సర్కారుకు పతనం తప్పదు

రాజధాని అమరావతే : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

మంగళగిరి మండలం కష్ణాయపాలెం రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలించటాన్ని నిరసిస్తూ … బాధిత రైతు కుటుంబాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్‌ గురువారం పరామర్శించారు.
విశాలాంధ్ర-మంగళగిరి : అన్నం పెట్టే రైతన్నకు సంకెళ్ళు వేసి జైలుకు తీసుకెళ్లటంతో జగన్‌ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకష్ణ అన్నారు. మంగళగిరి మండలం కష్ణాయపాలెం రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలించటాన్ని నిరసిస్తూ … బాధిత రైతు కుటుంబాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్‌ గురువారం పరామర్శించారు. అనంతరం రామకష్ణ విలేకరులతో మాట్లాడుతూ జగన్‌ రైతులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని, రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి జైలుకు పంపించాడని జగన్‌కు పతనం మొదలైందని అన్నారు. జగన్‌ తప్పుల మీద తప్పులు చేస్తున్నాడని ఇప్పటి వరకు అనేక మందిపై అక్రమ కేసులు బనాయించి మరో తప్పు చేశారని అన్నారు.
ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఇప్పటికే 2,600 మంది పైన కేసులు పెట్టారని, గతంలో కొంతమందిని ఇరవై రెండు రోజుల పాటు జైలుకి పంపించారని.. అని పదే పదే అదే రీతిలో తప్పుడు కేసులు పెడుతున్నారని నిర్బంధంతో జనం నోళ్లు నొక్కాలని చూస్తున్నారన్నారని రామకృష్ణ విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించటం లేదని, దౌర్జన్యంగా కుట్రపూరితంగా రాజధాని మార్చాలని అనుకుంటున్నారే గాని ప్రజాభిప్రాయాన్ని తీసుకోవటం లేదన్నారు. రైతులు జైలు నుంచి బయటకు వస్తారని న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని అన్నారు. రైతులు బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్‌ రెడ్డి సిగ్గుపడే విధంగా రైతులకు దండలు వేసి ఊరేగిస్తామని అన్నారు. రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన విషయంలో ప్రభుత్వం లెంప కాయలు వేసుకుని క్షమాపణ చెప్పాలని అన్నారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇకనైనా జగన్మోహన్‌ రెడ్డి కళ్ళు తెరిచి రాజధాని అమరావతిని ఇక్కడే ఉంచాలని, రైతులపై పెట్టిన కేసులు ఎత్తి వేయాలని డిమాండు చేశారు. రాజధాని ప్రాంతంలో శాంతి యుతంగా గాంధేయ మార్గంలో నిరసనలు వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం రెచ్చ కొట్టి జైల్లో పెడుతోందని, తాడోపేడో తేల్చుకునే పరిస్థితిని ప్రభుత్వం సృష్టిస్తోందని, అది మంచి పద్ధతి కాదన్నారు. రాజధాని ఇక్కడే ఉంచుతామని ప్రకటనను చేయాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్‌ మాట్లాడుతూ రాజధాని కోసం మూడు వందల రోజులుపైనే రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు పోరాటాలు నిర్వహిస్తున్నారని ఈ పోరాటాలను జగన్‌ ప్రభుత్వం ప్రభుత్వం ఎన్ని పన్నాగాలు పన్నిన ఉద్యమం ఆగదని రాజధాని సాధించేవరకు పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, సహాయ కార్యదర్శి కంచర్ల కాశయ్య, అమరావతి జేఏసీ కన్వీనర్‌ పువ్వాడ సుధాకర్‌, దళిత జేఏసీ కన్వీనర్‌ మార్టిన్‌ లూథర్‌, దళిత మహిళా జేఏసీ కన్వీనర్‌ శిరీష, జేఏసీ నాయకులు శ్రీనివాసరావు, చిలకా బసవయ్య పాల్గొన్నారు.

Thanks! You've already liked this