ఫేస్‌ ‘బుక్‌ చేయాల్సిందే’

సోషల్‌ మీడియా పెద్దన్న ఫేస్‌బుక్‌ దక్షిణ, మధ్య ఆసియా ప్రాంతాల పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌ అంఖిదాస్‌ రాజీనామా ఓ కన్నీటి తుడుపు మాత్రమే. ఆమె పులిమిన కాషాయ రంగును ఫేస్‌బుక్‌ యథాతథంగా కొనసాగించేందుకే సిద్ధంగాఉన్నట్లు స్పష్టమవుతున్నది. భారత్‌లో తన మార్కెట్‌ను కాపాడుకోవడమే లక్ష్యంగా బీజేపీతో లోపాయకారీ లాలూచీని నిలబెట్టుకోవడానికే ఫేస్‌బుక్‌ యాజ మాన్యం మొగ్గుచూపుతున్నట్లు స్పష్టమవుతున్నది. ఆమెతో రాజీనామా చేయించడం పైపూతలద్దే చర్యలాంటిదే. ‘ప్రజాసేవపై ఉన్న ఆసక్తి మేరకు ఆమె తన బాధ్యతల నుంచి వైదొలిగిన’ట్లు ఫేస్‌బుక్‌ భారత్‌ ఎండీ అజిత్‌మోహన్‌ ప్రకటించారు. ఆమె త్వరలో జరగబోయే పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలబరిలో బీజేపీ తరఫున దిగనున్నట్లు ప్రచారమూ సాగుతున్నది. ఆమె స్థానంలో నియమితులైన శివనాథ్‌ తుక్రాల్‌ బీజేపీకి అనుకూలమైన వ్యక్తే. ఆయనలోని నైపుణ్య సామర్థ్యంకన్నా బీజేపీ అనుకూలతే శివనాథ్‌ ఎంపికకు కారణమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘ఫేస్‌బుక్‌కు తొమ్మిదేళ్లుగా పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి కీలకపాత్ర పోషించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలి’ అని సంస్థ పేర్కొనడమే దాని వైఖరిని ప్రతి బింబిస్తోంది. కాబట్టి బీజేపీ, ఫేస్‌బుక్‌ లాలూచీకి ఏ మాత్రం డోకాఉండదని కూడా స్పష్టమవుతోంది. భారత ప్రజాస్వామ్య ప్రక్రియలో ఫేస్‌బుక్‌జోక్యం చేసుకుంటోందనీ, బీజేపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదనీ, వారి విద్వేషపూరిత ప్రసంగాల పోస్టులను ఉద్దేశ పూర్వకంగానే అనుమతిస్తోందని, అందుకు అంఖిదాస్‌ కీలకపాత్ర పోసిస్తున్నట్లు విమర్శలు వచ్చాయి. ఆమెపౖౖె చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ జర్నలిస్టు కేసు పెట్టారు. పార్లమెంటరీ ప్యానెల్‌ ఆమెను ప్రశ్నించిన నేపథ్యంలో ఆమెతో ఫేస్‌బుక్‌ రాజీనామా చేయించింది.
ప్రపంచవ్యాప్తంగా అమెరికా, బ్రిటన్‌లతో సహా చాలాదేశాల్లో ఫేస్‌బుక్‌ నిర్వహణ తీరుపై ఆరోపణలు వచ్చాయి. ఇందుకు ఫేస్‌బుక్‌ బాధ్యతా రాహిత్యమే కారణమనే వ్యాఖ్యలు వినిపించాయి. 2017 డిసెంబరులోనే ‘బ్లూమ్‌బెర్గ్‌’ అనే పత్రిక ఫేస్‌బుక్‌ కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులతో చేతులుకలిపి తప్పుడుప్రచారం చేసే ట్రోల్స్‌తో కలిసి తీవ్రమైన భావజాలాన్నీ, సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నదని పేర్కొంది. ఫేస్‌బుక్‌కు చెందిన కేటీ హార్‌బాత్‌ నేతృత్వంలో ఒక గ్లోబల్‌ ప్రభుత్వమే నడుస్తోందనీ, దాని రాజకీయ బృందం భారత్‌, బ్రెజిల్‌, జర్మనీ, బ్రిటన్‌ తదితర దేశాల్లో కొన్ని రాజకీయ పార్టీలకు సాయపడు తోందనీ, ఫేస్‌బుక్‌ ఉద్యోగులే ఆయా పార్టీలకు ప్రచార కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ‘బ్లూమ్‌బెర్గ్‌’ రాసింది. 