పేషెంట్ పై అత్యాచారం

టీబీ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న యువతి (21)పై లైంగిక దాడికి పాల్పడ్డాడో మృగాడు. పేషెంట్‌ అనే కనికరం కూడా లేకుండా అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆరు రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన ఆమె, మంగళవారం తన తండ్రికి ఈ దురాగతం గురించి వివరించగా, అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు.. టీబీతో బాధపడుతున్న బాధితురాలిని అక్టోబరు 21న గురుగ్రాంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించడంతో, ఆమె ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగైంది. అయితే అదే ఆస్పత్రిలో పని చేస్తున్న వికాస్‌ అనే వ్యక్తి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో మరోసారి బాధితురాలి ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కూతురిని ఆరా తీయగా, జరిగిన దారుణం గురించి చెప్పింది. దీంతో స్థానిక సుశాంత్‌ లోక్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ విషయం గురించి పోలీసు అధికారులు మాట్లాడుతూ.. నిందితుడు వికాస్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఆస్పత్రికి వెళ్లి బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేయాలని భావించామని, అయితే ప్రస్తుతం ఆమె మాట్లాడే పరిస్థితుల్లో లేదని వైద్యులు చెప్పారన్నారు.

ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టామని, బాధితురాలితో స్వయంగా మాట్లాడిన తర్వాతే ఈ కేసుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆధారాల సేకరణకై ఆస్పత్రిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఇదే ఆస్పత్రిలో తమ కూతురిని ఉంచినట్లయితే ఆధారాలు మాయం చేసే ప్రయత్నాలు జరుగుతాయని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించాల్సిందిగా పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

The post పేషెంట్ పై అత్యాచారం appeared first on Telugu Bullet.

Thanks! You've already liked this