సింప‌తీ లేదు.. సెంటిమెంట్ లేదు.. కేసీఆర్ పాప‌మే!!

సింప‌తీ లేదు.. సెంటిమెంట్ లేదు.. కేసీఆర్ పాప‌మే!!

రాజ‌కీయాలు మారిపోతున్నాయి. నానాటికీ.. క‌ర‌డు గ‌ట్టిన వ్యూహాల‌కు, క‌క్ష సాధింపుల‌కు మాత్రమే ప‌రిమితం అవుతున్నాయి. గ‌తానికి భిన్నంగా పార్టీలు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ప్ర‌జాస్వామ్య వాదుల‌కు ఒకింత బాధాక‌రం గానే తోస్తోంది. ఇత‌ర పార్టీల‌కు చోటు పెట్ట‌రాద‌నేది రాజ‌కీయ వ్యూహ‌మే కావొచ్చు. కానీ, దానికి కూడా ఒక ప‌రిమితి.. ఉంటుంది! స‌ద‌రు వ్యూహానికి కూడా కొన్ని హ‌ద్దులు ఉంటాయి. అయితే, ఇప్పుడు ఆ హ‌ద్దులు చెరిగిపోతున్నాయ్‌. సెంటిమెంటుకు, సింప‌తీకి కూడా రాజ‌కీయ నేత‌లు చోటు పెట్ట‌నంత‌గా వ్య‌వ‌హ‌రిస్తు న్నారు.

ప్ర‌జ‌ల నుంచి నేత‌లు, పార్టీల అధినేత‌లు ఏ సింప‌తీని కోరుకుంటున్నారో.. ప్ర‌జ‌ల నుంచి ఏ సెంటిమెంటు ను పోగేసుకోవాల‌ని అనుకుంటున్నారో.. అదే సింప‌తీ, సెంటిమెంట్ల‌ను నేత‌లు, పార్టీలు తుడిచి పెట్టేస్తు న్నాయి. గ‌తంలో(ఓ ఐదేళ్ల‌ కింద‌టి వ‌ర‌కు) ఏదైనా ఒక నియోజ‌క‌వ‌ర్గంలో ఏ పార్టీ త‌ర‌ఫునైనా విజ‌యం సాధిం చిన నాయ‌కుడు.. అనుకోని ప‌రిస్థితిలో మృతి చెందితే.. ఆ కుటుంబంలోని వారికి టికెట్ ఇచ్చే సంప్ర‌దాయం ఉండేది. ఒక‌వేళ వార‌సులు లేక‌పోతే.. పార్టీ నిర్ణ‌యం మేర‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసేవారు. ఇక‌, ఇలాంటి బైపోల్ స‌మ‌యంలో ఇత‌ర పార్టీలు పోటికి వ‌చ్చేవి కావు.

చ‌నిపోయిన అభ్య‌ర్థి కుటుంబం విష‌యంలో కొంత సానుభూతిని వ్య‌క్తీక‌రించి.. పోటీకి దూరంగా ఉంటూ. ఏక‌ప‌క్ష విజ‌యాన్ని అందించేవి. ఇది పార్టీల మ‌ధ్య పోటీని త‌క్కువ చేసి కాదు.. కేవ‌లం చ‌నిపోయిన నాయ‌కుడి ప‌ట్ల ఒక సానుభూతి, సెంటిమెంటు అనే విష‌యాల‌ను దృష్టిలో పెట్టుకుని ఇత‌ర పార్టీలు అభ్య‌ర్థుల‌ను నిల‌ప‌క‌పోవ‌డం అనేది సంప్ర‌దాయంగా వ‌స్తోంది.

అయితే,  సింపతి కార్డును తొలిసారి బ్రేక్ చేసిన నాయ‌కుడు టీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్‌. 2014 ఎన్నిక‌ల్లో పాలేరు నుంచి రాంరెడ్డి వెంక‌ట రెడ్డి కాంగ్రెస్ టికెట్‌పై విజ‌యం సాధించారు. అయితే, 2016లో ఆయ‌న అకాల మ‌ర‌ణం చెందారు.దీంతో అక్క‌డ ఉప ఎన్నిక వ‌చ్చింది. దీంతో స‌ద‌రు కాంగ్రెస్ పార్టీ నేత‌లు వెంక‌ట‌రెడ్డి స‌తీమ‌ణి సుచ‌రితా రెడ్డికి టికెట్ ఇచ్చారు.  దీంతో అప్ప‌టి వ‌ర‌కు ఉన్న సంప్ర‌దాయం మేర‌కు ఇత‌ర పార్టీలు దూరంగా ఉంటాయ‌ని అనుకున్నా.. కేసీఆర్ మాత్రం ఇలాంటి సెంటిమెంట్ ఏమీలేద‌ని ప్ర‌క‌టించారు.

ఈ విష‌యంపై స్వ‌యంగా కేసీఆర్‌తో మాట్లాడేందుకు సుచ‌రితారెడ్డి.. వెళ్తే.. క‌నీసం గుమ్మంలోకి కూడా రానివ్వ‌లేదు. దీంతో అక్క‌డ నుంచి ఆ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా తుమ్మ‌ల విజ‌యం సాధించారు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు సంప్ర‌దాయంగా ఉన్న ఈ సెంటిమెంటు తుడిచి పెట్టుకుపోయింది.

ఇప్పుడు దుబ్బాక విష‌యంలో టీఆర్ ఎస్ నేత‌లు రాగాలు తీస్తున్నారు. ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే టీఆర్ ఎస్ నేత రామ‌లింగారెడ్డి.. మృతి చెందార‌ని.. క‌నీసం ఇత‌ర పార్టీల‌కు సెంటిమెంటు కూడా లేద‌ని.. అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టార‌ని ఆడిపోసుకుంటున్నారు. కానీ, ఈ సెంటిమెంటును తుడిచి పెట్టింది ఎవ‌రు?  కేసీఆర్ కాదా? ఈ సింప‌తీకి గండి కొట్టింది ఎవ‌రు టీఆర్ ఎస్ కాదా? అనే ప్ర‌శ్న‌ల‌కు మాత్రం వారు స‌మాధానం చెప్ప‌లేక పోతున్నారు. కొస‌మెరుపు ఏంటంటే.. ఏపీలో ఈసెంటిమెంటుకు ఇంకా కాలం చెల్ల‌క‌పోవ‌డం!

ఏపీలో ఏం జ‌రిగిందంటే..2014లో నందిగామ నుంచి టీడీపీ నేత తంగిరాల ప్ర‌భాక‌ర్ విజ‌యం సాధించారు. అయితే, ఆయన హ‌ఠాన్మ‌రణం చెందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ నేప‌థ్యంలో అప్ప‌టి ప్ర‌తిప‌క్షం వైసీపీ .. టీడీపీ అభ్య‌ర్థ‌న‌తో ఇక్క‌డ పోటీకి దూరంగా నిలిచింది. దీంతో ప్ర‌భాక‌ర్ కుమార్తె సౌమ్య ఏక‌ప‌క్ష విజ‌యం సాధించారు. కానీ, తెలంగాణ‌లో మాత్రం ఆ త‌ర‌హా ప‌రిస్థితులు క‌నుమ‌రుగ‌వుతుండ‌డం.. నిజంగానే రాజ‌కీయాలంటే.. ఇంత దారుణ‌మా? అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. వెన‌క‌టికి త‌మ్ముడు త‌మ్ముడే.. అన్న‌ట్టుగా ఉంది వ్య‌వ‌హారం అంటున్నారు ప‌రిశీల‌కులు.

Thanks! You've already liked this