వరి జల సమాధి

పుదుచ్చేరీ విలవిల
కోలుకున్న తమిళనాడు
ఇప్పటికే 26 విమానాలు రద్దు
వంతెనలపై వాహనాల పార్కింగ్‌

చెన్నై :
నివర్‌ తుపాను ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్‌ అతాకుతలమైంది. విశాఖ, ఉభయ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, రాయల సీమలోని చిత్తూరు, కడప జిల్లాల్లో నివర్‌ తీవ్ర ప్రభావం చూపింది. తుపానుతో చిత్తూరు, కడపలో జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. కోస్తాంధ్రలో ఏడు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. చేతికి వచ్చిన వరిపంట నీళ్లపాలైంది. ఇప్పుడిప్పుడే వరి కోతలు ప్రారంభం కాగా.. కొన్ని ప్రాం తాల్లో నూర్పిళ్లు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో రెండు రోజులు వర్షాలు పడటంతో నెల్లూరు, ప్రకాశం, గుంటూ రు, కృష్ణా, ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. గురువారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. మత్స్యకా రులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరా దని ఐఎండీ హెచ్చరించింది. మచిలీ పట్నం, కష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మూడవ ప్రమాద హెచ్చరిక, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులో రెండో ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. సహాయ చర్యల కోసం ఆర్మీ, ఎన్‌డీఆర్‌ ఎఫ్‌, కోస్ట్‌గార్డ్‌, గజ ఈతగాళ్లు, అగ్నిమాపక శకటాలు, రబ్బర్‌ బోట్లు, వక్షాల తొలగింపునకు యంత్రాలు, వరద నీటిని తోడేందుకు జనరేటర్లు సిద్ధంగా ఉంచారు. తమిళనాడుపై నివర్‌ తుపాను తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతానికి ఈ రాష్ట్రం తేరుకుంటోంది. వర్షం తగ్గి సాధారణ కార్యకలాపాలు మెల్లమెల్లగా ప్రారంభం కావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నివర్‌ కారణంగా రాష్ట్రంలో చెరువులు, జలాశయాలు పొంగిపొర్లు తున్నాయి. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, నాగపట్నం, తంజావూరు, తిరువరూరు, కరైకల్‌, పుదుచ్చేరి, కడలూరు, విల్లుపురం జిల్లాల్లోని హార్బర్లలో ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి పరిస్థితిని సమీక్షించారు. చెన్నై దాహార్తిని తీర్చే పూండి, పుళల్‌, చోళవరం జలాశయాల్లో నీటిమట్టం పెరిగింది. చెంగల్పట్టు జిల్లాలో 235 చెరువులు పూర్తిగా నిండాయి. చెన్నై మీనంబాక్కం విమానాశ్రయంలో 26 విమాన సర్వీసులను రద్దు చేశారు.భద్రతా కారణాల దష్ట్యా ఏటీఆర్‌ చిన్న విమానం, చెన్నై విమానాశ్రయంలోని టుటికోరిన్‌, ట్రిచీతోపాటు సేలంకు 12 విమానాలను రద్దు చేశారు. మామల్లపురం చుట్టుపక్కల తీరప్రాంత ప్రజలు, ఫిషింగ్‌ ప్రాంత ప్రజల భద్రత కోసం అధికారులు ఎత్తైన మైదానాలు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు ఉపయోగించే పడవలు, ఫిషింగ్‌ నెట్స్‌ యంత్రాలను 30 మీటర్ల దూరంలో సురక్షితంగా ఉంచారు. తిరుపోరూర్లోని, తిరుక్కలుక్కున్‌ పరిసరాల్లోని ఉన్న 23 సరస్సులు, 23 చెరువులు పొంగి పొర్లుతున్నాయి. కోయంబత్తూరులో సముద్రంలో ఐదు అడుగుల ఎత్తులో అలలు ఎగసి పడుతున్నాయి. ఇదిలావుండగా, తమిళనాడులోని మడిపక్కం నివాసితులు తమ వాహనాలను వెలాచేరి సమీపంలోని మాస్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ రైల్వేస్టేషన్‌కు ఎదురుగా ఉన్న వంతెనపై నిలిపారు. యజమానులు తమ కార్లను ఒకదాని తరువాత ఒకటి పార్కింగ్‌ చేశారు. దీంతో వంతెన ఓవర్‌పాస్‌ ఇరువైపులా కార్లతో నిండిపోయింది. ఇది మునుపెన్నడూ చూడని దశ్యమని స్థానికులు చెబుతున్నారు. 2015లో వచ్చిన వరదలకు మడిపక్కం, కొట్టూర్పురం ప్రాంతాల్లోని అనేక కార్లు మునిగిపోయి చాలా వరకు దెబ్బతిన్నాయి. మరలా అలాంటి దృశ్యం ఆవిషృతం కాకుండా తమిళ ప్రజలు అప్రమత్తమై తమ వాహనాలను జాగ్రత్తగా పార్క్‌ చేసుకున్నారు.
కేంద్రం సమీక్ష
తుపాను నేపథ్యంలో తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామితో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సంప్రదింపులు జరిపారు. ఈ రెండు రాష్ట్రాల్లోని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని చెప్పా రు. అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
కర్ణాటక దిశగా…
బెంగళూరు : నివర్‌ తుపాను పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది. అతితీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా మారి క్రమంగా వాయువ్య దిశగా కర్ణాటక వైపుకు కదులుతున్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. తుపాను ప్రభావంతో బెంగళూరుతో పాటు నగర పరిసరాల్లో తేలికపాటి వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాగల 48 గంటల్లో బెంగళూరు సిటీ, రూరల్‌ ప్రాంతాలతో పాటు కొలార్‌, చిక్కబల్లాపూర్‌, తూమకూరు, మాండ్య, రామానగర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో ఐఎండీ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాల్లో ఈ నెల 27న తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ బెంగళూరు డైరెక్టర్‌ సీఎస్‌ పాటిల్‌ తెలిపారు.

Thanks! You've already liked this