అహ్మద్‌ పటేల్‌ అంత్యక్రియలు పూర్తి

భరూచ్‌ : గుర్‌గావ్‌లో బుధవారం కన్నుమూసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, వ్యూహ కర్త అహ్మద్‌ పటేల్‌ భౌతికకాయానికి గురువారం
గుజరాత్‌ రాష్ట్రం భరూచ్‌ జిల్లాలోని ఆయన స్వగ్రామం పిరమన్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సహా వందలాది మంది కాంగ్రెస్‌ అభిమానులు, నాయకులు పటేల్‌ కడసారి వీడ్కోలు పలికారు. పటేల్‌ భౌతికకాయం బుధవారం రాత్రి గుర్‌గావ్‌ నుంచి వడోదర విమానాశ్రయానికి చేరుకుంది. అనంతరం భరూచ్‌ జిల్లాలోని అంకలేశ్వర్‌ పట్టణంలోని సర్దార్‌ పటేల్‌ ఆస్పత్రిలో భౌతికకాయాన్ని ఉంచారు. అక్కడినుంచి గురువారం సొంత గ్రామం పిరమన్‌కు చేర్చి స్థానిక ముస్లిం శ్మశానవాటికలో ఖననం చేశారు. రాహుల్‌ గాంధీ గురువారం ఉదయం సూరత్‌ విమానాశ్రయంలో దిగిన తర్వాత రోడ్డు మార్గంలో పిరమన్‌కు చేరుకున్నారు. అహ్మద్‌ కుటుంబ సభ్యులను వారి పూర్వీకుల ఇంటిలో కలిసి పరామర్శించారు. రాహుల్‌తో పాటు పటేల్‌కు నివాళులర్పించడానికి వందలాది మంది స్థానికులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు హాజరయ్యారు.
తన రాజకీయ కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన అహ్మద్‌ పటేల్‌కు నివాళులు అర్పించడానికి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేకంగా పూలు పంపారు. తుది ‘నమాజ్‌’ పఠనం తర్వాత పటేల్‌కు అంత్యక్రియలు జరిగాయి. పటేల్‌ కోరిక మేరకు అతని తల్లిదండ్రుల సమాధుల పక్కనే ఖననం చేశారు. అంత్యక్రియలకు హాజరైన వారిలో గుజరాత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమిత్‌ చావ్డా, గుజరాత్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ రాజీవ్‌ సతవ్‌, లోక్‌సభలో కాంగ్రెస్‌ నాయకుడు అధికర్‌ రంజన్‌ చౌదరి, మాజీ ముఖ్యమంత్రులు కమల్‌ నాథ్‌, శంకర్‌సింగ్‌ వాఘేలా ఉన్నారు. కరోనా సోకిన నేపథ్యంలో అహ్మద్‌ పటేల్‌ (71) గురుగావ్‌ ఆసుపత్రిలో బుధవారం మరణించారు.

Thanks! You've already liked this