చిరాగ్ కు ఆ అవకాశం ఇస్తారా?

చిరాగ్ పాశ్వాన్

త్వరలో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. కేంద్ర మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. కొత్తగా కొందరిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశముంది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ ప్రభుత్వం రావడానికి కారణమైన జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్ర మంత్రివర్గంలో బెర్త్ ఖరారయింది. బీహర్ ఎన్నికల ఫలితాల తర్వాత జేడీయూకు కూడా స్థానం కల్పిస్తారన్న టాక్ విన్పిస్తుంది.

కేంద్ర మంత్రివర్గంలో…..

అయితే ఈ పరిస్థితుల్లో చిరాగ్ పాశ్వాన్ కు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీ విడిగా పోటీ చేసింది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. అయితే చిరాగ్ పాశ్వాన్ తన ప్రచారంలో ఎక్కడా బీజేపీ పై విమర్శలు చేయలేదు సరికదా మోదీని ఆకాశనికి ఎత్తేశారు. చిరాగ్ పాశ్వాన్ టార్గెట్ అంతా నితీష్ కుమార్ పైనే ఉంది.

ప్రత్యర్థులను దెబ్బతీసి…..

బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ పార్టీ కేవలం ఒక్క స్థానంలోనే గెలిచింది. అయితే పరోక్షంగా ఆర్జేడీని దెబ్బకొట్టడంలో చిరాగ్ పాశ్వాన్ సక్సెస్ అయ్యారు. అలాగే జేడీయూను దారుణంగా దెబ్బతీసి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. జేడీయూ కేవలం 43 స్థానాలకే చిరాగ్ పాశ్వాన్ పరిమితం చేశారు. చిరాగ్ పాశ్వాన్ తో ముందుగానే బీజేపీ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు బీజేపీ పోటీ చేసే స్థానాల్లో చిరాగ్ పాశ్వాన్ అభ్యర్థులను దింపలేదు.

తండ్రి పోస్టు ఖాళీ….

దీంతో పాటు రాం విలాస్ పాశ్వాన్ మరణంతో ఎన్డీఏ ప్రభుత్వంలో ఆ పార్టీకి చోటు కల్పించాల్సి ఉంది. ఇప్పటికే ఎన్డీఏ నుంచి అన్ని పార్టీలూ వెళ్లిపోయాయి. కేంద్ర మంత్రివర్గంలో ఎన్డీఏ మిత్రపక్షాలు దాదాపు ఎవరూ లేని సమయంలో చిరాగ్ పాశ్వాన్ కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారంటున్నారు. అందుకే నితీష్ కుమార్ సయితం లోక్ జనశక్తి పార్టీ ఏన్డీఏలో కొనసాగించడంపై నిర్ణయం బీజేపీదేనని ప్రకటించారు. చిరాగ్ పాశ్వాన్ కు కేంద్ర మంత్రివర్గంలో బెర్త్ గ్యారంటీ అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

The post చిరాగ్ కు ఆ అవకాశం ఇస్తారా? appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this