రైతులకు అడుగడుగునా అడ్డంకులు

బాష్పవాయువు, వాటర్‌ కెనాన్లతో అడ్డుకట్ట
బారికేడ్లను నదిలో పడవేసిన ఆందోళనకారులు
శంభు సరిహద్దు వద్ద ఉద్రిక్తత

అంబాలా / న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌, హర్యానా రైతుల ‘చలో ఢిల్లీ’కి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. పోలీసులు భారీ బ్యారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ రైతు దండు ముందుకు కదలుతోంది. వారిని నిలువరించేందుకుగాను పోలీసులు వాటర్‌ కెనాన్లు, బాష్పవాయువును ప్రయోగించడం వల్ల ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు ఆ ప్రాంతాలను మోహరించగా రైతులు వెనక్కుతగ్గకుండా ముందుకు దూసుకెళుతున్నారు. పంజాబ్‌, హర్యానా అంతర్రాష్ట్ర ‘శంభు’ సరిహద్దు వద్ద పోలీసులు అధికారులు లౌడ్‌ స్పీకర్ల ఏర్పాటు చేసి పంజాబ్‌ నుంచి వచ్చిన వారంతా వెనక్కి వెళ్లాలని హెచ్చరించారు. పలువురు రైతులు అక్కడున్న బారికేడ్లను దాటుకొచ్చారు. పోలీసులు వారిని అడ్డుకోగా ఆగ్రహించిన రైతులు బారికేడ్లను పక్కనే ఉన్న ఘాగ్గర్‌ నదిలోకి పడవేశారు. మరికొందరు నిరసనకారులు నల్లజెండాలు ఊపుతూ వ్యతిరేకతను వ్యక్తంచేశారు. దీంతో శంభ అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద హైటెన్షన్‌ నెలకొంది. బహుళస్థాయి బ్యారికేడింగ్‌ను ఏర్పాటు చేసి రైతులు ఢిల్లీ చేరుకోకుండా హర్యానా పోలీసులు అడ్డుకుంటున్నారని, శాంతియుత నిరసనను హింసాత్మకం చేసేలా ప్రవర్తిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. నిరసన తెలిపే ప్రజాస్వామిక హక్కును హరిస్తున్నారన్నారు. పంజాబ్‌తో పంచుకునే సరిహద్దులను హర్యానా పూర్తిగా మూసివేసింది. రైతులను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు భద్రతా దళాలను మోహరించింది. రైతుల నిరసన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు సరిహద్దుల వద్ద పారామిలిటరీ దళాలను మోహరించారు. కరోనా కారణంగా ఢిల్లీలో సమావేశాలకు అనుమతి లేదని, ఢిల్లీ మార్చ్‌ను మానుకోవాలని రైతులకు బుధవారం సూచించారు.
ఇది ముమ్మాటికి తప్పే : కేజ్రీవాల్‌
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుత ప్రదర్శనలు నిర్వహిస్తున్న రైతులపై వాటర్‌ కెనాన్లు ప్రయోగించడం ముమ్మూటికి తప్పేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. నిరసనలు తెలిపే రాజ్యాంగబద్ధ హక్కును కాదనలేరని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ మూడు వ్యవసాయ చట్టాలు రైతుకు వ్యతిరేకమైనవే, వాటిని ఉపసంహరించుకోవాల్సింది పోయి శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న రైతులపై వాటర్‌ కెనాన్లు ప్రయోగించడం ముమ్మూటికి తప్పు. శాంతియుత నిరసనలు తెలిపే హక్కును రాజ్యాంగం కల్పిస్తుంది’ అంటూ ఆయన హిందీలో ట్వీట్‌ చేశారు.

Thanks! You've already liked this