భారత కార్మికోద్యమాలలో మహిళల ధీరోదాత్త పాత్ర

డా|| బివి విజయలక్ష్మి,
జాతీయ కార్యదర్శి, ఎఐటియుసి
భారతదేశ స్వాతంత్ర పోరాటంతో పాటు ఈనాటికీ దేశాభివృద్ధికై జరుగుతున్న అనేక ఉద్యమాలతో మమేకమయిన ఎఐటియుసి ఉజ్వల చరిత్ర గురించి స్మరించుకోవడం ద్వారా ఆ ఉద్యమ మార్గాన్ని మరింత బలోపేతం చేస్తూ ముందు తరాలకు వాటి ఫలాలనందించడానికి మన కృషిని కొనసాగిస్తూనే ఉండాలి. భావితరాలు కూడా ఈ ఉద్యమ స్పూర్తిని అందుకోవడానికి తరతరాలుగా ఈ పునాదుల్ని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్ళాలి.
1920 అక్టోబరు 31 వ తేదీన బొంబాయిలోని ఎంపైర్‌ ధియేటర్‌లో లాలాలజపతిరారు అధ్యక్షతన మొట్టమొదటి మహాసభ ద్వారా ఎఐటి యుసి పురుడుపోసుకుంది. ఆ రోజున ఆమోదించినటువంటి తీర్మానాలలో ఆహార ధాన్యాల ఎగుమతుల మీద ఆంక్షలు విధించాలని, నిరుద్యోగుల రిజిస్ట్రేషన్‌ సక్రమంగా ఉండాలని, డ్యూటీలో ప్రమాదం జరిగినప్పుడు బీమా సౌకర్యం కల్పించాలని, ప్రివిలైజ్‌ సెలవులు, సిక్‌ లీవులు ఇవ్వాలని, కార్మికుల మీద పోలీసుల అమానుష చర్యలు ఆపాలని డిమాండ్‌ చేసింది. మరో ముఖ్యమైన తీర్మానం మహిళా కార్మికులు పనిచేస్తునటువంటి ప్రతి పరిశ్రమలోను వారి శిశువుల సంరక్షణకై సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. కానీ ఈరోజుకుకూడా మనం పనిచేసే ప్రదేశాలలో శిశుసంరక్షణా కేంద్రాలు ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేస్తున్నామంటే.. వంద సంవత్స రాల కాలంలో కూడా పాలనలో మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి పాలకులకు చిత్తశుద్ది లేకపోవడమే…
ఎఐటియుసి అధికారికంగా వంద సంవత్సరాలు పూర్తిచేసుకున్న ప్పటికి అనేక కార్మిక ఉద్యమాలు అంతక్రితం శతాబ్దం నుండే ప్రారంభ మైనాయి. ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం ముందే వచ్చినా భారత దేశంలో మాత్రం చాలా ఆలస్యంగానే వచ్చింది. దానికి ఒక కారణం భారతదేశం వ్యావసాయిక దేశమయితే మరో ప్రధాన కారణం బ్రిటిష్‌ పాలకుల వలస పాలన మూలంగా దేశం నుండి కేవలం ముడిసరుకును ఎగుమతి చేయడానికి ఉపయోగించుకుంటూ మనలను ఉత్పత్తుల కోసం వారి మీద ఆధారపడే విధంగా శాసించడం. మనదేశంలో మొట్టమొదటి పరిశ్రమ 1850లలో ముంబయిలో ప్రత్తి, వస్త్ర పరిశ్రమ. అటుపిమ్మట ముంబయిలోనే అనేక బట్టల మిల్లులు వచ్చాయి. బెంగాల్‌లో జూట్‌ మిల్లులు, కేరళలో కొబ్బరిపీచు మిల్లులు అత్యధిక సంఖ్యలో వచ్చాయి. మెల్లమెల్లగా ఇతర అనేక పరిశ్రమలు ప్రారంభమయ్యాయి.
