రాజీపడం

జనవరిలోగా 16 కొత్త మెడికల్‌ కాలేజీలకు టెండర్లు
నాడు-నేడుపై సమీక్షలో
సీఎం జగన్‌ ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో- అమరావతి :
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులందరూ ఎక్కువగా పేదలుండే అవకాశం ఉన్నందున, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. గురువా రం వైద్య ఆరోగ్య రంగంలో నాడు- నేడుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా సీఎం మాట్లాడుతూ ఆస్పత్రు ల్లో శానిటేషన్‌, పరిశుభ్రత విషయంలో రాజీపడొద్దని, అలాగే అన్నిరకాల సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జనరేటర్లు పనిచేయడం లేదు. ఏసీలు పనిచేయడంలేదు. శుభ్రత లేదనే మాట ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలో 16 మెడికల్‌ కాలేజీలను కొత్తగా తీసుకువస్తున్నాం. భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసి ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. ఆస్పత్రుల నిర్మాణంలో పాటిస్తున్న అత్యుత్తమ విధానాలను పరిశీలన చేసి వాటిని పాటించండి. పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పులివెందులలో కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాలకు నవంబరులోగా, అనకాపల్లి, మదనపల్లి, ఏలూరు, నర్సాపురం, నంద్యాల, మార్కాపురం, బాపట్లలో మెడికల్‌ కాలేజీల నిర్మాణాలకు డిసెంబరులోగా, విజయనగరం, రాజమండ్రి, పెనుకొండ, అమలాపురం, ఆదోని మెడికల్‌ కాలేజీల నిర్మాణాలకు జనవరిలో టెండర్లు నిర్వహిస్తామని తెలిపారు. వీటికోసం 7500 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు అవుతుందని, ఇప్పుడున్న మెడికల్‌ కాలేజీల్లో నాడు – నేడు పనులకు మరో రూ. 5472 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. వీటికి అవసరమైన పరిపాలనాపరమైన అనుమతులను వెంటనే మంజూరు చేయాలి. నిర్మాణ రీతిలో హరిత విధానాలు పాటించడం ద్వారా ఉష్ణోగ్రతలను తగ్గించాలి. ఆరోగ్యశ్రీ రిఫరల్‌ విధానం బాగుండాలి. వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ వచ్చేంతవరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వండి. అక్కడున్న హెల్త్‌ అసిస్టెంట్‌/ఏఎన్‌ఎంల ద్వారా రిఫరల్‌ చేయించాలి. ఎంపానల్‌ అయిన ఆస్పత్రుల జాబితాను గ్రామ, వార్డు, సచివాలయాల్లో ఉంచాలని సీఎం వారికి దిశానిర్దేశం చేశారు. నవంబర్‌ 13 నుంచి ఆరోగ్యశ్రీ కింద 2 వేల వ్యాధులకు మిగిలిన 6 జిల్లాల్లో కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. అవసరం అనుకుంటే అదనంగా వైద్య ప్రక్రియలను కూడా ఈ జాబితాలో చేర్చండి. అంతిమంగా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Thanks! You've already liked this