2014లో మోడీ గెలిచిన తర్వాత ‘క్వార్ట్జ్‌’ అనే పత్రిక ‘లైక్‌లు ఓట్లను రాబట్టిన వైనం- ఫేస్‌బుక్‌ ద్వారా నరేంద్రమోడీ ప్రచారం’ అనే శీర్షికతో రాసిన వ్యాసంలో అంఖిదాస్‌ను పొగడ్తలతో ముంచెత్తింది. రెండేళ్లకిందటే బ్రిటన్‌ కేంద్రంగా పనిచేసే కేంబ్రిడ్జి అనలిటికా (సీఏ) సంస్థ, భారత్‌లో ఫేస్‌బుక్‌ ఖాతాదార్ల వివరాలను బీజేపీ, జేడీ (యూ) లకు అమ్మినట్లు కథనాలువచ్చాయి. భారత్‌లో బీజేపీ, ఫేస్‌బుక్‌ నడుమ ఉన్న లోపాయకారీ లాలూచీ కాస్తా ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ తాజా కథనంతో బట్టబయ లైంది. బీజేపీ నేతలు పెట్టిన పోస్టింగులు ప్రమాదకరమనీ, విద్వేషపూరిత మనీ, అవి హింసకు దారితీస్తాయని ఫేస్‌బుక్‌ ఉద్యోగులు కొందరు ఎత్తి చూపినా అంఖిదాస్‌ ఎటువంటి చర్యా తీసుకోకుండా కాపాడుతూ వచ్చారని ఆ కథనం వెల్లడించింది. ఏ రకమైన సందేశాలు ప్రమాదకరమైనవి అనే విషయంలో ఫేస్‌బుక్‌ కొన్ని నిబంధనలు రూపొందించింది. ఆ నిబంధనలకు విరుద్ధంగాఅంఖిదాస్‌ వ్యవహరించారు. భారత్‌లో వ్యాపారం దెబ్బతినకుండా ఉండేందుకే ఆమె ఇలా చేసిందని ఆ కథనం వివరించింది. ఇప్పుడే కాదు, మే నెలలో కూడా ఈ తరహా వ్యాసం వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ ప్రచురించింది. బీజేపీకీ, ఆ పార్టీకి చెందిన ‘ట్రోల్‌’ సైన్యానికి వాట్సప్‌ ప్రధాన వేదికగా మారింది. ప్రపంచంలోకెల్లా ఎక్కువ మంది ఫేస్‌బుక్‌ వాడకందార్లు భారత్‌లోనే ఉన్నారు. అంతేకాదు, ఫేస్‌బుక్‌ ఇటీవలే రిలయన్స్‌ జియోలో రూ.40వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టింది. ముస్లిములే కరోనా వైరస్‌ వ్యాప్తికి కారకులనీ, లవ్‌ జిహాద్‌, ఇతర విద్వేష ప్రచారాలను ఫేస్‌బుక్‌లో చేసిన బీజేపీ నాయకులెవరిపైనా ఫేస్‌బుక్‌ చర్య తీసుకోలేదు. ప్రజలందరికీ ఒక సమాచార సాధనంగా ఉపయోగపడే ఫేస్‌బుక్‌ నిర్వహణ బాధ్యతలను అంఖిదాస్‌ వంటి వ్యక్తులకు అప్పజెప్పడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నను వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ లేవనెత్తింది. భారతీయ ముస్లింలు ఒక దిగజారిన సమూహం అన్న ఒక పోస్టును అంఖిదాస్‌ తన సొంత పేజీలో పోస్టు చేసిన వైనాన్ని ఆ పత్రిక ఉదహరించింది. ఆ పోస్టు తనకెంతో తెలియజెప్పిందని అంఖిదాస్‌ కామెంట్‌ కూడా రాశారు. బీజేపీ నేతలు రాజాసింగ్‌, అనంతకుమార్‌ హెగ్డే, కపిల్‌మిశ్రాలు విద్వేషాన్ని రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా, ఫేస్‌బుక్‌ అడ్డుకోకపోగా పచ్చజెండా ఊపింది. దీనంతటికీ కారణం అంఖిదాసే. ‘మనం తలచుకుంటే పచ్చి అబద్ధాన్ని కూడా నిప్పులాంటి నిజంగా నమ్మించగలం, సామాజిక మాధ్యమాలపై మనకంత పట్టు ఉంది’ అని 2018 సెప్టెంబరులో బీజేపీ రాజస్థాన్‌ సామాజిక మాధ్యమ కార్యకర్తల సమావేశంలో చెప్పారు. ఇవన్నీ బీజేపీ, ఫేస్‌బుక్‌ అపవిత్ర బంధానికి నిదర్శనాలే.
