కళా ఫ్యామిలీని మోయమంటున్న తమ్ముళ్ళు ?

కళా వెంకటరావు

టీడీపీ పుట్టిన నాటి నుంచి అందులో కొనసాగుతున్న సీనియర్ మోస్ట్ నేత కిమిడి కళా వెంకటరావు. ఉత్తరాంధ్రా జిల్లా నుంచి హోం శాఖ వంటి అతి కీలకమైన మంత్రి పదవిని 23 జిల్లాల ఏపీలో నిర్వహించిన ఘనత కూదా ఆయనదే. టీడీపీ ద్వారా ఎన్నో పదవులు నిర్వహించిన కళా వెంకటరావును నమ్మి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా కూడా చంద్రబాబు చేశారు. అయితే ఆయన చినబాబు పెదబాబులను ప్రసన్నం చేసుకుంటూ పుణ్యకాలమంతా గడిపేశారు. దాంతో 2019 ఎన్నికల్లో సొంత సీట్లోనే ఎమ్మెల్యేగా ఓటమి పాలు అయ్యారు. ఇక ఆ ప్రెసిడెంట్ గిరీ కూడా ఇపుడు లేకుండా పోయింది.

కొడుకు కోసమా….?

ఇక కళా వెంకటరావుకు తన రాజకీయ జీవితం క్లైమాక్స్ కి వచ్చిందని అర్ధమైపోయింది. దాంతో ఆయన అందరి మాదిరిగానే వారసుడి కోసం అరాటపడుతున్నారు. తన తదనంతరం కూడా తన‌ కుమారుడు రూపంలో రాజకీయాల్లో కీలకంగా ఉండాలని పరితపిస్తున్నారు. ఇక కళాను అకస్మ్తాత్తుగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ నుంచి దింపేసిన బాబు కూడా ఆయన పట్ల కాస్తా సానుభూతిగా ఉన్నారు. దీంతో ఆయన రెండు కోరికలు కోరారు. ఒకటి తన తమ్ముడు కుమారుడు కిమిడి నాగార్జునను విజయన‌గరం జిల్లా ప్రెసిడెంట్ గా చేసుకున్నారు. రెండవది తన సొంత కొడుకు కిమిడి రామ్ మల్లిక్ నాయుడుని ఎచ్చెర్ల తరఫున పొలిటికల్ గా ఫోకస్ చేయడం.

తమ్ముళ్ళ రచ్చ ……

నిజానికి కళా వెంకటరావు సొంత ఇలాకా రాజాం. అయితే 2009 అసెంబ్లీ సీట్ల పునర్ విభజనలో అది కాస్తా ఎస్సీగా మారింది. దాంతో ఆయన ఎచ్చెర్లకు రాజకీయ మకాం మార్చారు. ఆ విధంగా ఆయన 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. అయితే ఆయన స్థానికేతరుడైనా సీనియర్ నేత కావడంతో ఎచ్చెర్ల టీడీపీ తమ్ముళ్ళు ఆదరించి గెలిపించారు. అయితే ఆయన రాజాం కేంద్రంగానే రాజకీయాలు నడపడం, ఎచ్చెర్ల పార్టీ నేతలను నిర్లక్ష్యం చేయడంతో 2019 ఎన్నికల్లో వారి అసంతృప్తి కూడా కలసి ఓడిపోయారు. ఇక ఎచ్చెర్లలో 2024 ఎన్నికలకు తన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడుని రెడీ చేసి పెడుతున్న కళా తీరు పట్ల తమ్ముళ్ళు గుస్సా అవుతున్నారుట. ఆయన మాకు వద్దు అనేస్తున్నారు.

భరించలేమంటున్నారుగా…?

తన కుమారుడి పొలిటికల్ ఫ్యూచర్ మీద దృష్టి పెట్టిన కళా వెంకటరావు చంద్రబాబుతో మాట్లాడి రాష్ట్ర కార్యదర్శిగా ఆయన్ని చేశారు. ఇక ఆయన రాజకీయ కేంద్రంగా ఎచ్చెర్లను చేసుకోమన్నారు. తమ కొడుక్కి మద్దతు గా నిలవాలని ఎచ్చెర్ల తమ్ముళ్లకు కబుర్లు పెట్టారట. అయితే వారు మాత్రం తాము నాన్ లోకల్ పాలిటిక్స్ కి మద్దతు ఇవ్వలేమని తెగేసి చెబుతున్నారు. ఎచ్చెర్లలో కళా వెంకటరావు కుటుంబాన్ని తాము మోసే సీన్ లేదని ఏకంగా చంద్రబాబుకే తేల్చి చెబుతున్నారుట. మొత్తానికి కళా వెంకటరావుకు ఇపుడు అన్నీ చెడ్డ రోజులే వచ్చినట్లున్నాయి. రాజాంలో పట్టున్న చోట రిజర్వేషన్ కావడం, ఎచ్చెర్లలో నాన్ లోకల్ ముద్ర పడడంతో కళా వారసుడి రాజకీయ ఎంట్రీకి ఆదిలోనే గండి పడింది అంటున్నారు. మొత్తానికి ఎచ్చెర్ల రచ్చ మీద బాబు ఏ రకమైన డెసిషన్ తీసుకుంటారో చూడాలి.

The post కళా ఫ్యామిలీని మోయమంటున్న తమ్ముళ్ళు ? appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this