భారతదేశంలో కార్మికోద్యమాన్ని మూడు దశలుగా పరిగణిస్తారు చరిత్రకారులు. మొదటిదశ 19వ శతాబ్దం మధ్య నుండి మొదటిప్రపంచ యుద్ధం వరకు.. రెండవ దశ అప్పటినుండి దేశ స్వాతంత్య్రం సాధించే వరకు.. అటు తర్వాత కాలాన్ని మూడవ దశగా పరిగణిస్తారు. మొదటి దశలో సంఘటిత కార్మిసంఘంగా లేకపోయినప్పటికి కార్మికుల్లో ఉన్నటు వంటి వర్గదృక్పధంతో సమస్యలపైస్పందిస్తూ పరిష్కారందిశగా పోరాటాలు ప్రారంభించారు. మొట్టమొదటి కార్మిక సంస్థ 1851లో బొంబాయిలోని నూలు బట్టల మిల్లులో ప్రారంభమైతే, 1854లో కలకత్తాలోని జూట్‌ మిల్లులో ప్రారంభమైంది. 1879లోనే కార్మికుల స్థితిగతులను పరిశీలించ డానికి కమిషన్‌ ఏర్పాటు అయ్యింది. 1891లో మొట్టమొదటి భారతీయ పారిశ్రామిక చట్టం సాధించుకోగలిగారు. కానీ అది ఏ మాత్రం ఉపయోగ పడలేదు. 1890లో పదివేల మందితో పెద్ద నిరసన ప్రదర్శన జరిగింది. అందులో ఇతర డిమాండ్లతో పాటు మహిళా కార్మికులు ప్రతిపాదించిన డిమాండ్‌ వారాంతపు సెలవు ఇవ్వాలని. అటు తర్వాత దేశమంతటా ప్రతిమిల్లులోనూ, ప్రతిరంగంలోనూ యూనియన్లు ఏర్పాటయ్యాయి. మహిళా కార్మికులు కూడా పెద్దసంఖ్యలో యూనియన్లలో భాగస్వాము లయ్యారు. పారిశ్రామికీరణ జరిగిన ప్రాంతాలలో మహిళలు ఎక్కవ సంఖ్యలో పనిలో చేరారు. 1913లో బొంబాయిలో 90 నూలు మిల్లుల్లో 1,10,033 కార్మికులలో 20% శాతం పైగా 22,402 మంది మహిళా కార్మికులు ఉండేవారు.
ఈ మిల్లులలోని కార్మికుల పరిస్థితులు చాలా దుర్భరంగా ఉండేవి. ఏ రకమైన చట్టాలు లేకపోవడంతో విపరీతమైన శ్రమదోపిడీ జరిగేది. నిర్దిష్ట మైన పనిగంటలు లేకపోవడం, కనీసం వారాంతపు సెలవులు లేక పోవడం, అతితక్కువ వేతనాలు పొందడం వల్ల ప్రతి ప్రాంతంలో ఆకస్మిక పోరాటాలు, సమ్మెలు ప్రారంభమయ్యాయి. పరిశ్రమలన్నింటిలో పురుషు లతో పాటు స్త్రీలు, వారితో పిల్లలు కూడా పని చేయాల్సిన పరిస్థితులు.. ఈ పోరాటాలన్నింటిలో మహిళలు కూడా పూర్తిస్థాయిలో పాల్గొనేవారు. వారి మీద మిల్లు యజమానుల అత్యాచారాలు అధికంగా ఉండేవి. చాలా బెదిరింపులు చేసేవారు. పనిభద్రత లేదు. అయినా ఏ మాత్రం బెదర కుండా ముందువరుసలో నడిచేవారు.
కేరళలో కొబ్బరిపీచు నుండి తాళ్ళు పేనే పద్దతి 19వ శతాబ్దంలోనే మొదలై అత్యధికంగా విదేశాలకు ఎగుమతి అయ్యేది. మలయాళంలో కాయర్‌ అనే పదానికి అర్థం తాడు. ఇంగ్లీష్‌లో జఉ×= అనే పదం ఆ విధంగా వచ్చిందే. వీటి నుంచి తయారు చేసిన తివాచీలు 1840లలో ఇంగ్లండులో చాలా ప్రసిద్ది. అలాగే యూరపులో కూడా విరివిగా వాడే వారు. దానితో 1860లో ఆరులక్షల రూపాయలున్న ఎగుమతులు 1864-65లో 43.6 లక్షల రూపాయలకు పెరిగింది. 1901 సం||లో అలెప్పిలో వీటిని నేత నేయడానికి పరిశ్రమ స్థాపించి 1100మందిని పని లోకి తీసుకున్నారు. మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభానికి ముందు ఎగు మతులు తారాస్థాయికి చేరుకున్నాయి. కానీ యుద్ధానంతరం పరిస్థితులు మారాయి. పారిశ్రామికవేత్తలకు కార్మికుల కొరత ఏర్పడింది. వారు గ్రామాలకు వెళ్ళి వ్యవసాయదారుల్ని బ్రతిమాలి పారిశ్రామిక కార్మికులుగా తెచ్చుకోవడం ప్రారంభించారు. 1930లలో కేవలం ఒక్క అలెప్పి ప్రాంతం పరిశ్రమలలో 1,33,000 మంది, ముడిసరుకు తయారుచేసే కుటీర పరిశ్రమలలో 32000 మంది ఉన్నారు.
