శివసేన ఎమ్మెల్యే సహచరుడి అరెస్ట్‌

ముంబై : మనీలాండరింగ్‌ కేసులో శివసేన ఎమ్మెల్యే ప్రతాప్‌ సర్నాయక్‌ బంధువు, వ్యాపార భాగస్వామి అమిత్‌ చందోల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. ఈ కేసులో ఇది మొదటి అరెస్టు. రాహుల్‌ నందా యాజమాన్యంలోని టాపస్‌ గ్రూపునకు చెందిన కేసులో మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) కింద ఈడీ అరెస్టు చేసిన చందోల్‌ ను గురువారం స్థానిక కోర్టులో హాజరుపర్చనున్నారు. రియల్‌ ఎస్టేట్‌, హోటల్‌ వ్యాపారాల్లో ఉన్న అమిత్‌ చందోల్‌ ఇంటిపై దాడి చేసిన ఈడీ అధికారులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ కేసులో శివసేన ఎమ్మెల్యే సర్నాయక్‌ కుమారుడు విహాంగ్‌ ను ఈడీ ప్రశ్నించే అవకాశముంది. విదేశాలకు డబ్బు తరలించడానికి శివసేన ఎమ్మెల్యే టాప్స్‌ గ్రూప్‌ వ్యాపార సంస్థల్లోకి అక్రమంగా డబ్బు పంపించారని కేంద్ర ఏజెన్సీ చెబుతోంది. కాగా ఈ సంస్థ ప్రమోటర్‌ రాహుల్‌ నందా ఈడీ ఆరోపణలను ఖండించారు. శివసేన ఎమ్మెల్యే తనకు పాత స్నేహితుడని, తన సంస్థలో అతను ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టలేదని రాహుల్‌ నందా స్పష్టం చేశారు. సర్నాయక్‌ అతని కుటుంబసభ్యులు నందా కంపెనీల్లో చట్టవిరుద్ధంగా పెట్టుబడులు పెట్టారని ఈడీ వర్గాలు అంటున్నాయి. కాగా శివసేన ఎమ్మెల్యే విషయంలో ఈడీ చర్యలను రాజకీయ కక్షసాధింపుగా శివసేన పేర్కొంది.

Thanks! You've already liked this