పనితీరు తెలిసిపోతుందా?

ఎన్నికలు

ఒడిశా ఉప ఎన్నికలు అన్ని పార్టీలకూ సవాల్ గా మారాయి. కోవిడ్ సమయంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రభుత్వ పనితీరు ఫలితాలను బట్టి ఉంటుందని చెప్పక తప్పదు. ఒడిశాలో రెండు శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తిర్తోల్, బాలేశ్వర్ సదర్ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఇప్పటికే అన్ని పార్టీలూ తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి.

రెండు స్థానాల్లో…..

అధికార బిజూ జనతాదళ్ రెండు స్థానాలను గెలుచుకునే ప్రయత్నంలో ఉంది. రెండు స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంత్రులను ఇన్ ఛార్జులుగా నియమించారు. ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించుకుంటున్నారు. పార్టీ నేతలకు నవీన్ ఎప్పటికప్పుడు సూచనలను అందజేస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన బిజూ జనతాదళ్ ఈ రెండు ఎన్నికల్లోనూ విజయం తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తుంది.

పాగా వేయాలని….

ఇక భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. మొన్నటి వరకూ రెండోస్థానంలో ఉన్న కాంగ్రెస్ ను వెనక్కు నెట్టేసి తాను చేరిపోయింది. ఈ రెండు స్థానాల్లో విజయం సాధించి భవిష్యత్ లో పార్టీ ఎదుగుదలకు బాట వేయాలని బీజేపీ నేతలు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమైన రాష్ట్ర నేతలందరూ ఈ రెండు నియోజకవర్గాల్లోనే మకాం వేశారు. బలమైన ప్రతిపక్షంగా ఉండాలంటే తమ అభ్యర్థినే గెలిపించాలని బీజేపీ కోరుతోంది.

చెమటోడుస్తున్న కాంగ్రెస్…..

కాంగ్రెస్ పార్టీ కూడా ఈరెండు స్థానాల్లో విజయం సాధించేందుకు చెమటోడుస్తుంది. కాంగ్రెస్ కు లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఆదరించలేదు. లోక్ సభ ఎన్నికల్లో ఒక్క స్థానం, శాసనసభ ఎన్నికల్లో తొమ్మిది స్థానాలను మాత్రమే కాంగ్రెస్ దక్కించుకోగలిగింది. ఈ రెండు స్థానాలను గెలిచి తన పరువును కాపాడుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. నియోజకవర్గాల బాధ్యతలను సీనియర్లకు అప్పగించింది. మొత్తం మీద ఒడిశాలో జరుగుతున్న రెండు ఉప ఎన్నికలు మూడు పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారాయి.

The post పనితీరు తెలిసిపోతుందా? appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this