ట్రావెంకోర్‌ లేబర్‌ అసోసియేషన్‌(ఎఐటియుసి) 1922లో ప్రారంభమై అతి త్వరలోనే అత్యంత బలమైన సంస్థగా ఏర్పడింది. అప్పటి చరిత్ర కారులు చెప్పిన మాట…ఈ యూనియన్‌ నాయకులు, కార్మికవర్గం కేవలం ఆర్థికసమస్యల గురించేకాక సుశిక్షితులైన రాజకీయ దురంధరులుగా రూపాంతరంచెందారు. ఒక క్రమశిక్షణ కలిగిన కార్మికవర్గంగా ఉద్యమాలు చేపట్టారు. 1931 నుండి యాజమాన్యాలు వారికివ్వవలసిన జీతాలలో కోతలు ప్రారంభించాయి. ఉద్యోగభద్రత కొరవడింది. కొబ్బరిపీచు పరిశ్రమలో రెండురకాలు. మొదటిది ముడిసరుకు తయారు చేసేది, రెండవది అసంఘటితరంగంలో వస్తువులుగా రూపాంతరం చేసేది. సంఘటిత రంగమున్న పరిశ్రమలో..అసంఘటితరంగంలో దాదాపు 90% పైగా మహిళలే, సంఘటిత రంగంలో 25% పైగా మహిళలు ఉండేవారు. రోజురోజుకు దిగజారుతున్న వేతనాలు, అపరిశుభ్రమైన పని ప్రదేశాలు, విపరీతమైన పనిగంటలు, కార్మికులలో అశాంతిచెలరేగి అనేక ఉద్యమాలు, పోరాటాలు మొదలయినాయి. సంఘటితమైన కార్మికవర్గం పటిష్టమైన యూనియన్‌ నాయకత్వంలో కార్మిక చట్టాల కోసం డిమాండ్‌ చేసింది. చివరికి మొత్తం రాష్ట్రంలో 1938లో సార్వత్రిక సమ్మె పిలుపు వచ్చింది. 21 అక్టోబరు 1938 నాడు సమ్మె ప్రారంభమైంది. ప్రతిరోజు సంఘర్షణే. ప్రతిరోజు పోరాటమే. మహిళలందరూ పెద్దసంఖ్యలో భాగస్వాము లయ్యారు. 24.10.1938 నాడు కార్మికుల మీద మిలటరీ తుపాకులు పేల్చారు. ఆ ఘటనలో అమ్ము, సుభోద అనే ఇద్దరు మహిళా కార్మికులు తూటాలకు బలి అయ్యారు. అయినా మొక్కవోని ధైర్యంతో మహిళలంతా పోరాటం చేస్తూనే ఉన్నారు. వారి బలిదానంతో, దీక్షతో అనేక డిమాండ్లు సాధించుకోగలిగారు. 15 నవంబరు 1938న సమ్మె విరమణ జరిగింది. అటుపిమ్మట 1941లో ప్రతి ప్రరిశ్రమలోనూ మహిళా కమిటీలు వేశారు. దాని ద్వారా వారికి కూడా కార్మికులను సంఘటితపరచడానికి సరైన శిక్షణ అందచేసేవారు.
