కార్పొరేట్లను బ్యాంకింగ్‌లోకి అనుమతిస్తే.. ఆర్థిక అస్థిరత ఖాయం

న్యూఢిల్లీ : కార్పొరేట్‌ సంస్థలను బ్యాంకుల ఏర్పాటుకు అనుమతించాలన్న ఆర్‌బిఐ వర్కింగ్‌ గ్రూప్‌ ప్రతిపాదన ‘చెడు దిశలో’ మంచిగా కనిపించే ప్రతిపాదన అని ప్రపంచ బ్యాంకు మాజీ ముఖ్య ఆర్థికవేత్త కౌశిక్‌ బసు గురువారం అన్నారు. ఇది క్రోనీ క్యాపిటలిజం (ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం), చివరికి ఆర్థిక అస్థిరతకు దారితీస్తుందని హెచ్చరించారు. విజయవంతమైన ఆర్థిక వ్యవస్థలు ఉండటానికి ముఖ్యకారణం.. ఒక పక్క పరిశ్రమలు, కార్పొరేషన్లు మరోపక్క బ్యాంకులు – రుణసంస్థల మధ్య ఉన్న స్పష్టమైన విభజనరేఖనే అని ఆయన స్పష్టం చేశారు. ”బ్యాంకులను భారతీయ కార్పొరేట్‌ సంస్థలు సొంతం చేసుకునేందుకు, నిర్వహించేందుకు ఆర్బీఐ ఇటీవల ఏర్పాటు చేసిన ఇంటర్నల్‌ వర్కింగ్‌ గ్రూప్‌ నుంచి వచ్చిన ప్రతిపాదన చెడ్డ దిశలో మంచి దశ” అని ఆయన అభివర్ణించారు. బసు యుపిఎ ప్రభుత్వ హయాంలో కాలంలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. ఆర్బీఐ ప్రతిపాదన.. మొదటి చూపులో మంచిగా కనబడుతుంది.. ఎందుకంటే పారిశ్రామిక సంస్థలు రుణాలు తీసుకోవాలనుకుంటున్నాయి.. బ్యాంకులు కూడా రుణ కార్యకలాపాలను వేగవంతం చేయాలనుకుంటున్నాయి.. ఈ పరిణామం బ్యాంకింగ్‌ రంగం మరింత సమర్థవంతంగా కనిపించేలా చేస్తుంది. కానీ అలాంటి అనుసంధాన రుణాలు దాదాపుగా క్రోనీ క్యాపిటలిజం వైపు ఒక అడుగు వేసినట్లే. ఇక్కడ కొన్ని బడా సంస్థలు దేశంలో వ్యాపార ప్రదేశాన్ని పూర్తిగా ఆక్రమించి.. చిన్న వ్యాపారులను పక్కకు నెట్టివేస్తాయి.. అలాగే అనుసంధాన రుణాలు చివరికి ఆర్థిక అస్థిరతకు దారితీసేలా చేస్తాయని ఆయన హెచ్చరించారు. ”1997 లో ఆసియాలో నిరర్థక రుణాలు ఉత్పన్నం కావడానికి అనుసంధాన రుణాలే అతిపెద్ద కారణమనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి.. దీని ఫలితంగా తూర్పు ఆసియా సంక్షోభం థారులాండ్‌లో ప్రారంభమైంది అనంతరం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక పతనాలలో ఒకటిగా మారింది.” బసు తెలిపారు. పారిశ్రామిక సంస్థలచే నియంత్రించబడని కొన్ని నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలకు (ఎన్‌బిఎఫ్‌సి) బ్యాంకుల్లో ప్రవేశానికి మార్గాలు సష్టించడం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంద బసు అన్నారు. పారిశ్రామిక సంస్థలు బ్యాంకులను సొంతం చేసుకుని, నిర్వహించడానికి అనుమతించేలా చట్టంలో మార్పు చేయడం పూర్తిగా తప్పుడు చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌, మాజీ డిప్యూటీ గవర్నర్‌ వైరల్‌ ఆచార్య కూడా కార్పొరేట్‌ సంస్థలను బ్యాంకులు ఏర్పాటు చేయడానికి అనుమతించాలన్న ఆర్‌బిఐ వర్కింగ్‌ గ్రూప్‌ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు.

Thanks! You've already liked this