రాష్ట్రాలన్నీ షట్‌డౌన్‌

ట్రేడ్‌ యూనియన్ల దేశవ్యాప్త సమ్మె విజయవంతం
స్తంభించిన ప్రజారవాణా
రోడెక్కని ఆటోలు, ట్యాక్సీలు – డిపోలకే పరిమితమైన బస్సులు
మద్దతిచ్చిన ప్రభుత్వ, ప్రజా సంఘాలు
పోస్టల్‌, రక్షణ, రైల్వే, విద్యుత్‌ ఉద్యోగుల సంఘీభావం
ప్రదర్శనల్లో పాల్గొన్న 25కోట్ల మందికిపైనే..

న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వ కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలపై కార్మికలోకం గర్జించింది. నూతన కార్మిక, వ్యవసాయ చట్టాల రద్దునకు ఐక్యంగా గళమెత్తి ప్రజా సమస్యల పరిష్కారాన్ని డిమాండు చేసింది. పది ట్రేడ్‌ యూనియన్లు సంయుక్తంగా ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె పిలుపుతో గురువారం 25 కోట్ల మందికిపైగా వర్కర్లు కదం తొక్కారు. కేరళ, పుదుచ్చేరి, ఒడిశా, అసోం, తెలంగాణ, తమిళనాడు, పంజాబ్‌, హర్యానా, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో సమ్మె పూర్తిస్థాయిలో విజయవంతమైంది. పలు స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు ట్రేడ్‌ యూనియన్లకు మద్దతునిచ్చాయి. సమ్మె కారణంగా పలు రాష్ట్రాలు పూర్తిగా షట్‌డౌన్‌ కాగా అక్కడక్కడ పాక్షిక ప్రభావం కనిపించింది. తమిళనాడులోని 13 జిల్లాలు స్తంభించగా మిగతా జిల్లాల్లో పారిశ్రామిక సమ్మె కొనసాగింది. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో ప్రజా రవాణా నిలిచిపోయింది. బస్సులు డిపోలకే పరిమితయ్యాయి. జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలతో పాటు బాల్కోలో సమ్మె విజయవంతమైంది. పశ్చిమ బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాల్లోనూ సమ్మె ప్రభావం కనిపించింది. పశ్చిమ బెంగాల్‌లో చదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నట్లు సమాచారం.
ఇండియన్‌ నేషనల్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఐఎన్‌టీయూసీ), ఆలిండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఏఐటీయూసీ), హింద్‌ మజ్దూర్‌ సభ (హెచ్‌ఎంఎస్‌), సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (సీఐటీయూ), ఆలిండియా యునైటెడ్‌ ట్రేడ్‌ యూనియన్‌ సెంటర్‌ (ఏఐయూటీయూసీ), ట్రేడ్‌ యూనియన్‌ కో ఆర్డినేషన్‌ సెంటర్‌ (టీయూసీసీ), సెల్ఫ్‌-ఎంప్లాయీడ్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఈడబ్ల్యూఏ)లు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆలిండియా సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (ఏఐసీసీటీయూ), లేబర్‌ ప్రోగ్రెసివ్‌ ఫెడరేషన్‌ (ఎన్‌పీఎఫ్‌), యునైటెడ్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (యూటీయూసీ) మద్దతిచ్చాయి. బీజేపీ అనుబంధ భారతీయ మజ్దూర్‌ సంఫ్‌ు (బీఎంఎస్‌) సమ్మెలో పాల్గొనలేదు.
దేశవ్యాప్త సమ్మెలో 25 కోట్ల మందికిపైగా వర్కర్లు పాల్గొన్నారని హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి హర్భజన్‌ సింగ్‌ సిద్ధు తెలిపారు. బొగ్గు గని కార్మికులతో పాటు, రక్షణ, రైల్వే తదితర ప్రభుత్వ రంగాల కార్మికులు సమ్మెకు మద్దతిచ్చారని చెప్పారు. స్కీమ్‌ వర్కర్లు, విద్యుత్‌ ఉద్యోగులు, గృహకార్మికులు, నిర్మాణ రంగ కార్మికులు, బీడీ కార్మికులు, హాకర్లు, చిరు వ్యాపారులు, వ్యవసాయ రంగ కార్మికులు, గ్రామీణ, పట్టణ స్వీయ ఉపాధి వర్గాలు సైతం సమ్మెలో పాల్గొని భారీ ఎత్తున ప్రదర్శనలు నిర్వహించినట్లు ట్రేడ్‌ యూనియన్ల సంయుక్త ప్రకటన వెల్లడించింది. చాలా చోట్ల ఆటో, ట్యాక్సి డ్రైవర్లు స్వచ్చంధంగా సమ్మెకు మద్దతిస్తూ వాహనాలను నడపలేదని పేర్కొంది. సమ్మెకు మద్దతుగా తమ పనిప్రదేశాల్లోనే ప్రదర్శనలను రైల్వే, రక్షణ ఉద్యోగులు నిర్వహించినట్లు తెలిపింది. బ్యాంకులు, బీమా కంపెనీలు, ఫైనాన్స్‌ ఇనిస్టిట్యూషన్లలో పని స్తంభించినట్లు వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను శాఖ, పీఎస్‌యూ వర్కర్లు సమ్మెకు పూర్తి మద్దతివ్వగా బొగ్గు, రాగి, పోస్టల్‌, టెలికం, స్టీల్‌, గ్రామీణ డాక్‌ సేవక్‌లు 100శాతం సమ్మెను విజయవంతం చేసినట్లు ట్రేడ్‌ యూనియన్ల ప్రకటన పేర్కొంది. చాలా చోట్ల చమురు రంగ యూనియన్లు సమ్మెలో పాల్గొన్నాయి. జనవరి 8న జరిగిన సమ్మెకంటే కూడా ఈ సమ్మె విజయవంతమైనట్లు ట్రేడ్‌ యూనియన్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.

Thanks! You've already liked this