కళ్లు తెరవకుంటే ఇక అంతే?

కేసీఆర్

రాజకీయాల్లో ఎదగడానికి చాలా సమయం పడుతుంది. అదే కూలిపోవడానికి పెద్దగా సమయం అవసరం లేదు. టీఆర్ఎస్ విషయంలో అదే జరుగుతుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా? అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాల్సి ఉంటుంది. ఆరేళ్ల పాటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కేవలం మాటలకే పరిమతమయిపోయిందన్న విమర్శలున్నాయి. దీంతో పాటు ప్రతిపక్షాలను నిర్వీర్యంచేసేందుకే ఎక్కువ సమయం కేసీఆర్ కేటాయించారు.

కాంగ్రెస్ ను బలహీనపర్చేందుకే…..

రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను బలహీనపర్చేందుకే కేసీఆర్ ఈ ఆరేళ్లలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకుని తాత్కాలికంగా సక్సెస్ అయినా బీజేపీ నుంచి ముప్పు ఉంటుందని కేసీఆర్ ఊహించలేకపోయారు. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను బలహీనపరిస్తే చాలునని, తనకు ఇక తిరుగుండదని కేసీఆర్ భావించారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే వేస్టేనన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా నాటింది కేసీఆర్ మాత్రమేనని చెప్పక తప్పదు.

లైట్ గా తీసుకుని…..

పార్లమెంటు ఎన్నికల ముందు వరకూ కేసీఆర్ బీజేపీని లైట్ గానే తీసుకున్నారు. తన కూతురితో సహా నాలుగు సీట్లు బీజేపీ కైవసం చేసుకోవడంతో అప్పటికి కేసీఆర్ కళ్లు తెరిచారు. అప్పటి వరకూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా మద్దతు ఇస్తూ వచ్చిన కేసీఆర్ అప్పటి నుంచి కొంత వెనక్కు తగ్గారు. వివిధ అంశాలను ఇప్పుడు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మరోవైపు ఎంఐఎంను చేరదీయడం కూడా బీజేపీ బలపడటానికి కారణమయిందని చెప్పక తప్పదు.

తీరు మార్చుకోకుంటే…?

గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలను చూసైనా కేసీఆర్ తన తీరును మార్చుకోవాల్సి ఉంది. ఎన్నికలప్పుడే ఫెడరల్ ఫ్రంట్ అని కేసీఆర్ నినదిస్తే నమ్మే రోజులు పోయాయి. నిరంతరం బీజేపీపై పోరాడితేనే కొంత వరకూ తెలంగాణలో నిలదొక్కుకునే వీలుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పట్టు పెంచుకున్న బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి మరింత విస్తరించే అవకాశముంది. విస్తరణ సంగతి పక్కన పెడితే గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. సో.. కేసీఆర్ ఇప్పటి నుంచే మేల్కొని ప్రగతి భవన్ ను వీడితే మంచిదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

The post కళ్లు తెరవకుంటే ఇక అంతే? appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this