సీమ ఎత్తిపోతలకు బ్రేక్‌..

పర్యావరణ అనుమతి తప్పనిసరి
ఎన్జీటీ చెన్నై ధర్మాసనం స్పష్టీకరణ

విశాలాంధ్ర బ్యూరో- అమరావతి :
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని ఎన్జీటీ చెన్నై ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేపట్ట వద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రాజెక్టు డీపీఆర్‌ సమర్పించి పర్యావరణ అనుమతులు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. తాగునీరు, సాగునీరు అవసరాలు ఉన్నాయని ..ప్రాజెక్టుపై ముందుకు వెళ్లరాదని కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలంగాణ రాష్ట్రానికి చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గతనెల 3న విచారణ పూర్తి చేసి ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. తీవ్ర దుర్భిక్షం నెలకొన్న రాయలసీమలో కరవు సమస్య పరిష్కారానికి రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టు (రాయలసీమ ఎత్తిపోతల) నిర్మాణానికి ఏపీ సీఎం జీఓ జారీ చేశారు. దీన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ పథకం కింద సంగమేశ్వరం వద్ద ప్రతి రోజూ మూడు టీఎంసీల లిఫ్ట్‌ చేసేందుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచాలని ఏపీ నిర్ణయించింది. దీంతో రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగునీటి సమస్య తీరుతుందనేది ఏపీ వాదన. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని పెంచే ప్రతిపాదనను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. తెలంగాణకు తీరని నష్టం తప్పదని, హైదరాబాద్‌కు తాగునీటి సమస్య తలెత్తుతుందని జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో (ఎన్‌జీటీ) వాదించింది. గాలేరు – నగరి, హంద్రీ – నీవా, తెలుగుగంగ ప్రాజక్టులకు పూర్తిస్థాయిలో నీటిని అందించే ఉద్దేశంతోనే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని, ఇదేమీ కొత్తదికాదని ఏపీ సర్కారు వాదించింది. రాయలసీమ ఎత్తిపోతల పాత ప్రాజెక్టేనని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన వాదనను ఎన్జీటీ తిరస్కరించింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందేనని గురువారం తీర్పు చెప్పింది.

Thanks! You've already liked this