సామరస్యంగా పరిష్కరిద్దాం

బీజింగ్‌: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు శుభాకాంక్షలు చెబుతూ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ఓ సందేశాన్ని పంపించారు. ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించి, ఆరోగ్యకరమైన, సుస్థిరమైన ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిద్దామని ఆ సందేశంలో జిన్‌పింగ్‌ అన్నారు. అమెరికా, చైనా మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు రెండు దేశాల ప్రజల ప్రయోజనాలకే కాదు.. అంతర్జాతీయ సమాజానికి కూడా మేలు చేస్తుందని జిన్‌పింగ్‌ స్పష్టం చేశారు. వివాద రహిత, ఘర్షణ రహిత వాతావరణాన్ని నెలకొల్పి.. విభేదాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని, శాంతి, అభివద్ధి కాంక్షిస్తూ అంతర్జాతీయ సమాజంలో ఇతర దేశాలతో చేతులు కలపి అభివృద్ధిసాధించాలని జిన్‌పింగ్‌ సూచించారు. బైడెన్‌కు జిన్‌పింగ్‌ శుభాకాంక్షలు తెలిపిన రోజే అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కమలా హారిస్‌కు చైనా ఉపాధ్యక్షుడు వాంగ్‌ కిషాన్‌ శుభాకాంక్షలు చెబుతూ సందేశాన్ని పంపించారు. అధికార బదలాయింపుకు ట్రంప్‌ ప్రభుత్వం అంగీకరించిన వెంటనే జిన్‌పింగ్‌ నుంచి ఈ సందేశం వెలువడింది.

Thanks! You've already liked this