విద్వేష పోస్టులను అనుమతిస్తే ఫేస్‌బుక్‌ ఆదాయం పెరుగుతుందని అంఖిదాస్‌ నమ్మకం. పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో రోడ్డుపై బైఠాయించిన వారిని విమర్శించడంతోపాటు, వారిపై భౌతిక దాడులు తప్పవని కపిల్‌ మిశ్రా హెచ్చరించిన పోస్టులు పెట్టిన తర్వాత ఫేస్‌బుక్‌ను వీక్షించిన వారిసంఖ్య పదిరెట్లు పెరిగింది. అంటే ఆ మేరకు ఆదాయం పెరిగింది. మీడియాకున్న సామాజిక బాధ్యత దృష్ట్యా, ప్రజల ప్రయోజనాల కోసం దాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. మీడియా వ్యాపారం ఇతర వ్యాపారాల్లాంటిది కాదు. అది ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ‘మనకి ప్రజాస్వామ్యమైనా ఉంటుంది. లేదా కొద్దిమంది చేతుల్లో సంపద కేంద్రీ కరించే గుత్తసంస్థలైనా ఉంటాయి. కానీ రెండూ ఏకకాలంలో ఉండవు’ అని ‘స్టాండర్డ్‌ ఆయిల్‌’ గుత్త సంస్థ ఆధిపత్యాన్ని సవాల్‌ చేసిన కేసులో అమెరికన్‌ న్యాయమూర్తి బ్రాండీస్‌ వ్యాఖ్యానించారు. గూగుల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, యాపిల్‌ సంస్థల షేర్ల మార్కెట్‌ విలువ నాలుగు లక్షల కోట్ల డాలర్లుపైనే. అంటే రూ.300లక్షల కోట్లు. ఇది జర్మనీ జీడీపీ కన్నా ఎక్కువ. అమెరికా, చైనా, జపాన్‌ దేశాలతర్వాత బలమైన ఆర్థికశక్తిగా ఈ నాలుగు సంస్థ లున్నాయి. అందువల్లే అవి వర్ధమాన దేశాల చట్ట నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి. సమాజ హితానికీ, కంపెనీల సొంత లాభాలకు మధ్య ఏది ముఖ్యమనే ప్రశ్న వస్తే.. నిస్సందేహంగా అవి లాభాల వైపే నిలబడతాయి. ఫేస్‌బుక్‌ ఆదాయంలో 98.5శాతం యాడ్స్‌నుంచే వస్తున్నది. వీక్షకుల సంఖ్య పెరిగితే ఆదాయం పెరుగుతుంది.
ఒక పోస్టు ఎంతగా వైరల్‌ అయితే దానికి అంత మంచిది. కాబట్టి సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టినా, సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసినా, హింసను ప్రజ్వల్లింపచేసినా దానికి వ్యాపార ప్రయోజనాన్నిచ్చే వైరల్‌ అయ్యే పోస్టింగే ముఖ్యం. కాబట్టి ఫేక్‌న్యూస్‌, విద్వేష పోస్టింగ్‌లను ఫేస్‌బుక్‌ ఎక్కువగా ప్రచారం చేస్తున్నది. ఆ తర్వాత గూగుల్‌ యూట్యూబ్‌ వీడియోలు. రిపబ్లిక్‌ టీవీ ఉదంతం మనకు తెలిసిందే. ఫేస్‌బుక్‌ మితవాద శక్తులకు తోడ్పాటునివ్వడం మోడీతోనే మొదలుకాలేదు, ట్రంప్‌, బోల్సనారోకు ఇదే తరహాలో ఉపయోగపడు తున్నది. ఇదంతా తన వ్యాపార ప్రయోజనాల నాశించే చేస్తున్నది. సోషల్‌ మీడియాకు ఇటువంటి విద్వేష, అసభ్య పోస్టింగులే కావాలి. జుకర్‌బర్గ్‌ పైకి ఎన్ని నీతులుచెప్పినా ఆయన అంతర్గతంగా ఇదేకోరికతో రగిలి పోతుంటారు. కాబట్టి నిష్పాక్షికతకూ, ప్రజా స్వామ్య నియతికీ, నిబద్ధతకు ముప్పుతెచ్చే, ఆధిపత్యశక్తుల తరఫున అసత్య భేరీలయ్యే సోషల్‌ మీడియా దుర్మార్గాన్ని ఎండగట్టాలంటే, ఫేస్‌బుక్‌ను చైనా తరహాలో అనుమతించకపోవడమే ఏకైక మార్గం. ఫేస్‌బుక్‌, బీజేపీ మధ్య నెలకొన్న అపవిత్రబంధంతో ఈ కార్పొరేట్‌, బూర్జువా మీడియా అనేది ఎప్పటికీ ప్రజాస్వామిక మీడియా కాబోదనే భయంకరమైన చేదు వాస్తవాన్ని చాటుతున్నది. కాబట్టి ప్రజాస్వామ్య హితైషులందరూ ప్రత్యామ్నాయ మీడియాను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని అనివార్యంగా గుర్తించాలి. అందుకు సహకరించాల్సిన, కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అప్పుడే మీడియాలో గుత్తాధిపత్యాన్ని బద్దలుగొట్టి దాన్ని ప్రజాప్రయోజన సాధనంగా తీర్చిదిద్దుకోగలుగుతాం.

Thanks! You've already liked this