రాగల 12 గంటల్లో తీవ్ర తుపాను

రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా ‘నివార్’‌ మారనుందని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 370 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ నెల 25న సాయంత్రం తమిళనాడులోని మమాళ్లపురం-కరైకల్ మధ్య, పుదుచ్చేరి దగ్గరలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీరం దాటే సమయంలో దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 65-85 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

తుపాను ప్రభావంతో రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు. ముందస్తుగా సహాయక చర్యల కోసం నెల్లూరు జిల్లాకు 2 ఎస్డీఆర్ఎఫ్, 1 ఎన్డీఆర్ఎఫ్.. చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు విపత్తుల శాఖ తెలిపింది.

ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను, ప్రభుత్వ శాఖలను విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు అప్రమత్తం చేస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. రైతాంగం వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. తీర,లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

The post రాగల 12 గంటల్లో తీవ్ర తుపాను appeared first on Telugu Bullet.

Thanks! You've already liked this