తుఫాను ప్రభావం..రాష్ట్రంలో వర్షాలు
నివర్ తుపాన్ తీరం దాటడంతో పలు జిల్లాలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో వర్షాలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి. దీంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లాలో వర్షంతో పాటు చలి గాలుల వల్ల జనజీవనం స్తంభించింది. చిత్తూరు జిల్లాలో తిరుపతిలో తుఫాను ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి. రహదారులు జలమయమయ్యాయి. తిరుమలలో మెదటి ఘాట్ రోడ్డులో 56వ మలుపు వద్ద భారీ వక్షం కూలిపోయింది. దీంతో టీటీడీ సిబ్బంది ట్రాఫిక్ అంతరాయం తొలగిస్తున్నారు.వైఎస్సార్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాల్లో గత 12 గంటలుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నెల్లూరుజిల్లాలో జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు నగరంలో తెల్లవారుజామున నుండే కరెంట్ బంద్ అయింది. కర్నూలు జిల్లాలో బనగానపల్లె, కోవెలకుంట్ల,అవుకు, సంజామాల, కొలిమిగుండ్ల మండలాల్లో ఉదయం నుంచి తేలికపాటి వర్షం కురుస్తోంది. ప్రకాశం జిల్లాలో నివర్ర్ తుఫాన్ ప్రభావంతో కందుకూరు,గుడ్లూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం, ఉలవపాడు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భారీ వర్షాలతో రాళ్లపాడు రిజర్వాయర్‌కు ఇన్ ప్లో పెరుగుతోంది. రాళ్లపాడు రిజర్వాయర్ ప్రస్తుత నీటి మట్టం 17.8 అడుగులు కొనసాగుతోంది. అనంతపురం జిల్లాలోని కదిరిలో భారీ వర్షం కురుస్తోంది. పలు రోడ్లు జలమయం అయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో తుఫాన్ ప్రభావంతో రాత్రి నుంచి తీవ్ర చలి గాలులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.