ఇదే రంగంలో మరొక చారిత్రాత్మకమైన పాత్ర పోషించి జీవితాంతం సమస్యలతో కష్టాలతో పోరాటం చేసిన మహిళ కె.దేవయాని. ఆమెకు 15 సం||ల వయస్సులో 1936లో కేవలం మహిళా కార్మికుల కోసమే కార్యరూపిరి తోజివారి యూనియన్‌ అని అలెప్పీ తాలుకాలో ప్రారంభిం చింది. కానీ అతి త్వరలోనే ప్రధాన స్రవంతిలో కలిసి మహిళా కార్మికులను పెద్దసంఖ్యలో కార్యోన్ముఖులను చేయగలిగింది. తన స్నేహితులు మీనాక్షి, దాక్షాయని, భవానీలతో కలిసి కమ్యూన్‌ జీవితం గడుపుతూ మహిళలకు ముఖ్య కార్యకర్తల శిబిరాలు నిర్వహించేది. కాయిర్‌ వర్కర్స్‌ తమ పని ముగించుకుని ఆ శిబిరాలలో శిక్షణా తరగతులకు హాజరయ్యేవారు. పారిశ్రామిక మహిళలే కాక వ్యవసాయక్షేత్ర మహిళలను కూడా సమస్య లపై చైతన్యవంతుల్ని చేసి కాలర్‌కోడ్‌ వ్యవసాయ క్షేత్రంలో వారితో సమ్మె చేయించి విజయం సాధించారు. అప్పుడు వారి జీతాలలో 6 అణాలు పెరిగింది. మధ్యాహ్నం అరగంట విరామందొరికింది. ఆమెమీద పోలీసుల దాడులు క్రమక్రమంగా పెరగసాగాయి. ఒకరాత్రి పోలీసులనుండి తప్పించుకోవడానికి రాత్రంతా స్మశానంలోనే గడపాల్సి వచ్చింది. ఆమె కూతురు రాధామ్మాల్‌ పేదరికంలో సరైన పోషణ లేక చనిపోయింది. ఈ ఘటన కరివెల్లూరు పోరాటం సమయంలో జరిగింది. అందుకే ఆ పాపని పోరాట మొదటి అమరవీరుడుగా ఉద్యమంకీర్తించింది. తర్వాత దేవయాని పున్నప్రవయలార్‌ పోరాటంలో మహిళలను సమాయిత్తం చేశారు. జీవితంలో అనేకసమస్యలతో పాటు పేదరికంతో కూడా పోరాటం చేసింది. మహిళా కార్మికులంతా దాదాపు నిరక్షరాస్యులవటంతో వారిని తిరువత్తిర (విప్లవకర) గీతాలతో ఉత్తేజితుల్ని చేసేవారు. మహిళలు యూనియన్‌లో పని చేయడానికి మహిళా నాయకులు తమ శాయశక్తులా కృషి చేశారు.
మొట్టమొదటి పారిశ్రామికవాడలలో మరో ముఖ్యమైన పరిశ్రమ బెంగాలులోని జూట్‌పరిశ్రమ. కలకత్తా పట్టణంలోని బారానగర్‌ ప్రాంతంలో అనేక జూట్‌ మిల్లులుండేవి. 1930లలో భర్తతో పాటు పొట్ట కూటి కోసం ఉపాధి వెతుక్కుంటూ కలకత్తాకు చేరిన దుఖ్‌మత్‌దీదీ అనే మహిళ జూట్‌ మిల్లులో పనికి చేరారు. భార్యభర్తలిరువురూ కార్మికులుగా మెషీన్‌ రూమ్‌లో పని చేసేవారు. వారికి కేవలం రోజుకి ఆరు అణాలు కూలీ దొరికేది. ఆమెతో పాటు ఆ మిల్లులో దాదాపు ఆరేడువందల మంది మహిళా కార్మికులు పనిచేసేవారు. దారుణమైన వేతనాలతో ఉపాధి భద్రత లేకుండా దోపిడీకి గురయ్యేవాళ్ళు… ఈ పరిస్థితికి ఆగ్రహించిన దుఖ్‌మత్‌ మహిళా కార్మికులను చైతన్యపరచటం ప్రారంభించారు. మహిళా కార్మికులందరూ ఐక్యమై ఈ అణచివేతకు వ్యతిరేకంగా పోరాడాలని ఆమె బోధించారు. ఈ దోపిడి అణచివేతలకు బలయ్యేకంటే పోరాడి మర ణించడం మేలని వాళ్ళలో చైతన్యం రగిలించారు.

Thanks! You've already liked this