మహిళలకు రక్షణేది..?

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి :
మోడీ ప్రభుత్వ హయాంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని, గోవులకు ఇస్తున్న రక్షణ మహిళలకు ఇవ్వడం లేదని ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవాని ధ్వజమెత్తారు. అత్యాచారాల వ్యతిరేక పోరాట వేదిక ఆధ్వర్యంలో గురువారం విజయవాడ లెనిన్‌ సెంటరులో మహిళలు నిరసన తెలిపారు. దుర్గాభవానిమాట్లాడుతూ బేటీ బచావో నినాదంగానే మిగిలిందని, మహిళల రక్షణకు ఉపయోగపడలేదని ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఓ యువతిపై అత్యాచారం, హత్య జరిగి నెల రోజులైనా, నేరస్తుల్ని ఇంతవరకూ శిక్షించలేదన్నారు. ఈ ఘటనపై అధికారులు, పోలీసులు ప్రభుత్వానికి, నిందితులకు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. ఆరేళ్ల బీజేపీ పాలనలో దళితులు, మహిళలకు రక్షణ కరవైందన్నారు. సీనియర్‌ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ మహిళలపై అత్యాచార ఘటనలు, హత్యలు దేశంలో అత్యధికంగా ఉన్నట్లు జాతీయ సర్వేలు వెల్లడిస్తున్నాయని వివరించారు. మనువాదులు స్త్రీలను విలాస వస్తువుగానే చూస్తున్నారని విమర్శించారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రమాదేవి, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్‌.గంగాభవాని, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బుట్టి రాయప్ప మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టారు. ఈ నిరసనలో నాయకులు పంచదార్ల దుర్గాంబ, పి.రాణి, కె.శ్రీదేవి, నటరాజు, ఎం.అరుణకుమార్‌, డి.సీతారావమ్మ, దుర్గాసి రమణమ్మ, బి.శాంత, చింతాడ పార్వతి, పి.దుర్గ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంతకాల సేకరణ చేపట్టారు.
హత్రాస్‌ దోషులను కఠినంగా శిక్షించాలి
విశాలాంధ్ర- అనంతపురము అర్బన్‌ : హత్రాస్‌ దోషులను కఠినంగా శిక్షించాలని మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఏ.పద్మావతి, ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రిలు డిమాండ్‌ చేశారు. దేశ వ్యాప్తంగా మహిళా సంఘాల నిరసన పిలుపులలో భాగంగా గురువారం ఏపీ మహిళా సమాఖ్య, ఐద్వా ఆధ్వర్యంలో స్థానిక్‌ టవర్‌క్లాక్‌ వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పద్మావతి, సావిత్రిలు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మనీషా అనే యువతిపై ఆత్యాచారం ఘటన నెల రోజులు కావాస్తున్నా ఇంత వరకు నిందితులపై చర్యలు తీసుకోకుండా, కేసును పక్క దారి పట్టిస్తూ దోషులను రక్షించే ప్రయత్నంలో మోడీ,యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వాలు ఉన్నాయని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. తక్షణమే ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి అధిత్యనాథ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా గౌరవ అధ్యక్షురాలు వరలక్ష్మి, జిల్లా నేతలుపార్వతీ ప్రసాద్‌,నాగమణి,ఐద్వా రామాంజినమ్మ తదితరులు పాల్గొన్నారు

Thanks! You've already liked this