రాజ్యాంగ నిర్మాతలకు కృతజ్ఞులం : మోడీ

న్యూఢిల్లీ : రాజ్యాంగ నిర్మాతలు కలలుకన్న భారతదేశ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామంటూ ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. ఆ కల నిజం కావడమే రాజ్యాంగ రూపకర్తలకు నిజమైన నివాళి అని అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని దాని నిర్మాతలకు ఘనంగా నివాళులర్పించారు. అమూల్యమైన రాజ్యాంగాన్ని అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. 2015 నుంచి ప్రతిఏటా నవంబరు 26న రాజ్యాంగ దినోత్సవాన్ని పాటిస్తున్నామని, రాజ్యాంగ దినోత్సవం నేపథ్య కార్యక్రమాల్లో భారతీయులంతా ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు. రాజ్యాంగ రూపకల్పన సమయంలో వారు ఆకాంక్షించిన భారతదేశ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ధాటించే రోజు ఇది అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. 2010లో రాజ్యాంగానికి 60ఏళ్లు పూర్తైన సందర్భంగా గుజరాత్‌లోని సురేంద్రనగర్‌లో సంవిధాన్‌ గౌరవ్‌ యాత్రను చేపట్టి రాజ్యాంగ ప్రతికృతిని ఏనుగుపై ఊరేగించినట్లు మోడీ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. అంతకుముందు అఖిలభారత ప్రిసైడింగ్‌ అధికారుల సదస్సులో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్న మోడీ.. రాజ్యాంగానికి ప్రజాదరణ మరింత పెరిగేలా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

Thanks! You've already liked this