఐసీటీ సామర్థ్యం పెంపుదల, ప్రజల రక్షణ, విపత్తు నివారణ, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) / బ్లాక్‌చెయిన్‌, స్పెక్రమ్‌ చెయిన్‌, సెక్ట్రమ్‌ నిర్వహణ, బహుపాక్షిక వేదికలపై సహకారమే లక్ష్యంగా ఈ అవగాహన ఒప్పందం కుదిరినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. ఐసీటీ టెక్నాలజీస్‌ ద్వారా దేశంలో ఐసీటీ మౌలికవసతుల మెరుగుదలకు సహకారం లభిస్తుందని, గ్లోబల్‌ స్టాండర్‌డైజేషన్‌లో భారత్‌కు మెరుగైన అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. భవిష్యత్‌లో ముఖ్య క్షేత్రాలకు గ్రామీణ ప్రాంతాల మధ్య అనుసంధానం పెంచేందుకు సబ్‌మెరైన్‌ కేబుల్‌ నెట్వర్క్‌, టెక్నాలజీస్‌ దోహదపడతాయని ప్రకటన వెల్లడించింది.

Thanks! You've already liked this