విశాలాంధ్ర సంపాదకులు ముత్యాల ప్రసాద్‌ కన్నుమూత

విశాలాంధ్ర-విజయవాడ : విశాలాంధ్ర సంపాదకులు, సాహితీవేత్త, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల ప్రసాద్‌ (54) మంగళవారం మధ్యాహ్నాం 2.10 గంటలకు విజయవాడలోని ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రిలో తుదిశ్వాసవిడిచారు. ఆయన గత 20 రోజులుగా కరోనాతో చికిత్స పొందుతున్నారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. తండ్రి ముత్యాల రాధాకృష్ణ మూర్తి ఇటీవలే కన్నుమూశారు. 1990లో విశాలాంధ్ర దినపత్రికలో సబ్‌ఎడిటర్‌గా చేరిన ఆయన చీఫ్‌ సబ్‌ఎడిటర్‌గా, సండే ఇన్‌చార్జిగా 2006 వరకు పనిచేశారు. సండే మేగజైన్‌ను తీర్చిదిద్దడంలో ఆయన ఎంతో కృషిచేశారు. సాక్షి దినపత్రికను ప్రారంభించినప్పుడు ఆ పత్రికలో సబ్‌ఎడిటర్‌గా చేరారు. కొద్ది సంవత్సరాలు ఆ పత్రికలో పనిచేసిన తరువాత విశాలాంధ్ర ప్రధాన కార్యాలయం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మారిన తరువాత విజయవాడ కార్యాలయంలో చేరి సండే బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం విశాలాంధ్ర విజయవాడ రెసిడెంట్‌ ఎడిటర్‌గా నియమితులయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం విశాలాంధ్ర ప్రధాన కార్యాలయం విజయవాడకు మారిన తరువాత 2014లో విశాలాంధ్ర సంపాదక బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి తుదిశ్వాస విడిచే వరకు పత్రికాభివృద్ధికి ఆయన నిబద్ధతతో కృషి చేశారు. సంపాదకునిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పత్రికలో అనేక మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు. ‘బతుకు పేజి’ ప్రాచూర్యం పొందేందుకు ఆయన చేసిన కృషి ఎనలేనిది. ప్రసాద్‌ మృతి వార్త తెలిసిన వెంటనే విశాలాంధ్ర కార్యాలయంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అభ్యుదయ రచయతల సంఘం (అరసం) కార్యనిర్వాహక కార్యదర్శిగా ప్రసాద్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఏపీయూడబ్ల్యూజే విజయవాడ కృష్ణా అర్బన్‌ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఐజేయూ జాతీయ సమితి సభ్యునిగా ఉన్నారు. అరసం, విశాలాంధ్ర విజ్ఞాన సమితి సంయుక్తంగా ఇచ్చే అమరజీవి తుమ్మల వెంకటరామయ్య సాహితీ సత్కారాన్ని 2019 డిసెంబరు1న ఆయన అందుకున్నారు.
జీవిత సంగ్రహం
కృష్ణాజిల్లా నూజివీడు తాలుకా ఆగిరిపల్లి మండలం కలటూరు వీరి స్వగ్రామం. 1966లో ముత్యాల రాధాకృష్ణ మూర్తి, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. గన్నవరం కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. విద్యార్థి దశలో కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐలో పనిచేశారు. సీపీఐ అగ్రనాయకులు అమరజీవి దాసరి నాగభూషణరావు ప్రభావంతో విశాలాంధ్రలో చేరారు. పార్టీ రాజకీయ శిక్షణ తరగతుల్లో ఉపాధ్యాయునిగా, మార్క్సిస్టు సిద్దాంత ప్రచారానికి విశేషంగా కృషి చేశారు. డిగ్రీ విద్య మూడేళ్లు విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రస్తుత సంపాదకులు గడ్డం కోటేశ్వరరావు ఇంట్లోవుండి అభ్యసించారు. కోటేశ్వరరావుగారి సతీమణి సుశీల తెలుగు అధ్యాపకురాలు కావడంతో ఆమె సహాయంతో తెలుగు సాహిత్యాన్ని ఎక్కువగా చదువుకున్నారు. చిన్నతనంలో ప్రసాద్‌ చేత ఆమె నానమ్మ భారతం, రామాయణం, భాగవతంతో పాటు ప్రముఖ కథలను చదివించారు.
నేడు సంస్మరణ సభ
విశాలాంధ్ర సంపాదకులు ముత్యాల ప్రసాద్‌ సంస్మరణ సభ ఈ నెల 24వ తేదీ బుధవారం ఉదయం 10.30 గంటలకు విశాలాంధ్ర కార్యాలయం చంద్రంబిల్డింగ్స్‌లో జరుగుతుంది. ఈ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తదితరులు పాల్గొంటారు.

Thanks! You've already liked this