కేంద్రం రైతులకు తలొంచింది..

అంతకుముందు ఉద్యమాన్ని తక్కువగా చూసింది..
కాంగ్రెస్‌ నాయకుడు అధిర్‌ రంజన్‌
కోల్‌కతా : వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలు చేపట్టిన మహోద్యమానికి కేంద్రం తలవంచక తప్పలేదని, తప్పదు కూడా అని, అంతకుముందు రైతుల ఉద్యమాన్ని కేంద్రంలోని అదే బీజేపీ ప్రభుత్వం తక్కువ చేసి చూసిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అధిర్‌ రంజన్‌ చౌదురి శనివారం పేర్కొన్నారు. పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ ద్వారా వ్యవసాయ చట్టాలను పరిశీలించాలని, మరిన్ని సంప్రదింపులు జరపాలని తమ పార్టీ కోరిందని అన్నారు. కానీ తమ విజ్ఞప్తిని తోసిపుచ్చి, ఆ బిల్లులను వ్యతిరేకించినపుడు పార్లమెంటు నుంచి కాంగ్రెస్‌ ఎంపీలను సస్పెండ్‌ చేసిందని ఆయన వివరించారు. ‘రైతు వ్యతిరేక బిల్లులను కాంగ్రెస్‌ వ్యతిరేకించినపుడు రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారంటూ అధికార బీజేపీ మమ్మల్ని నిందించింది. పార్లమెంటులో మా సభ్యులను సస్పెండ్‌ చేశారు’ అని లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీ పక్ష నాయకుడు అధిర్‌ రంజన్‌ చౌదురి తన వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. ‘ఇప్పుడు అదే ప్రభుత్వం రైతుల ముందు తలవంచక తప్పలేదు. నిరసనకారులతో చర్చలు జరిపేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తోంది. అయితే రైతుల డిమాండ్లను చాలా అయిష్టంగానే అంగీకరిస్తారు’ అని ఆయన తెలిపారు.

Thanks! You've already liked this