కూతురిని కిరాతకంగా చంపేసిన తండ్రి

ఎదిగొచ్చిన కూతురికి పెళ్లి చేయాల్సి వస్తుందని.. పెళ్లి ఖర్చులు చేయడం ఇష్టం లేక కిరాతకంగా చంపేశాడో కసాయి తండ్రి. తన రెండో భార్య, బావమరిదితో కలిసి ఘాతుకానికి తెగబడ్డాడు. నమ్మకంగా ఇంటికి పిలిచి కన్నకూతురిని దారుణంగా హత్య చేశాడు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనలో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం ముగ్గురికి జీవితఖైదు విధించింది. జిల్లాలోని పెగడపల్లి మండలం మద్దులపెల్లికి చెందిన ప్రేమలతకి గొల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామానికి చెందిన పోత్కూరి సత్యనారాయణ రెడ్డితో 28 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి కూతురు మౌనశ్రీ(22) జన్మించింది.

కొద్దికాలం సాఫీగానే సాగిన కాపురంలో కలహాలు రేగాయి. మౌనశ్రీకి మూడేళ్ల వయసులో విభేదాల కారణంగా భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు. ప్రేమలత కూతురితో కలసి కరీంనగర్‌లో నివాసముంటోంది. విడాకుల అనంతరం సత్యనారాయణ రెడ్డి లతను రెండో వివాహం చేసుకున్నాడు. మౌనశ్రీ అప్పుడప్పుడూ తండ్రి వద్దకు వచ్చి వెళ్తుండేది. విడాకుల సమయంలో కూతురి పెళ్లి తండ్రి చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. గ్రామంలో భూమి విక్రయించడంతో సత్యనారాయణ రెడ్డికి రూ.16 లక్షలు వచ్చాయి. వాటిని కూతురు మౌనశ్రీ పెళ్లికి ఉపయోగించాలని ప్రేమలత బంధువులు కోరారు.

కూతురి పెళ్లికి డబ్బులు ఖర్చు చేయడం ఇష్టం లేని తండ్రి సత్యనారాయణ రెడ్డి దారుణానికి తెగబడ్డాడు. 2015 సెప్టెంబర్ 8న కూతురిని నమ్మకంగా వెనుగుమట్ల రప్పించాడు. రెండో భార్య లత, బావమరిది రాజుతో కలసి కూతురిని కిరాతకంగా చంపేశాడు. పెళ్లి చేయాల్సి వస్తుందని మెడకు ఉరి బిగించి హత్య చేశారు. మౌనశ్రీ తల్లి ప్రేమలత ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. నిందితులు హత్య చేసినట్లు రుజువు కావడంతో కసాయి తండ్రితో పాటు సహకరించిన సవతి తల్లి, ఆమె సోదరుడికి న్యాయమూర్తి జీవితఖైదు, రూ.12 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

The post కూతురిని కిరాతకంగా చంపేసిన తండ్రి appeared first on Telugu Bullet.

Thanks! You've already liked this