బ్యాంకుల ప్రైవేటీకరణ వద్దు

ముంబై : కేంద్ర ట్రేడ్‌ యూనియన్ల దేశవ్యాప్త సమ్మెకు పలు ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ బ్యాంకుల ఉద్యోగులు మద్దతు పలకడంతో బ్యాంకింగ్‌ సేవలు స్తంభించాయి. నాలుగు లక్షల మందికిపైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఆలిండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏఐబీఈఏ), నేషనల్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ (ఎన్‌సీబీఈ), బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఈఎఫ్‌)లు ట్రేడ్‌ యూనియన్ల సమ్మెకు మద్దతుగా ప్రదర్శనలు నిర్వహించాయి. దీంతో డిజిటల్‌/మొబైల్‌ బ్యాంకింగ్‌ మాధ్యమాల ద్వారా సేవలను పొందాలని తమ కస్టమర్లకు బ్యాంకులు సూచించాయి. ఆలిండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ (ఏఐబీఓసీ) సుహృద్భావంతో సమ్మెకు మద్దతిచ్చింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ మినహా అన్ని బ్యాంకులకు ఏఐబీఈఏ ప్రాతినిధ్యం వహిస్తోంది. వేర్వేరు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల బ్యాంకులతో పాటు పలు విదేశీ బ్యాంకుల్లో నాలుగు లక్షల మందికిపైగా సభ్యులను కలిగివుంది. వీరంతా సమ్మెకు మద్దతిచ్చారు. మహారాష్ట్రలోనే ప్రభుత్వ రంగ బ్యాంకులు, పాత తరం ప్రైవేటు రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, విదేశీ బ్యాంకులకు చెందిన 10వేల శాఖల్లో పనిచేసే 30వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటాచలం ఓ ప్రకటనలో తెలిపారు. బ్యాంకుల ప్రైవేటీకరణ, అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగ విధానాలకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రంగంలో సరిపడ సిబ్బంది నియామకాలతో పాటు కార్పొరేట్‌ రుణ ఎగవేతదారులపై కఠిన చర్యలను వారు డిమాండు చేసినట్లు తెలిపారు. నూతన కార్మిక చట్టాల కారణంగా దాదాపు 75శాతం మంది వర్కర్లపై తీవ్ర ప్రభావం పడుతోందని, వారికి న్యాయరక్షణ కూడా లేదని వెంకటాచలం పేర్కొన్నారు.

Thanks! You've already liked this